అశోక విజ‌య‌ద‌శ‌మి ఎప్పుడు.. ఎలా .. ఎక్క‌డ‌-ప్రొఫెసర్ . చల్లపల్లి స్వరూపరాణి —

2600

మతతత్వ చరిత్రకారులు భారతదేశ చరిత్రలో ప్రాచీన యుగాన్ని ‘హిందూ యుగం’గానూ, మధ్య యుగాన్ని ‘ముస్లిం యుగం’గానూ, ఆధునిక యుగాన్ని ‘బ్రిటీష్ యుగం’గానూ విభజించారు. ఈ విభజనకు ప్రాతిపదిక పాలకుల వ్యక్తిగత మతమే అనుకున్నప్పటికీ ప్రాచీన భారతాన్ని పాలించిన రాజుల్లో అత్యధిక మంది హిందువులు కారు. వారి వ్యక్తిగత, అధికారిక మతం బౌద్ధం. ఐలైనప్పటికీ ఆ విషయాన్ని చరిత్రకారులు చాలా సౌకర్యవంతంగా దాటవేసి కట్టుకధలతో చరిత్ర పుస్తకాలు నింపారు. ఆ కట్టుకధలు, పిట్టకధలే నిజమని అశేష ప్రజానీకాన్ని నమ్మబుచ్చారు. రిపబ్లిక్కులలో రాజులు, వాటినుంచి తర్వాత మొదటి ‘రాజ్యం’ అనే స్థాయి పొందిన మగధను ఏలిన బింబిసారుడు నుంచి అశోకుడు, కనిష్కుడు, హర్షవర్ధనుడు, పదో శతాబ్దం వారైన పాల రాజుల వరకూ అనేకమంది రాజులు బౌద్ధాన్ని అవలంబించి, దాని వ్యాప్తి కొరకు కృషి చేసినవారే. అలాగే పాలితులైన ప్రజలు కూడా హిందువులు కారు, వారు బౌద్ధాన్ని లేదా స్థానిక బ్రాహ్మణేతర మతాచారాలను పాటించారు. అందుకే ప్రఖ్యాత సామాజిక వేత్త అయిన గెయిల్ ఆమ్వేద్ట్ మతతత్వ చరిత్రకారుల హ్రస్వ దృష్టికి భిన్నంగా ప్రాచీన కాలంలో ‘బౌద్ధ నాగరికత’ విలసిల్లిందని పేర్కొన్నారు.

భారతదేశాన్ని ఏలిన గొప్ప చక్రవర్తిగానే కాక బౌద్ధాన్ని విసృతంగా వ్యాప్తి చేసినవాడిగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన అశోకుడు కళింగ యుద్ధంలో జరిగిన హింసతో పరితాపం చెంది యుద్ధం తర్వాత పదవరోజున బౌద్ధ ధర్మాన్ని స్వీకరించిన రోజును బౌద్ధ చరిత్రలో ‘అశోక విజయ దశమి’ గా పేర్కొన్నారు. అశోకుడు చెట్లు నాటించాడు అని చెప్పే చరిత్రలో ఆయన బౌద్ధాన్ని విస్తరింపచేసిన విధానాన్ని గురించి అంతగా రాయరు, ఆయన మతమార్పిడి ఎదో ‘మారుమనసు’మాదిరి చెప్పుకొస్తారు. అశోకుడు వ్యక్తిగతంగా బౌద్ధాన్ని అవలంబించడంతో పాటు తన రాజ్యాన్ని ‘బౌద్ధ రాజ్యం’గా ప్రకటించాడు. కేవలం యుద్దం చెయ్యడం అనేది వదిలెయ్యడమే కాక అహింసను అన్ని కోణాల్లో ఆచరించాడు. వైదిక కర్మకాండలలో జరిగే జంతుబలితో పాటు రాజుగారి వంటింట్లో కూడా జంతువులను చంపడాన్ని నిషేధించాడు. వైదిక మతం యజ్ఞ యాగాది కర్మ కాండలతో మతాన్ని ఒక సంక్లిష్టమైన వ్యవహారంగా మార్చడాన్ని వ్యతిరేకించి వైదిక పరమైన క్రతువులను నిషేధిస్తూ ఆజ్ఞలు జారీ చేశాడు. తన పరిపాలనలో బౌద్ధ ధర్మ ప్రచారం కోసం ‘ధర్మ మహా మాత్రులు’ అనే అధికారులను నియమించాడు. అశోకుని రాజధాని అయిన పాటలీపుత్రంలో మూడవ బౌద్ధ సంగీతిని నిర్వహించి బౌద్ధ సంఘంలో అప్పటికి చోటు చేసుకున్న క్రమశిక్షణా రాహిత్యాన్ని చక్కదిద్ది, కొత్తగా పుట్టుకొస్తున్న శాఖల మధ్య సమన్వయాన్ని తీసుకురావడానికి కృషి చేశాడు. దేశ దేశాల్లో బౌద్ధాన్ని విస్తరింప చెయ్యడానికి తన కూతురు ‘సంఘమిత్ర’నూ, కొడుకు ‘మహేంద్ర’నూ పంపాడు. అశోకుడు కట్టడాలపరంగా కూడా బౌద్ధాన్ని వ్యాప్తి చేశాడు. తన అధీనంలో ఉన్న భూభాగమంతా బౌద్ధ స్తూపాలనూ, చైత్యాలనూ, విహారాలనూ నిర్మించాడు.

ఈ కార్యక్రమాలన్నీ ఒక ఎత్తయితే అశోకుడు వైదిక కర్మలను నిషేధించడం వల్ల ఆయన బౌద్దాభిమానిగా కంటే బ్రాహ్మణ ద్వేషిగా గుర్తింపు పొందాడు. అశోకుడు బ్రాహ్మణ పూజారులకు ప్రాధాన్యత ఉండే యజ్ఞ యాగాది క్రతువులను నిషేధించడంతో పూజారి వర్గం జీవనోపాధి కోల్పోవడమే కాక అసంతృప్తితో వారు అశోకునికి శత్రువులుగా మారి కుట్రలు చేశారు. వారు మౌర్య సామ్రాజ్య పతనం దిశగా పనిచేశారు. అశోకుని మనుమడైన బృహద్రదుని సైన్యాధ్యక్షుడు, బ్రాహ్మణుడైన ‘పుష్యమిత్ర శుంగుడు’ రాజుని ఖూనీ చేసి రాత్రికి రాత్రి సింహాసనాన్ని చేజిక్కించుకుని శుంగ రాజ్యాన్ని స్థాపించాడు. అతడు రాజ్యానికి రావడంతోనే బౌద్ధపరంగా ద్వేషపూరిత వైఖరిని అవలంబించి తన రాజ్యంలో బ్రాహ్మణాదిక్యతను తిరిగి ప్రతిష్టించాడు. వైదిక క్రతువులను పునరుద్దరించి బౌద్ధ భిక్షువులను చంపి వారి విహారాలను ధ్వంసం చేశాడు. అంతేకాదు పుష్యమిత్రుడు అప్పటివరకు ప్రజల్లో అధికారికంగా చెలామణి అయిన బౌద్ధం స్థానంలో వైదిక మతాన్ని పెంపొందించడానికి అధికారికంగా ఒక శిక్షాస్మృతి ఉండాలని ‘సుమతీ భార్గవ’ అనే బ్రాహ్మణ పండితుని చేత ‘మనుస్మృతి’ ని క్రోడీకరింపజేశాడు. ‘మనుస్మృతి’ ఒక సాధారణ మత గ్రంధంగా కంటే అధికారిక పత్రంగా, తమదైన ‘రాజ్యాంగం’ గా చాలాకాలం పాటు భారత దేశంలో చెలామణి అయ్యింది. అసమానతలకు ప్రాతిపదిక అయిన వైదిక హిందూ మతం ఆ సామాజిక చట్రాన్ని మనుస్మృతి ద్వారా స్తిరీకరింపజేసిందని దాని ప్రకారమే సమాజం చాలాకాలం నడిచి సూద్ర, అతిసూద్ర కులాలనూ, స్త్రీలనూ కట్టడి చేశారని అంబేద్కర్ ‘ప్రాచీన భారతదేశం లో విప్లవం-ప్రతీఘాత విప్లవం’ అనే వ్యాసంలో వివరించాడు. ఈ రకమైన విశ్లేషణ మనకి చరిత్ర పుస్తకాల్లో కనిపించదు. జాతీయవాద చరిత్రకారులు కూడా అశోకుడు గొప్ప రాజు అంటారుగానీ ఆయనలోని బౌద్ధభిమాన కోణాన్ని వొదిలేస్తారు. అశోకుడు వేసిన శాసనాల ద్వారానే కాక, బౌద్ధ సాహిత్యం ద్వారా కూడా ఆయన బౌద్దాభిమానం వ్యక్తమయింది. బౌద్ధ సాహిత్యం ఆయన్ని ‘దేవానాం ప్రియ, ప్రియదర్సి రాజా’ అని పేర్కొంటుంది. ఆయన పరిపాలనా దక్షత, ప్రజోపయోగ కార్యక్రమాలు, బౌద్దాభిమానం రీత్యా ప్రఖ్యాత బ్రిటీష్ చరిత్రకారుడైన H.G.Wells పదివేలమంది రాజుల్లో అశోకుడు ఒక్కడే ఒక ద్రువతారలా వెలుగొందే చక్రవర్తి అనే పేర్కొన్నాడు.

అశోకుడు బౌద్ధానికి అందించిన తోడ్పాటు పట్ల, ఆయన అసమానతకు ప్రాతిపదికగా ఉండే వైదిక మతాన్ని వ్యతిరేకించడం పట్ల ఆకర్షితుడైన అంబేద్కర్ అశోకుడు బౌద్ధ ధర్మాన్ని స్వీకరించిన విజయ దశమి రోజున 1956లో బౌద్ధంలోకి మారాడు. ఆయన చారిత్రిక పరిణామాల పరంగా భారతదేశ చరిత్రను బౌద్ధానికి వైదిక హిందూ మతానికి మధ్య జరిగిన ఘర్షణ గా అభివర్ణిస్తూ సమతనూ, సామాజిక విప్లవాన్ని ప్రతిపాదించిన బౌద్ధాన్ని అంతమొందించి, అసమానత్వాన్ని తిరిగి మునుస్మ్రుతి ద్వారా ప్రతిష్టించి బ్రాహ్మణవాదులు ప్రతీఘాత విప్లవానికి తెరలేపారని అంబేద్కర్ పేర్కొన్నాడు. ఇక్కడ బౌద్ధంలోని సమత, కరుణ, ప్రజ్ఞ అనే భావనల ద్వారానే సామాజిక రుగ్మతలైన కుల వివక్ష, లింగ వివక్ష సమసిపోయి సామాజిక ప్రజాస్వామ్యం వస్తుందని, ఈ దేశాన్ని తిరిగి బౌద్ధ దేశంగా మార్చడం తన జీవితాశయాలలో ఒకటని పేర్కొన్నాడు. అశోక ధర్మ చక్రాన్ని, నాలుగు సింహాల అశోక స్తంభాన్ని ఈ దేశపు చిహ్నాలుగా చేర్చడంలో ఆయన ఉద్దేశం అదే.

చరిత్రను విస్మరించినవాడు చరిత్ర హీనుడౌతాడు అని బాబాసాహెబ్ అంబేద్కర్ అంటారు. చరిత్రలో కట్టు కధలు, పిట్ట కధలకు కాలం చెల్లింది. భారతీయత అనేది హైందవంలో ఉందని చెప్పే కుహనా జాతీయవాదుల ‘దేశభక్తి’ వారి వారి సొంత కుల, మత భక్తి, ‘దేహభక్తి’ తప్ప మరేదీ కాదని ప్రాచీన భారతదేశ చరిత్ర రుజువు చేస్తుంది.