వైసీపీ పాలన కంటే, బ్రిటీష్ వారి పాలనే నయం

2140

రాష్ట్రంలో పరిపాలన చూస్తుంటే బ్రిటీషువారిపాలనే నయమనిపిస్తోం దని, ఆనాడు వారు మాతృభాషకు మంగళం పాడి, ఇంగ్లీషుని ప్రజలపై రుద్దారని, 74ఏళ్ల తరువాత ఏపీలో ఇప్పుడు అదే చూస్తున్నామని టీడీపీఎమ్మెల్సీ దీపక్ రెడ్డి స్పష్టంచేశారు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే, నాటి బ్రిటీషువారి పాలనకు, నేడు జగన్ పాలనకు అనేక సారూప్యతలు ఉన్నాయన్నారు. బుధవారం ఆయన తన నివాసంనుంచి జూమ్ యాప్ ద్వారా విలేకరులతో మాట్లాడారు. ఆనాడు ఆంగ్లేయులు భారతీయులను కులం, మతం, ప్రాంతాల వారీగా విభజించి పాలిస్తే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తన స్వార్థంకోసం ప్రజలమధ్య అలానే చిచ్చు రేపుతున్నాడన్నారు. ఈస్టిండియా కంపెనీవారు వ్యాపారం కోసం దేశాన్ని పాలిస్తే, వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో శాండ్, ల్యాండ్, లిక్కర్, మైనింగ్ మాఫియాలను యథేచ్ఛగా సాగిస్తోందన్నారు. ఆనాడు పోలీస్ వారు భారతీయులపై లాఠీలు ఝళిపిస్తే, ఈనాడు ఏపీలోని పోలీసులు రాష్ట్ర ప్రజలను శిక్షిస్తూ, వైసీపీవారికి వ్యక్తిగత సెక్యూరిటీ గార్డుల్లా పనిచేస్తున్నారని దీపక్ రెడ్డి మండిపడ్డారు. ఆనాడు ప్రజలు ఎవరైనా మాట్లాడితే, వారిపై దాడిచేసేవారని, నేడున్న వైసీపీ ప్రభుత్వం కూడా అదేవిధంగా ప్రశ్నించేవారిపై, మీడియాపై దాడులకు తెగబడుతోందన్నారు. ప్రభుత్వ దుర్మార్గాలను ఎదిరించి నిలిచే నాయకులపై కేసులు పెట్టే సంస్కృతిని తెల్లవాళ్లు ప్రారంభిస్తే, నేడు వైసీపీవారు దాన్ని కొనసాగిస్తూ, టీడీపీనేతలపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని దీపక్ రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. బ్రిటీషు పాలనలో కలెక్టర్లు డబ్బులు పోగుచేయడానికే పరిమితమయ్యేవారని, నేడు రాష్ట్రంలోని కలెక్టర్లు కూడా ప్రభుత్వానికి అదేపని చేస్తూ, ప్రజలకష్టాలను పట్టించుకోవడం లేదన్నారు. సాంకేతికత పెరిగినా, ప్రజలకు సకాలంలో రక్షణ, వైద్యసేవలు అందించలేని ఘనత వైసీపీ ప్రభుత్వానికే దక్కిందన్నారు. దళితమహిళను అత్యంత కిరాకతంగా పదిమంది మూడురోజులపాటు అత్యాచారం జరిపి, పోలీస్ స్టేషన్ వద్ద పడేసి వెళ్లిన సంఘటన, బ్రిటీషుపాలనలో కూడా జరిగి ఉండదన్నారు. దళితయువకుడికి శిరోముండనం చేసినఘటన దారుణమని, తనకు జరిగిన అవమానంపై సదరు యువకుడు రాష్ట్రపతికి లేఖరాస్తే, మంత్రులు అతన్నిఅవహేళన చేయడం సిగ్గుచేటని దీపక్ రెడ్డి ఆగ్రహించారు. స్థానికఎన్నికల్లో నామినేషన్లు వేయడానికి వెళ్లిన మహిళలపై అసభ్యంగా ప్రవర్తించిన అధికారపార్టీ వారు, వారిదుస్తుల్లో చేతులుపెట్టి, ఎంతఅసభ్యంగా ప్రవర్తించారో అందరం చూశామన్నా రు. ఇదేనా రాష్ట్ర ప్రజలకు వచ్చిన స్వాతంత్ర్యం అని దీపక్ రెడ్డి నిలదీశారు. దళిత యువకుడు తనకు జరిగిన అవమానంపై రాష్ట్రపతికి లేఖరాస్తే, రాష్ట్ర మంత్రులు అతని గురించి అవహేళనగా మాట్లాడటం సిగ్గుచేటన్నారు. ప్రజలకు పప్పుబెల్లాల్లా చిల్లర పంచుతున్నామని, మేం ఏమిచేసినా వారు పడుండాలంటూ అధికార పార్టీవారు అహంకారంతో వ్యవహరిస్తున్నారని దీపక్ రెడ్డి మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో ప్రజలకోసం వైసీపీ ప్రభుత్వం ఒక్క రోజుకూడా ఎందుకని అఖిలపక్ష సమావేశం నిర్వహించలేద న్నారు. మండలిలో ఛైర్మన్ ను దూషించి, ప్రతిపక్ష సభ్యులపై దాడిచేయడం ఈ రాష్ట్రంలోనే జరిగిందన్నారు. అధికారంలోకి వచ్చేముందు రాగద్వేషాలకు అతీతంగా పనిచేస్తా నని చెప్పారని, ప్రజావేదిక కూల్చడం అలా పనిచేయడమా అని టీడీపీనేత నిగ్గదీశారు. నేను ఉన్నాను..నేను విన్నాను అన్నవ్యక్తి తన ప్రభుత్వ పాలసీ వల్ల ఇసుకకొరతతో పనిలేకుండా రోడ్డున పడిన భవననిర్మాణ కార్మికుల గోడు వినలేదా అన్నారు. మాటతప్పను, మడమతిప్పను అన్నాయన, అమరావతి విషయంలో ఏంచేశాడో చెప్పాలన్నారు. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ సమయంలో దౌర్జన్యాలు, అరాచకాలకు పాల్పడిన వైసీపీవారిపై ఏం చర్యలు తీసుకుందని ఎమ్మెల్సీ ప్రశ్నించారు.
జే.సీ.దివాకర్ రెడ్డిపై 54 తప్పుడు కేసులు పెట్టినప్రభుత్వం, చివరకు ఆయన్ని కరోనాకు గురిచేసిందన్నారు. బెయిల్ పై ఆయన బయటకు రాగానే వారి అనుచరులపై, వాహనాలపై పోలీసులే దాడిచేసి, ఆయన్ని ఎలాగైనా రెచ్చగొట్టాలని చూశారన్నారు. చివరకు మరో తప్పుడు కేసుతో ఆయన్ని అరెస్ట్ చేసి, పోలీస్ కస్టడీకి తీసుకెళ్లి, కరోనా వచ్చేలా చేశారన్నారు. పోలీస్ కస్టడీలో ఉన్న జే.సీ.ప్రభాకర్ రెడ్డికి కరోనా రావడానికి పోలీసులే కారణమని, డీజీపీ దీనిపై ఏం సమాధానం చెబుతారన్నారు. అనంతపురం, తాడిపత్రి డీఎస్పీలు, ఇతర పోలీస్ అధికారులపై హత్యాయత్నం కేసులు పెట్టాలని దీపక్ రెడ్డి డిమాండ్ చేశారు. తాము న్యాయపరంగా చర్యలు తీసుకోకముందే, ప్రభాకర్ రెడ్డికి కరోనా వచ్చేలా చేసిన పోలీసులపై ప్రభుత్వమే చర్యలు తీసుకోవాలన్నారు. ఈ విధంగా శాడిజం చూపితే ప్రజలు హర్షించరనే విషయాన్ని పాలకులు తెలుసుకోవాలని, వైసీపీకి 50శాతం ఓట్లు వస్తే, టీడీపీకి 40శాతం వచ్చాయని, 100కి 100శాతం ఓట్లు వచ్చినట్లు ప్రవర్తించడం మానుకోవాలన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత అధికారంలో ఉన్నవారిపైనే ఉందని, బీజేపీప్రభుత్వం కూడా రాష్ట్రంలో జరిగే పరిణామాలపై స్పందించాలని దీపక్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రజలను పాలించే హక్కు మాత్రమే పాలకులకు ఉంటుందని, తెలుగుదేశం పార్టీ భయపెడితే భయపడదని, ఎందుకంటే అది దౌర్జన్యాలు, దోపిడీలు, అవినీతిలో నుంచి పుట్టిన పార్టీ కాదనే విషయాన్ని వైసీపీవారు తెలుసుకుంటే మంచిదని టీడీపీఎమ్మెల్సీ హితవు పలికారు.