సెప్టెంబర్ 1, 2 తేదీలలో ముఖ్యమంత్రి జగన్ కడప జిల్లా పర్యటన

1856

దివంగత ముఖ్యమంత్రి డా.వైఎస్ఆర్ వర్ధంతిని పురస్కరించుకుని సెప్టెంబర్ 1, 2 తేదీలలో జిల్లాకు రానున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన ఏర్పాట్లను, కార్యక్రమాలను విజయవంతం చేయాలని.. జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్ అధికారులను ఆదేశించారు.
శనివారం ఉదయం స్థానిక కలెక్టరేట్లోని విసి హాలులో ఎస్పి కె.కె.ఎన్. అన్బురాజన్ తో కలిసి ముఖ్యమంత్రి పర్యటన ముందస్తు ఏర్పాట్లపై ఆయన అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సెప్టెంబర్ 2వ తేదీన దివంగత ముఖ్యమంత్రి డా.వైఎస్ఆర్ వర్ధంతిని పురస్కరించుకుని.. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్ మోహన్ రెడ్డి 1, 2 తేదీల్లో రెండు రోజులపాటు జిల్లాలో పర్యటించనున్నారన్నారు. పర్యటనకు సంబంధించి అధికారిక షెడ్యూలు వివరాలు అందాల్సి ఉందన్నారు.
ప్రాథమిక సమాచారం మేరకు సెప్టెంబర్ 1వ తేదీ మధ్యాహ్నం కడప ఎయిర్ పోర్టుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వస్తారని, అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో ఇడుపులపాయకు చేరుకుని.. ఆ రాత్రి అక్కడే బస చేయడం జరుగుతుందన్నారు. 2న ఉదయం దివంగత ముఖ్యమంత్రి డా.వైఎస్ఆర్ వర్ధంతిని పురస్కరించుకుని వైయస్సార్ ఘాట్ వద్ద ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులతో కలిసి నివాళులర్పించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారన్నారు. అనంతరం గెస్ట్ హౌస్ చేరుకుని మధ్యాహ్నం పైన ఇడుపులపాయ హెలిప్యాడ్ కి చేరుకొని అక్కడి నుంచి కడప విమానాశ్రయం చేరుకొని.. తదుపరి విజయవాడ బయల్దేరి వెళ్తారని పేర్కొన్నారు. కొవిడ్-19 నేపథ్యంలో స్టాండర్డ్ ఆపరేషనల్ ప్రోటోకాల్ (SOP) తప్పనిసరిగా పాటించాలన్నారు. కరోనా నియంత్రణలో భాగంగా అతి తక్కువ సంఖ్యలో ముందస్తుగా అనుమతించిన వారిని మాత్రమే.. ముఖ్యమంత్రి పర్యటనలో అనుమతించడం జరుగుతుందన్నారు. ఈ మేరకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇడుపులపాయ ఎస్టేట్, ముఖ్యమంత్రి పర్యటన విధుల్లో ఉన్న వారందరికీ కరోనా పరీక్షలు నిర్వహించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలన్నారు. పారిశుద్ధ్య పనులు పక్కాగా నిర్వహించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ప్రజల నుంచి వచ్చే అర్జీలను స్వీకరించేందుకు… అక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన “స్పందన” వాలంటీర్ల ద్వారా స్వీకరించి అనంతరం ముఖ్యమంత్రికి అందజేయడం జరుగుతుందన్నారు. కడప ఎయిర్ పోర్టు, ఇడుపులపాయ హెలిప్యాడ్, వైయస్సార్ ఘాట్ వద్ద ప్రోటోకాల్ మేరకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను, ఇతర కార్యక్రమాల ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు.
సమావేశంలో ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ మాట్లాడుతూ కోవిడ్-19 పరిస్థితుల దృష్ట్యా ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి అన్ని జాగ్రత్తలతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి బసచేసే అతిధి గృహం, వివిఐపి ల వసతి గృహాల వద్ద.. ఇడుపులపాయ హెలిప్యాడ్, ఎస్టేట్ వద్ద, గెస్ట్ హౌస్ వద్ద, రోడ్ సైడ్, ప్రత్యేక పటిష్టమైన భద్రతా ఏర్పాటు చేయాలని సూచించారు.
మాస్కులు లేని వారిని ఎట్టి పరిస్థితులలో అనుమతించమని చెప్పారు. ప్రతి ఒక్కరూ సామాజిక దూరం తప్పనిసరిగా పాటించాలన్నారు. అనంతరం వివిధ అంశాలపై కలెక్టర్, ఎస్పీ సమీక్షించి వివిధ విభాగాలకు చెందిన అధికారులకు సీఎం పర్యటన ప్రత్యేక బాధ్యతలను అప్పగించడం జరిగింది. వారికి కేటాయించిన విధులపై కలెక్టర్ తగిన సూచనలు జారీ చేశారు.
ఈ సమావేశంలో జేసి (అభివృద్ధి) సి.ఎం.సాయికాంత్ వర్మ, జేసీ (సంక్షేమం) ధర్మ చంద్రారెడ్డి, కడప సబ్ కలెక్టర్ పృద్వితేజ్, డిఆర్వో ఎ. మాలోల, పాడ ఓఎస్డి అనిల్ కుమార్ రెడ్డి, కడప నగర పాలక కమీషనర్ లవన్న, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సతీష్ చంద్ర, స్టెప్ సీఈఓ డా.రామచంద్రారెడ్డి, విద్యుత్, ఆర్ అండ్ బి, పీఆర్ శాఖల ఇంజనీర్లు, వివిధ శాఖల జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, తహసిల్దార్లు తదితరులు పాల్గొన్నారు.