న‌వ‌ర‌స న‌ట‌సామ్రాట్‌-అక్కినేని-కెవి.రామ‌కృష్ణ‌, సీనియ‌ర్ జ‌ర్న‌లిస్్ట‌

1392

సెప్టెంబర్ 20 అక్కినేని జయంతి

మహోన్నత వ్యక్తిత్వం అక్కినేని సొంతం.మౌనంగానే ఎదిగినవాడు, ఎదిగినకొద్దీ ఒదిగినవాడూ, సినీ కళామతల్లికి ముద్దుబిడ్డగా, సినీ పరిశ్రమకే పెద్ద దిక్కుగా మారినవాడూ… ఎవరు అంటే ఇంకెవరు మన అక్కినేని నాగేశ్వరావు అనే చెప్పాలి. జీవితమంతా అప్రతిహతంగా అఖండమైన విజయాలను సాధిస్తూనే కించిత్ గర్వం లేకుండా నిరాడంబరంగా, స్నేహశీలిగా, అందరితో కలసి మెలసి ఉండే ఆయన వ్యక్తిత్వం అనన్య సామాన్యం. ఆ మహానటుని జయంతి సందర్భంగా కొన్ని సుమధుర మధుర స్మృతులను గుర్తు చేసుకుందాం.
సినీ పరిశ్రమ కౌమార దశలో ఉన్నప్పుడే చిత్రసీమలో అడుగుపెట్టారు ఆయన. పరిశ్రమతో పాటుగా ఆయన కూడా అభివృద్ధి సాధిస్తూ నటుడిగా తనను తాను మలచుకున్నారు. తొలితరం జానపద హీరోగా ప్రేక్షకులను తన నటనతో ఉర్రుతలూగించారు. బయట ప్రపంచంలో భిన్న వ్యక్తులు, వ్యక్తిత్వాల మధ్య జీవిస్తూ, నటిస్తూ అపార జ్ఞానాన్ని సొంతం చేసుకుని, బడిలో నేర్చుకున్నది మాత్రమే చదువు కాదని నిరూపించారు. చదువుకున్నవారు కూడా తిరిగి చదువవలసిన పరిశోధనా గ్రంధంగా ఆయన తన జీవితాన్ని తీర్చిదిద్దుకున్నారు.
నటనలో ఆయన నవరసాలు పండించారు. కలల రాకుమారుడిగా వెలుగొందుతున్న తరుణంలోనే అపర భక్తునిగా నటించి అందరిని అబ్బురపరిచారు. భక్తుని పాత్రలో నటించి, భక్తి భావాన్ని రక్తి కట్టించి అందరిని మెప్పించడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఆయన భక్తుడిగా నటిస్తే ప్రేక్షకుల మనసులు భక్తిభావంతో నిండిపోయేవి. కోట్లాది అభిమానుల హృదయాల్లో భగవంతుని చూడగల నిజమైన ఆస్తికుడు ఆయన.
తెలుగు చిత్రసీమకు తొలి రాజకుమారుడు ఆయనే అయినా సంసారం చిత్రం తరువాత సాంఘిక చిత్రాలలో సైతం ఆయన విజయ పరంపర నిరాటంకంగా కొనసాగింది. దేవదాసు వంటి బలహీనమైన పాత్ర జీవితాన్ని అంతం చేస్తుంది కనుక, అలాంటి బలహీనతలకు లొంగకూడదనే గుణపాఠాన్ని నేర్చుకోవాలనే సందేశం ఆ పాత్ర కలుగజేస్తుందని, కనుకనే ఆ పాత్ర తనకెంతో స్ఫూర్తిదాయకం అని తరచూ అనేవారు ఆయన.
రొమాంటిక్ హీరో అనే పదానికి పర్యాయపదంగా మారారు అక్కినేని. అమెరికాలో గుండె ఆపరేషన్ తరువాత ఆయన రెట్టించిన ఉత్సహంతో వెండితెర చందమామలా వెలుగొందారు. సాంఘిక, పౌరాణిక, జానపద సినిమాల్లో అనితరసాధ్యమైన తన నటనతో ప్రేక్షకులను మెప్పించారు. సుదీర్ఘ తన నటనా ప్రస్థానంలో మరచిపోలేని ఎన్నో పాత్రల్లో పరకాయ ప్రవేశం చేసారు అక్కినేని.
దిగ్గజాల వంటి బహుముఖ ప్రజ్ఞశాలులైన కళాకారులతో, దర్శకులతో, రచయితలతో పని చేసిన అనుభవంతో అయన తన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుకున్నారు. మంచి పాత్రను ఒక ఆశీర్వాదంగా భావించి భక్తిగా, శ్రద్దగా, వృత్తిపట్ల నిబద్దతతో జీవించి పలువురికి మార్గదర్శకులుగా నిలిచారు ఆయన. అభిరుచిగల నిర్మాతగా దర్శకుడు ఆదుర్తి సుబ్బారావుతో కలసి “చక్రవర్తి చిత్ర” పతాకంపై “సుడిగుండాలు”, “మరో ప్రపంచం” వంటి సందేశాత్మక చిత్రాలను నిర్మించారు.
సన్మానాలు, సత్కారాలకన్నా కూడా తాను ధరించిన పాత్రల గురించి విశ్లేషించడమే నిజమైన సత్కారం అని తరచూ అంటుండేవారు ఆయన. హీరోయిన్ తో కలసి హుషారుగా స్టెప్పులేసి అభిమానుల గుండెలను కొల్లగొట్టారు. సొగసైన నాట్యంతోపాటు కొంటె చూపులతో, చక్కని హావభావాలతో పాటలను మరింత రక్తి కట్టించారు. మాటలలో వర్ణించలేని సున్నితమైన మనోభావాలను తన హావభావాలతో వ్యక్తపరిచేవారు అక్కినేని. –
తాను చదువుకోలేనందుకే పేదరికంలో ఉన్న ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉపకార వేతనాలు, విరాళాలు, ఎన్నో గుప్తదానాలు అందించారు. నిజ జీవితంలో నటించడాన్ని ఏవగించుకునే అక్కినేని నట జీవితంలో తాను దైవంగా భావించే వృత్తిలో చివరి అంకం వరకూ అంకితమవ్వాలనే కోరుకున్నారు. తన సుదీర్ఘ నటనా ప్రస్థానంలో అనితరసాధ్యమైన ఎన్నో పాత్రల్లో నటించి, మరెన్నో మరపురాని చిత్రాల్లో తనకు మాత్రమే సాధ్యమయ్యే నటనతో అభిమానులను మెప్పించారు.
నిజ జీవితంలో నటించడం ఆయనకు అలవాటులేదు. నట జీవితంలో జీవించడం తప్ప నటించడం ఆయనకు చేతకాదు. నటుడిగా ఆయన అందుకోని అవార్డు లేదు, పొందని సత్కారం లేదు. ఆయన నటనను మాములు మాటలతో వివరించడం ఒక విధంగా సాహసమే అవుతుంది. చివరిదాకా నటనలోనే జీవించాలని, తుదిశ్వాస విడిచేదాకా తెరపైన నటిస్తూనే ఉండాలన్నది అక్కినేని ప్రగాఢ వాంఛ. ‘మనం’ చిత్రంలో నటిస్తూనే తన ఆకాంక్షను నెరవేర్చుకున్నారు ఆయన. దటీస్ అక్కినేని.