పుట్టినూరు పట్ల ఒకింత ప్రేమ, మట్టి మనుషులంటే గౌరవం గల హృదయం ప్రతీ సంవత్సరం రాయపూర్ వైపు లాగేది. అలా వీలున్నప్పుడల్లా మధ్య భారతంలో వాలిపోయే నాకు కోవిడ్ కారణంగా అవాంఛనీయ తీరిక దొరికింది. అనుకోకుండా టిక్కెట్లు కూడా దొరకడంతో సహచరిని తీసుకుని వాలిపోయాను. మూడ్రోజుల యాత్రలో భాగంగా రెండు ఆసక్తికరమైన ఆశ్రమాల్ని చూసాను. ఒకటి ‘దామా ఖేడా’ అనే గ్రామంలో ‘కబీర్ ఆశ్రమ్’ ఐతే, మరోటి ‘నవపారా’ అనే గ్రామం లో ‘కబీర్ మందిర్’ పేరిట స్థాపించబడింది.
రెండు చోట్లా కాసేపు చర్చించాను. ఇద్దరూ రెండు భిన్నమైన ఉదారవాద భావజాలానికి ప్రతీకగా అనిపించారు. ఒక శాఖ ప్రకారం కబీర్ భగవత్ స్వరూపుడు ఆయన భూమ్మీదికి నాలుగు రూపాల్లో వచ్చాడు. కలియుగంలో కబీర్ గా అవతరించాడు. ఈ ఆశ్రమంలో ఒకచోట సాధువులు, ఆధ్యాత్మిక వేత్తల ఫొటోల మధ్య గాంధీ ని కూడా ఉంచారు.
సత్యసంధతకి గాంధీజి వెచ్చించిన జీవితాన్ని గౌరవించి అలా పెట్టినట్లు ఆశ్రమ నిర్వహకులు చెప్పారు.ఇక రెండో శాఖ ప్రకారం కబీర్ మానవమాత్రుడు. నైతిక ఆచరణ శీలి. మొదటివారు వారసత్వ గురు పరంపరని నమ్మితే, రెండవ శాఖ వారు యోగ్యత ఆధారంగా వ్యక్తిపవిత్రతనివిశ్వసిస్తారు.దేశవ్యాప్తంగా కొన్ని ఆశ్రమాలు నిర్మించుకుని బ్రహ్మచర్యాన్ని, కొన్ని నైతిక విలువలను రెండు శాఖలు ప్రచారం చేస్తున్నారు.
ఉత్తర భారతంలోని వారణాశిలో పుట్టి జీవితాంతం హేతువాదాన్ని, తర్కాన్ని ప్రచారం చేసి అనేక అపసవ్య ధోరణులను ప్రశ్నించి హిందూ ముస్లిం సిఖ్ ల మత సమైక్యత కి నిజమైన ప్రతీకగా మానవత్వానికి మమేకమైన ప్రవక్తగా నిలిచిన “కబీర్” ప్రభావం భక్తి ఉద్యమం పై ఎంత ఎక్కువ ఉందంటే, బి.ఆర్. అంబేద్కర్ కబీర్ ని తన గురువుగా ప్రకటించారు.
సామాజిక దృక్పథంతో సాంస్కృతిక రంగంలో పనిచేస్తున్న ‘కబీర్ కళా మంచ్’ కార్యకర్తల పట్ల రాజ్యం అనుసరిస్తున్న ఆధిపత్యానికి సాక్షులుగా ఉన్నవేళ,దేశవ్యాప్తంగా లౌకికవాద భిన్న స్రవంతులన్నీ హైందవీకరణ చెందుతున్న సమయంలో అనేక అభిప్రాయాలతో విభేదాలు ఉన్నప్పటికీ (ముఖ్యంగా స్త్రీల పట్ల కబీర్ కి గల చులకన భావనలకి) విభిన్నతని కాపాడుకోవడంలో భాగంగా ఆయా మార్గాల్ని తెల్సుకోవడం ఆ మేరకు చర్చించడం ఆరోగ్యకరమని నా అభిప్రాయం.
చివరగా పచ్చని చత్తీస్‌గఢ్ గ్రామాల్ని చూస్తూ ఉదయపు నీరెండని వెంటేసుకు తిరిగే పిల్లగాలుల్ని తనివితీరా పీలుస్తూ దూసుకుపోతున్న మాకు మారుమూల గ్రామాల్లో కూర్చున్న అంబేద్కర్ విగ్రహం, జైనమహావీరుడి విగ్రహం, ఒక భవనం పై ఇష్టపడి వేసుకున్న భగత్ సింగ్ బొమ్మతో పాటు రహదారి పక్క ఒక శ్రమజీవి చేతుల్లో రూపుదిద్దుకున్న నిలువెత్తు కబీర్ విగ్రహం ముచ్చటగొల్పింది.
ఉత్తర భారతంలోని వారణాశిలో పుట్టి జీవితాంతం హేతువాదాన్ని, తర్కాన్ని ప్రచారం చేసి అనేక అపసవ్య ధోరణులను ప్రశ్నించి హిందూ ముస్లిం సిఖ్ ల మత సమైక్యత కి నిజమైన ప్రతీకగా మానవత్వానికి మమేకమైన ప్రవక్తగా నిలిచిన “కబీర్” ప్రభావం భక్తి ఉద్యమం పై ఎంత ఎక్కువ ఉందంటే, బి.ఆర్. అంబేద్కర్ కబీర్ ని తన గురువుగా ప్రకటించారు.
మనిషికి మద్దతుగా సంత్ రవిదాస్ లాగా (ఈయన కూడా భక్తి ఉద్యమకారుడు, విప్లవాత్మక భావాల ప్రచారకుడు) ‘బేగంపురా’ ఆదర్శ వ్యవస్థని మధ్య యుగంలోనే దర్శించి, ఛాందసత్వానికి వ్యతిరేకంగా గొంతువిప్పిన ఒక మానవతావాదిని స్మరించుకోవడం మతోన్మాద సమాజంలో అవసరమే కదా..?
గౌరవ్