కత్తి వాదర మీద నిలిచిన ప్రేమ

1349

ఇద్దరు మేజర్లైన యువతీ యువకులు కలిసి బ్రతకాలనికున్నప్పుడు సమ్మతి ఇద్దరిదే ముఖ్యంగానీ ఇతరులది కాదు, మహా అయితే వాళ్లిద్దరి కుటుంబాలది, ఇప్పుడా అనుమతి కుటుంబాలు, వీధి, వూరు దాటేసి రాజ్యం అనుమతికూడా వుండాలనే నిబంధనలో భాగమే ఉత్తరప్రదేశ్ చట్టవ్యక్తిరేక మతమార్పిడి చట్టం, 2020.
రాజాయ్నీ రాజు, వూరిపెద్ద, ఇంటిపెద్ద వరకూ ఒక్కొక్కరి నుండి విముక్తిపొందుతూ మనిషి తన వికాసం వైపు నడుస్తోన్న ఆధునిక ప్రపంచ మానవులకు విరుద్దంగా ఒక మనిషి తన జీవితాన్ని ఇస్టరీతిన గాకుండా ఇంటిపెద్ద, వూరిపెద్ద, రాజు దాకా ఈ దేశంలోని మనిషి సంకెళ్లని బిగించుకుంటున్నాడు.

“లవ్ జీహాద్” అనే పదం చట్టంలో చేర్చనప్పటికీ, బయట అధికార యంత్రాంగం మొత్తం బహిరంగగంగా ఉచ్చరిస్తోన్న ఈ పదం ప్రకారపు చట్టం ప్రకారం మతం మార్చాలనే ఉద్దేశ్యంతో హిందూ మహిళని ముస్లిం మగవారు వివాహం చేసుకునే పరిస్తితిని నివారించాలనే ఉద్దేశ్యంతో తెచ్చిన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ చట్టం త్వరలో దేశమంతా విస్తరిస్తుంది, ఇది ముందు రెండు ముఖ్యమైన మతాలమధ్యన అనుమానాల్ని, అగాధాల్ని, తర్వాత విద్వేషాల్ని, ఆ తర్వాత విధ్వంసాల్ని తెస్తుందని గుర్తించాలి.

ఈ పనిని ప్రభుత్వం ఉద్దేశ్యపూర్వకంగా నిర్వహించడమంటే నాటి బ్రిటిష్ ప్రభుత్వం కన్నా దారుణంగా విభజించి మరీ జనాల్ని పాలించాలని భావిస్తోందని అర్థంచేసుకోవాలి. మతాల తర్వాతి వంతు కులాలది వస్తుంది. ఏ కులం మనుషులు ఆ కులంలోనే చేసుకోవాల్సి వస్తుంది. చేయాల్సిన పనులు చేయని, చేయలేని ప్రభుత్వాలు, వాటిని మరిపించడంకోసం చేయకూడని తిండి, దుస్తులు, దాంపత్య జీవితాల్లోకి చొరబడి గందరగోళం, విధ్వంసం చేయడమే అసలు లక్ష్యం అనుకోవాలి.

ఈ చట్టం ప్రకారం మతంలోకి మార్చితే చర్యలు తీసుకోవడం కాదు, కేవలం అనుమానం, అభిప్రాయం కలిగితే చాలు పోలీసులు ఇంటికొస్తారు. పెళ్ళిచేసుకోవలనుకున్న వ్యక్తినేగాదు, అందుకు సహకరించిన అతని కుటుంబ సభ్యులను కూడా పట్టుకుపోతారు. ఈ చట్టం అమలులో పోలీసులకన్నా ఇప్పటికే వున్న గోసమ్రక్షకుల లాగా సామాజిక రక్షకులు వూరూరా కొత్త సామాజిక పెత్తందార్లుగా పుట్టుకొస్తారు. వీళ్లు ముస్లిములతో హిందువులు ఎటువంటి అర్థిక లావాదేవీలే కాదు అంటే సైకిల్ పంచర్ కూడా వేయించు కోనివ్వకపోవడమే కాదు, అసలు రోడ్డుమీద పలకరించినా సంబంధాలు కలిపి పిల్లకి పెళ్లిచేసి మతమార్పిడికి కుట్రపన్నారని కేసులు నమోదు చేయించగలరు. అంటే మొత్తానికి ముస్లిములకు ఈ నేలమీద కాలం మూడిందని అర్థంచేసుకోవాలి.

ఆశొకా యూనివర్సిటీ ప్రొఫెసర్ ప్రకారం ఈ బిల్లు “ముస్లిములని క్రిమినలైజ్ చేయడమే లక్ష్యం” రెండు కమ్యూనిటీలమధ్య సామాజిక అగాధాన్ని మరింత లోతుగా చేశి, వాళ్లమధ్య అపనమ్మకాన్ని కలిగించి, వాళ్లని జంతువులుగా ముద్రవేయడమే ఈ చర్యల లక్స్యం అంటాడాయన. ఇప్పటికే సామాజిక ఒత్తిడి, చాందస పద్దతులు, కట్టుబాట్లు మతాంతర వివాహాల పట్ల క్రూరంగా వుండగా, ఇప్పుడీ చట్టం వాళ్లని మరింత బాధ్యుల్ని చేసి వేధించబోతోంది.

ఈ చట్టం కింద మతమార్పిడి చేయ ఉద్దేశ్యంతో పెళ్లిచేసుకుంటే నాన్-బెయిలబుల్ కేసుతో 10సంవత్సరాలవరకు శిక్ష పడుతుంది. ఈ చట్టం ప్రకారం వివాహానికై తన గురించి సరిగ్గా చెప్పకపోవడం, లొంగదీసుకోవడం, వొత్తిడిచెయడం, బలవంతం చేయడం, ఆశచూపడం, ఇతర తప్పుడు పద్దతుల్లో వివాహం చేసుకోవడం నేరం. అంటే ఈ పదాల మాటున పోలీసులు, లాయర్లు, తీర్పులు ఇష్టానుసారం ఏదొ ఒక దాన్లో ఇరికించేయవచ్చు, దానికి అడ్డూ అదుపూ వుండవన్నమాట. ఈ చట్టం ఇప్పటికే ఉత్తరప్రదేశ్ లో చిత్రమైన హింసలు చేయడం మొదలుపెట్టింది.

ఇద్దరూ ప్రేమించుకున్నప్పుడు ముస్లిం అబ్బాయి హిందూ అమ్మాయికి ఉద్యోగం ఇప్పించాడు, అంటే ఆశపెట్టాడు కాబట్టి జైళ్లో కూర్చొబెట్టారు. పెళ్లికొడుకు సోదరుడిచేత ఆ అమ్మాయికి ఫోన్ కొనిపెట్టించాడు, కాబట్టి పెళ్ళికొడుకు సోదరుడూ జైళ్ళో వున్నాడు. ఒక అమ్మాయీ అబ్బాయీ కాలేజీ రోజులనుండి ప్రేమించుకుని, ఇప్పుడు సెటిలై, పెళ్లి చేసుకోదలిచారు, అయినా సరే ఇందులో కుట్రవుంది అని జైళ్లో నిర్బదించబడ్డారు. ఇలా రోజురోజుకీ విచిత్రాల లిస్ట్ పెరిగిపోతోంది.

పల్లెల్లో ముసిములు ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఇల్లు వదలి పోతున్నారు. భయంతో గడియలేసుకుని ఇళ్ళల్లో బిక్కుబిక్కుమంటున్నారు. పోలీసుల వేధింపులకూ, వసూళ్లకు, సహజంగా వెనుకబడిన రాష్ట్రాల్లోని పోలీసుల మత మనస్తత్వానికీ ఈ చట్టం పెద్ద అయుధమైపోయింది. అసలు చట్టం చేటిలోకి రాగానే అంతకుముందు కేసులన్నీ మార్చేయబడుతున్నాయి. ఒక హిందూ ఆడపిల్ల, ఒక ముస్లిం కుర్రాడు ఇంట్లోంచి వెళ్ళిపోగానే ఒకే కంప్లైంటు మూడుసార్లు ఎలా మారిపోయిందో సోదాహరణంగా వివరించబడడం చూస్తే ఈ చట్టం ఎంతటి చెడు ఫలితాల్ని ఇవ్వబోతోందో అర్థమవుతోంది.

ఈ చట్టం ప్రకారం లేచిపోయిన కుర్రాడి ఇంట్లో వాళ్లందరినీ అనుమానితులుగా జైళ్లో తోసేయవచ్చు. ఇక్కడ గుర్తించాల్సిన విషయం ఏమంటే పెళ్లిచెసుకోవడం కాదు ముఖ్యం, పెళ్లికూతురు మతం మార్చడం కాదు ముఖ్యం, మార్చడానికే అన్న అనుమానం అసలు విషయం. ఒక అనుమానమ్మీద చర్యలు తీసుకోదలిస్తే అందుకు కారణమనుకునే ప్రతి మనిషినీ, ప్రతి కదలికనీ, ప్రతి వస్తువునీ అనిమానించి జైళ్లో తోసేయవచ్చన్నమాట!

“మేజరైన ప్రతి వ్యక్తికీ తన ఇష్టం వచ్చిన వాళ్లని వివాహమాడె హక్కు వుంద”న్న సహజ న్యాయం, ఇంతకు మునుపు చట్టాలూ, కోర్టు తీర్పులూ ఇప్పుడు బుట్టదాఖలు కాబోతున్నాయి. ఇతరమతాల వాళ్లని పెళ్లాడాలంటే 60రోజుల ముందుగానే జిల్లా మేజిస్ట్రేట్ అనుమతి పొందాలి. అలా పొందని వాళ్లు 3నెలలనుండి మూడేళ్ల వరకు జైలుజీవితం అనుభవించాల్సి వస్తుంది. అనుమానమే ఆధారంగా గల ఈ చట్టంలో అనుమతి సహజంగానే తిరస్కృత మవుతుంది. తిరస్కృతి కాకపోతే అయ్యేలా వూరిలోని మతసంఘాలు, కూలసంఘాలు భయపెట్టి, బెదిరించి ఒప్పించడానికి గోరక్షక దళాలు సిద్దంగా వున్నాయి. కొన్ని కేసుల్లో పోలీసులకన్నా ముందే ఈ కాషాయ సంఘాల సభులు పెళ్లి మండపాల్లో ప్రత్యక్షమవడం దీనికి ఉదాహరణగా నిలుస్తోంది.

అప్పటికీ లక్నో లాంటి పట్టణాల్లో చదువుకున్న పెద్దకుటుంబాల వాళ్లు మూడునెలలు తమ పెళ్లిని వాయిదా వేసుకోవడానికి సిద్దపడ్డారు. ఈ చట్టం రాగానె పెళ్ళి మధ్యలో ఆపేసుకున్నవాళ్లు చేతులకున్న గోరిటాకు సాక్షిగా మూడునెలల తర్వాతి అనుమతికోసం ఎదురు చూస్తున్నారు. మరి ఇదే పరిస్తితి మధ్యతరగతి మనుషులకు వుంటుందా? ఇంత రిస్క్ తీసుకుని పేదలు పెళ్ళిళ్లు చేసుకోగలరా? అభ్యుదయమనీ, ఆరోగ్యరీత్యా అవసరమనీ, మంచి వారాస్తవపు పిల్లలకొసమనీ, కొన్ని రాష్ట్రాలలో డబ్బులిచ్చి మరి అంతర్ కులాలు, అంతర్ మతాలూ పెళ్ళిల్లని ప్రోత్సహిస్తోన్నా జరగని పెళ్లిల్లు, ఎంత ప్రేమలుంటే మాత్రం, ఎంత అభ్యుదయ కుటుంబాల తల్లిదండ్రులుంటే మాత్రం ఇన్ని ఇబ్బందులకు ఎదురొడ్డి ఎవరు వివాహం చేసుకోగలరు?

మొన్నటికి మొన్న ఒక తహసీల్ కేంద్రంలో వివాహానికి రిజిస్టర్ చేయించుకోవడానికి వెళ్లగానే పోలీసులు వాళ్లని అరెస్టు చేసారు, పెళ్ళి చేసుకోబోతున్నారని! అక్కడకి వచ్చిన కాషాయ మత కార్యకర్తలు వాళ్లని గేలి చేసి అవమానించారు.

ఇదివరకే దేశంలో, స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద ఇతర మతాల మధ్య వివాహంలోని విషయాల్ని పద్దతిగా పొందుపరచిన తర్వాత కూడా ఈ దుందుడుకు చట్టం తేవడంలో కారణాలు సుస్పష్టం. అందుకనుగుణంగా వున్న ఈ చట్టంలోని వివరాల్ని చూస్తే;

ఆర్డినెనులోని సెక్షన్ 4 ప్రకారం ఈ వివాహాల్ని అంగీకరించని ఏ వ్యక్తయినా, ఆమె లేదా అతని తల్లిదండ్రులు, సోదరీ సొదరులు, లేదా ఆమె అతడి పెళ్ళి వల్ల లేదా దత్తతవల్ల బంధులులైనవాళ్లు ఎవరు కంప్లైంట్ చేసినా అది చెల్లుతుంది. అంటే మొత్తానికి ఈ పెళ్లి ఇష్టంలేని దారినపోయే దానయ్యకూడా తనకిష్టం లేదని వివాహం ఆపేయవచ్చు! ఈ చట్టం అసలు ఉద్దేశ్యం ఇదే, ఒక్క మనిషి కారణం చూపి ఇద్దరి మధ్య బంధాన్ని బద్దలు చేయడమే లక్ష్యం. ఇందులో దారుణం ఏమంటే ఇప్పటికే జరిగిపోయిన వివాహాలని కూడా అయా మనుషులచేత కంప్లైంట్ చేయిచి తవ్వి తీస్తూడడం!

మెల్లగా, తెలియకుండా కాదు వేగంగా, బహాటంగా మనం పురాతన కాలానికి తరళిపోతున్నామని గుర్తెరగాలి.-

— సిద్దార్థి సుభాష్ చంద్రబోస్