అకుంఠిత దీక్షతో అద్భుతమైన నాట్య విద్యను అభ్యసించి, ఆ నాట్యకళకు అంకితమైన నాట్య కళా తపస్విని శ్రీమతి శోభానాయుడు. అప్రతిహతంగా అఖండమైన విజయాలను సాధిస్తూనే నిరాడంబరంగా, స్నేహశీలిగా, అరుదైన వ్యక్తిత్వాన్ని తన సొంతం చేసుకున్నారు శోభానాయుడు. ఇటీవల అనారోగ్య సమస్యలతో బాధపడుతూన్న శోభా నాయుడు హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అశేష అభిమానులను దుఃఖ సాగరంలో ముంచి అనంతలోకాలకు తరలివెళ్లారు. ఆమె నిష్క్రమణతో కూచిపూడి నాట్య రంగం ఒక అద్భుతమైన నాట్య కళాకారిణిని కోల్పోయిందని నిస్సందేహంగా చెప్పవచ్చు.

1956లో అనకాపల్లిలో వెంకట నాయుడు, సరోజినీ దేవి దంపతులకు జన్మించారు ఆమె. వెంపటి చిన సత్యం వద్ద శిష్యరికం చేసిన శోభానాయుడు చిన్ననాటి నుంచే నృత్య ప్రదర్శనలు ఇచ్చారు. తన ప్రతిభతో నాట్య ప్రదర్శనల్లో ఎన్నో ప్రతిష్టాత్మక పురస్కారాలను సొంతం చేసుకున్నారు. నృత్యరూపాలలో ఈమె అన్ని ప్రధాన పాత్రలనూ పోషించి అభిమానులను మెప్పించారు. సత్యభామ, పద్మావతి పాత్రల్లో ఆమె అనితరసాధ్యంగా రాణించారు. పద్మావతిగా ఆమె వేదికపైకి వచ్చారంటే సాక్షాత్తూ ఆ అమ్మవారే మన ముందు ప్రత్యక్షమయ్యారా? అన్నంతలా ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేస్తారామె.
హైదరాబాదులో కూచిపూడి ఆర్ట్ అకాడమీ ప్రిన్సిపాల్‌గా వ్యవహరిస్తూ ఎంతోమంది పిల్లలకు నాట్యంలో ఆమె శిక్షణ ఇచ్చారు. కూచిపూడి నృత్యంలో అంకితభావం ఉన్న నాట్య గురువు, ప్రతిభాశాలి శోభానాయుడు. గత 40 ఏళ్లుగా కూచిపూడి నాట్యంలో శిక్షణ తరగతులు నిర్వహిస్తున్న ఆమెకు ఎంతోమంది శిష్యులు ఉన్నారు. 2001లో పద్మశ్రీ పురస్కారం అందుకున్న శోభానాయుడు దేశ విదేశాల్లో వేలమంది విద్యార్థులను కూచిపూడి నాట్య తారలుగా తీర్చిదిద్దిన ఘనతను సొంతం చేసుకున్నారు.
ప్రపంచ వ్యాప్తంగా వేలాది ప్రదర్శనలు ఇచ్చిన ఆమెకు సినిమాల్లో అరుదైన పాత్రలు ఎన్నో వెత్తుకుంటూ వచ్చినా వాటన్నిటిని సున్నితంగా తిరస్కరించి తన జీవితాన్ని నాట్యానికే అంకితం చేసిన మహోన్నతమైన కళాకారిణి ఆమె. కూచిపూడి నాట్యం అంటే శోభానాయుడు, శోభానాయుడు అంటే కూచిపూడి నాట్యం అన్నంతలా ఆమె అభిమానుల హృదయాల్లో చిరస్మరణీయమైన స్థానం సొంతం చేసుకున్నారు.
కూచిపూడి నాట్యం కోసమే జన్మించిన కళాకారిణి ఆమె. తాను దైవంగా భావించే వృత్తిలో చివరి అంకం వరకూ అంకితమవ్వాలనే కోరుకున్నారు. నాట్య ప్రపంచంలో ఎన్నో తరాలకు స్ఫూర్తిదాతగా నిలిచారు ఆమె. నాట్య రంగంలో ఉన్నత శిఖరాలను అధిరోహించినా ఏమాత్రం గర్వం దరిచేరనివ్వని గొప్ప వ్యక్తిత్వం ఆమె సొంతం. భౌతికంగా ఆమె మనమధ్య లేకపోయినా అభిమానుల హృదయాల్లో ఆమె శాశ్వతంగా నిలిచే ఉంటారు.