—- నరేష్ కుమార్ సూఫీ —
క్రీస్తుకు పూర్వమే… ఈజిప్టులో మరణించినవాళ్ళు మళ్లీ బతికొస్తారని నమ్మేవాళ్ళు. డెడ్ బాడీలని మమ్మీఫై చేసి భద్రంగా దాచిపెట్టేవాళ్ళు. ఎవడి స్థోమతని బట్టి వాడు వస్తువులు, బంగారం కొన్నిసార్లు బానిసలని (అంటే మనుషులే) కూడా ఉంచి పిరమిడ్ అనే సమాధిని మూసేసేవాళ్ళు… వేల సంవత్సరాలు గడిచాయి. ఒక్కడంటే ఒక్కడు కూడా లేచిరాలేదు. కానీ ఆ మమ్మీలు మాత్రం ప్రయోగశాలలకి, ప్రదర్శన శాలలకి తరలించబడ్డాయి. అలా ఈజిప్టులో చనిపోయిన ఓ పదహారేళ్ళ అమ్మాయి మమ్మీఫైడ్ బాడీ మన హైదరాబాద్ మ్యూజియంలో కూడా ఉంది. ఆమె ప్రసవంలో వచ్చిన ఇబ్బందివాళ్ళ చనిపోయి ఉంటుందని తేల్చారు. Mommy కాబోయి Mummy అయిపోయిన ఆ శరీరాన్ని చూసినప్పుడు నాకు వచ్చిన ఆలోచన. ఎదో ఒకనాడు ఆ పిల్ల బతికితీరుతుందనే నమ్మకంతోనే కదా.. ఆమె తల్లితండ్రులు ఆమెమృతదేహాన్ని అలా భద్రపరిచారు. కానీ కొన్ని వేల సంవత్సరాలు తర్వాత ఖండాలు దాటి వెళ్లి మరీ ఇలా ప్రదర్శనలో తమ బిడ్డ శరీరం ఉంచబడుతుందని ముందే తెలిసి ఉంటే…ఆమె తల్లి అలా మమ్మీని చేయటానికి ఒప్పుకునేదా?!?? ఖచ్చితంగా ఒప్పుకునేది కాదనే అనిపించింది… ఏ నమ్మకంతో ఆమె తనబిడ్డని అట్లా ఉంచిందో ఆ నమ్మకం ఆమె బిడ్డ శరీరాన్ని ఇక్కడ ఒక మ్యూజియంలో ఉంచింది… ఎంత దారుణం..
2018లో కూడా ఒక కుటుంబంలో ఉన్న పదకొండు మంది ఆత్మహత్య చేసుకున్నారు. అక్కడ దొరికిన ఆధారాలని బట్టి వాళ్లంతా “మోక్షం దక్కుతుందని, స్వర్గానికి వెళతామని నమ్మకంతో చనిపోయారు. అలాగే.. మొన్నటికి మొన్న యూపీలో పిల్లలు పుట్టటానికని పక్కింటి పిల్లని కిడ్నాప్ చేసి, బలిచ్చి ఆమె శరీర అవయవాలని తిన్నారు. కరోనాని కట్టడి చేస్తా అంటూ ఓ 50 ఏళ్ల వ్యక్తిని బలి ఇచ్చాడు ఒరిస్సాలో ఒక పూజారి. గుప్త నిధులకోసం, పెద్ద పెద్ద భవనాల ఓపెనింగ్ కి ముందు.. నరబలి వార్తలు చూస్తూనే ఉన్నాం. ఎప్పటికప్పుడు ఆ సంఘటనలో ఉన్నవాళ్ళని తిట్టి,వాళ్ళ గుడ్డి నమ్మకానికి విస్తుపోయి. “అయ్యో దేవుడా!” అని నిట్టూరుస్తుంటారు కొంతమంది. ఇక్కడ ఒకసారి ఫిడెల్ క్యాస్ట్రో మాటలని గుర్తు చేసుకుందాం. “ఎవరైనా ఒక పసివాన్ని హత్య చేస్తే అయ్యో పాపం అంటారు. కానీ పోషకాహారం దొరకక, మందులు లేక వందల మంది పిల్లలు చనిపోతుంటే నోరు మెదపరు” అంటాడు. నిజమే మన దృష్టిలో అవన్నీ “ఖర్మ కొద్దీ సంభవించే మరణాలు”
యాక్సిడెంట్ లో ఒక వ్యక్తి చనిపోతే గుద్దిన వాహణదారుడి మీద దాడి చేస్తారు. వైద్యం ఆలస్యం అయితే డాక్టర్ మీద దాడి చేస్తారు. కానీ పూజ చేస్తే రోగం తగ్గుతుంది అని హాస్పిటల్ కి వెళ్లకుండా చేసే పూజారి మీద? స్వస్థత పరుస్తాను అని ప్రేయర్ చేసే పాస్టర్ మీద?? ఏ దాడి ఉండదు. ఒకప్పుడు పాముకరిస్తే “పాముల నర్సయ్యకి ఫోన్ చేసేవాళ్లట” ఇప్పుడు హాస్పిటల్ కి వెళ్తున్నారు. “పుట్టలో పాలు పోయటం మారలేదు” పాముల మీద ఇంత భక్తి ఉన్నవాళ్లు. వేల రకాల పాముల, సారీసృపాల జాతులే అంతరించిపోయేలా జరిగే గ్రానైట్ తవ్వకాలు, చిట్టడవులని, పొలాలని నాశనం చేసే రియల్ ఎస్టేటులు విషయాలు కన్వీనియంట్ గా మర్చిపోతారు.
ఇప్పుడు ఈ విషయాలన్నింటిని గుర్తు చేసుకోవటానికి కారణం అయిన ఘటన విషయానికి వస్తే… మదన పల్లెలో చనిపోయిన ఇద్దరూపిల్లలని చంపింది వాళ్ళ అమ్మానాన్నలు కాదు. మతం చంపింది, దేవుడు అనే పిచ్చినమ్మకం చంపింది. పునర్జన్మ, ఖర్మ సిద్ధాంతం, చనిపోయాక ఉండే అధిభౌతిక లోకాలు లాంటి కల్పనా సాహిత్యం చంపింది. అదంతా తెలిసినా కూడా ఆ కల్పనల మీద ఉన్నానమ్మకం మాత్రం ఆ ఇద్దరు తల్లితండ్రుల “మూఢనమ్మకం” చుట్టూనే తిరుగుతోంది. ఆత్మలు, దెయ్యాలు అనేమాటలు వినీ, వినీ అవి నిజంగా ఉన్నాయి అని నమ్మేవాళ్ళు మనలో చాలామంది ఉన్నారు. సాయిబాబా నా కలలో వచ్చి మాట్లాడతాడు, పుట్టబాబా విభూతి కురిపిస్తాడు అనే మాటలు వింటూ ఆహా మహిమ అనుకున్నా, ఏసుప్రభువు నాతో ప్రేయర్లో మాట్లాడుతాడు అని చెప్పినా వాళ్ళని వెంటనే సైకియాట్రీస్ట్ కి చూపించాల్సిన వాళ్ళు. సైలెంట్ గా ఉండిపోతారు. తర్వాత మొన్న వాళ్ళ కొలీగ్స్ లాగా… ఇప్పుడే విషయం తెల్సినట్టు “ఆశ్చర్యం నటిస్తారు”.
అత్యంత వేగంగా ఆరాధనా భక్తికంటే దారుణంగా ప్రజల్లోకి అండర్ కరెంట్ గా వ్యాపిస్తున్నది. “తంత్ర, మెడిటేషన్, జీసస్ ప్రేయర్” లాంటివి. దర్గాల్లో తాయెత్తులు కట్టే ముల్లాల కంటే దారుణంగా లక్షల ఖర్చుతో టెంట్లు వేసి సువార్త సభల్లో సాక్షం ఇప్పించి మరీ దయ్యాలను తోలే ఆటలు ఆడుతున్నారు పాస్టర్లు. మెడిటేషన్ ద్వారా ఎదో అభౌతిక లోకాల దర్శనం జరుగుతుంది అంటూ జనాలని మెల్లగా అలవాటు చేస్తున్నారు బాబాలు, సద్గురువులు. రెండు నిమిషాలు కార్బన్ డై ఆక్సయిడ్ లెవెల్స్ మన బ్రెయిన్ లో పెరిగినా, బాడీలో వాటర్ కంటెంట్ తగ్గినా కలిగే యిల్యూజన్స్ లాంటిదే ఆ ధ్యాన పద్ధతుల్లో జరిగితే అదే ధ్యానం వల్ల కలిగే అనుభూతి అని నమ్మిస్తున్నారు. మెడిటేషన్ రూపాన్నే మార్చేస్తున్నారు…. వీటన్నిటిని నమ్మేది ఇప్పుడు ఆ పేరెంట్స్ ని వెక్కిరిస్తున్నవాళ్లే. మేము “మూఢభక్తులం కాదు” ఆ పరమాత్ముని నమ్ముతాం అంతే అనేవాళ్ళు “ఆ మూఢత్వంలోకి వెళ్ళేవాళ్ళకి ఇండైరెక్ట్ సపోర్ట్ తామే అని గ్రహించలేక పోతున్నారు.
గుళ్ళూ, చర్చిలు, మతాలు….. నమ్మకాలు, ఆత్మహత్యలు, హత్యలు…. వీటన్నిటికీ కారణం చదువు లేకపోవటం కాదు… వాటికి కారణం మనిషి తాను సొంతగా ఒక్క నిమిషం ఆలోచించుకోలేక పోవటం. హత్య, దారుణ హత్యల్లో ప్రాణం తీయటం అనేది ఎంత నిజమో… “భక్తి నమ్మకం..మూఢభక్తి నమ్మకం” రెండూ ఒకటే అన్నది కూడా అంతే నిజం…
—