కులానికో కుంప‌టి-వంట‌కి ప‌నికొచ్చేనా?

1965
  • అన్నవరపు బ్రహ్మయ్య, జర్నలిస్ట్
    సామాజిక అంశాల విశ్లేషకులు.

వివిధ బిసి కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు ద్వారా బిసి కులాలను ఉద్దరించినట్టుగా ప్రచారం చేసుకోవడం చూస్తుంటే భార్యకు భోజనం పెట్టి ప్రజాసేవ చేస్తున్నట్టు ప్రచారం చేసుకొన్నట్టుగా అనిపిస్తోంది. ఒక రకంగా చెప్పాలంటే ఈ కార్పొరేషన్లు కూడా కుల సంఘాల వంటివే. ఎందుకంటే బిసి కులాల కార్పొరేషన్లకు ఆయా కులానికి చెందిన వ్యక్తిని మాత్రమే ఛైర్మన్ గా నియమించాల్సి వుంది. అందువల్ల ఆయా కులాలవారికి ప్రత్యేకంగా లభించే గుర్తింపుగాని, సదాకాని వుండదు. సహాజంగా ఆర్ధికశాఖ నిబంధనల ప్రకారం ఏర్పాటు చేసిన కార్పొరేషన్లకు ఆర్ధిక స్వాతంత్ర్యత వుంటుంది. రాష్ట్ర ప్రభుత్వం నేరుగా ఆయా కార్పొరేషన్లకు బడ్జెట్ నుంచి నిధులు కేటాయిస్తుంది. ఆ నిధులను ఆయా కార్పొరేషన్లు ఆయా కులాల కుటుంబాల అభివృద్ధికి వినియోగిస్తున్నారు. కాని ప్రస్తుతం ఎంతో గొప్పగా చెబుతున్న బిసి కుల సంఘాల కార్పొరేషన్ అర్ధిక పరంగా ఎటువంటి అధికారం లేని సంక్షేమ అభివృద్ధి (వెల్ ఫేర్ డెవలప్ మెంట్) కార్పొరేషన్లు మాత్రమే. అందువల్ల ఈ కార్పొరేషన్లను ఏర్పాటు బిసి కులాలకు ఒరిగేది ఏమీ లేదు.
రాష్ట్రంలో ఎంతో కీలకమైన పారిశ్రామిక మౌళిక సదుపాయాల అభివృద్ధి సంస్థ, ఎపిఎస్ఆర్టీసి, నీటిపారుదల అభివృద్ధి సంస్థ, పర్యాటక అభివృద్ధి సంస్థ, టిటిడి తిరుమల తిరుపతి దేవస్థానం) బోర్డు, తిరుపతి, విశాఖ, మచిలీపట్నం పట్టణాభివృద్ధి సంస్థలు, ఎపి నైపుణ్య కమిటీ, ఉన్నత విద్యామండలి కమిటీ వంటి దాదాపు 80 ప్రతిష్టాత్మక సంస్థలు వున్నాయి. ఇవి కాకుండా మరో 30 ప్రభుత్వ సలహాదారుల పోస్టులు వున్నాయి.కేబినెట్ హోదా కలిగిన అటువంటి సంస్థలకు ఛైర్మన్లలో కనీసం 20 శాతం పోస్టులలో కూడా బిసీలను నియమించలేదు. ప్రాధాన్యత కలిగిన సంస్థల ఛైర్మన్లుగా ఉన్నతవర్గాల వారిని నియమించి ఎటువంటి ప్రాధాన్యత లేని కులసంఘాల కార్పొరేషన్లకు ఆయా కులాలవారిని ఛైర్మన్లుగా నియమించి బిసీలను ఉద్దరించినట్టుగా ప్రచారం చేస్తున్నారు. ఇదే సమయంలో రాష్ట్రంలో అగ్రకులాలుగా వున్నబ్రాహ్మణ, కాపు కులాలవారికి ఏర్పాటు చేసిన బ్రాహ్మణ కార్పొరేషన్, కాపు కార్పొరేషన్లు మాత్రం ఆర్ధికశాఖ నిబంధనల ప్రకారం ఏర్పాటు చేశారు. అందువల్ల ఆయా కార్పొరేషన్లకు ఆర్ధిక స్వాతంత్ర్యం వుంది. ఆయా కార్పొరేషన్లు నేరుగా బ్రాహ్మణులకు, కాపులకు ఆర్ధిక సాయం అందిస్తాయి. అంతేకాకుండా బ్రాహ్మణ, కాపు కార్పొరేషన్ ఛైర్మన్లకు కేబినెట్ హోదా కలిగివున్నారు, బిసి కుల సంఘాల ఛైర్మన్లకు కనీసం వాహనం ఇస్తారన్న నమ్మకం కూడా కనిపించడం లేదు. లక్ష్యం నీరుకారిపోతోంది:


బిసి కార్పొరేషన్ అనేది ఒక ప్రత్యేక లక్ష్యంతో ఏర్పడింది. బిసిలలో ప్రధానంగా చేతివృత్తి కులాలు, సేవాకులాలు, సంచార, అర్ధసంచార కులాలు అత్యంత వెనుకబడిన కులాలు వున్నాయి. వీరు ప్రభుత్వ పథకాలు వినియోగించుకోవడంలో కాని ఇతర అభివృద్ధి అంశాలలో ఇతర కులాలతో, కార్పొరేట్ సంస్థలతో పోటీ పడలేరనే, చేతివృత్తి కులాలవారు మోడ్రన్ టెక్నాలజీ అందిపుచుకొనే విధంగా వారి అభివృద్ధికి ప్రత్యేకంగా కృషిచేయాలనే లక్ష్యంతో బిసి కార్పొరేషన్ ఏర్పడింది. క్రమంగా బిసి కార్పొరేషన్ లక్ష్యం నీరుకారిపోతోంది. గతంలో బీసీ కులాల అభివృద్ధి నిమిత్తం ఏర్పడిన బిసి కార్పొరేషన్ కు బడ్జెట్ నుంచి నేరుగా నిధులు కేటాయించేవారు. బిసీ జాబితాలో వున్న కులాలన్నీ ఈ బిసి కార్పొరేషన్ ద్వారా స్వయం ఉపాధి పథకాలకు, చేతివృత్తులు అభివృద్ధికి అవసరమైన రుణాలను పొందేవారు.
రాష్ట్ర విభజన అనంతరం నూతనంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ లో కూడా బిసి కార్పొరేషను బడ్జెట్ ద్వారానే నిధులు కేటాయించారు. అయితే దురదృష్టం కొద్ది నాటి తెలుగుదేశం ప్రభుత్వం బిసి కార్పొరేషన్ నిధులను కాపు కార్పొరేషన్‌కు తరలించి బిసిలకు తీవ్ర అన్యాయం చేసింది. ప్రస్తుత వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసి బిసి కార్పొరేషన్ నిర్వీర్యం చేస్తూ ఎటువంటి అధికారాలు లేని కులాల పేరుతో సంక్షేమ అభివృద్ది కార్పొరేషన్లను ముందుకు తీసుకు వచ్చింది. నేడు బిసి కులసంఘాలు రాజకీయ వేదికలుగా మారిపోతున్నాయి. అవసరం వున్నా… లేకపోయినా కుల కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇటీవల కాలంలో ప్రస్తుతం సమాజంలో పాలక కులాలుగా, అగ్రకులాలుగా వున్న రెడ్డికులస్తులకు రెడ్డి కార్పొరేషన్ అదేవిధంగా కమ్మ కార్పొరేషన్, వైశ్య కార్పొరేషన్, క్షత్రియ కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలని విజ్ఞాపనులు కూడా వస్తున్నాయి.


అయిఇప్పటికే బ్రాహ్మణ, కార్పొరేషన్లు వున్నాయి. ఈ స్థితిలో రాష్ట్రంలో ఏ కులం జనాభా ఎంతో నిర్ధారించి ఆయా కులాల జనాభాను బట్టి నిధులు, వనరులు, రాజకీయ పదవులు పంపిణీ చేస్తే బాగుంటుంది కదా? ఆ విధంగా చేసే దమ్ము ఈ ప్రభుత్వాలకు ఉందా?
రాష్ట్రంలో ఎన్టీ రామారావు నేతృత్వంలో తెలుగుదేశంపార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బిసి కార్పొరేషన్ ద్వారా గ్రామీణ ప్రాంతాలలో రజక, నాయీబ్రాహ్మణులకు అందవలసిన స్థాయిలో సహాయం అందడం లేదనే భావనతో ఆయా కులాల పేరిట రజక, నాయీ బ్రాహ్మణ ఫెడరేషన్లు ఏర్పాటు చేశారు. ఈ ఫెడరేషన్లకు అవసరమైన నిధులను బిసి కార్పొరేషన్ నుంచి అందించేవారు. ఆ తర్వాత వై.ఎస్.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా వుండగా శాలివాహన(కుమ్మరి), విశ్వబ్రాహ్మణ వంటి మరో ఏడు చేతివృత్తుల వారికి కూడా ప్రత్యేకంగా ఫెడరేషన్లు ఏర్పాటు చేశారు. ఈ ఫెడరేషన్లకు చెందిన చేతివృత్తిదారులు క్షేత్రస్థాయిలో కో ఆపరేటివ్ సొసైటీలు ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఫెడరేషన్ల నుంచి కూడా సహాయం పొందేవారు. గుడ్డికంటే మెల్లమేలు అన్నచందంగా ఆదరణ వంటి పథకాల ద్వారా కులసంఘాలవారికి ఆర్ధిక సహాయం లభించేవి. ప్రస్తుతం ఫెడరేషన్లు రద్దుచేసి, వాటి స్థానంలో కుల సంఘాల కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం వల్ల బిసి కార్పొరేషన్ తో పాటు ఫెడరేషన్లు ఎందుకు పనికిరాకుండా పోవడమే కాకుండా బిసి కులాల అభివృద్ధి అనే లక్ష్యం పూర్తి అటకెక్కిందని చెప్పవచ్చు.

విదేశీ విద్యా పథకం :
విదేశాలకు వెళ్లి ఉన్నత విద్య చదువుకోవాలనుకొనే ప్రతిభావంతులైన వెనుకబడిన తరగతుల విద్యార్థులకు 2014 వరకు విదేశీ విద్యా పథకం అమలు చేసేవారు. టోఫెల్, జిఆర్మ్ వంటి పరీక్షలలో ఉత్తమ ర్యాంక్ సాధించి, ఆర్ధిక పరమైన కారణాల వల్ల విదేశాలకు వెళ్లలేని విద్యార్థులకు 15 లక్షల రూపాయల ఆర్ధిక సహాయం అందించేవారు. ఈ సహాయం వల్ల విదేశాలలో చదువు, అపై ఉద్యోగులు పొందడం వల్ల బిసి విద్యార్ధుల, కుటుంబాలలో వెలుగులు నిండేవి. కాని ప్రస్తుతం బిసి కార్పొరేషన్ నిర్వీర్యం కావడంతో ఈ విద్యా పథకమే కాదు స్వయం ఉపాధి పథకాలు, కులవృత్తుల అభివృద్ధికి ఇచ్చే రుణాలు వంటి అభివృద్ధి కార్యక్రమాలన్ని పూర్తి నిలిచిపోయాయి.
నిజానికి ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏలూరులో నిర్వహించిన బిసి సదస్సులో బిసిల అభివృద్ధికి ప్రత్యేకంగా బడ్జెట్ లో ఏడాది 15వేల కోట్ల రూపాయలు కేటాయిస్తామని ప్రకటించారు. కాని అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఊసే లేకుండా పోయింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కులాల పేదలకు ఇచ్చే వివిధ పింఛన్లు, ఆరోగ్యశ్రీ, రైతు భరోసా, అమ్మఒడి, గోరుముద్ద, విద్యాదీవెన, చేదోడు వంటి పథకాలకు ఖర్చు చేసిన నిధులను పరిగణలోకి తీసుకొని బిసి కులాల అభివృద్ధికి 33వేల కోట్లు ఖర్చుచేసినట్టుగా ఇటీవల పత్రికలకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. బిసిల ఐక్యతకు విఘాతం:
గత ప్రభుత్వం ఎస్ సి కులాలను విభజన చేసినట్టుగానే ప్రస్తుత ప్రభుత్వం బిసిలకు సంబంధించి కులానికో కార్పొరేషన్ ఏర్పాటు చేయడంవల్ల బిసిలలో ఐక్కతకు విఘాతం కలిగిస్తోందనిపిస్తోంది. అసలే బిసి కులాలలో ఐక్యత తక్కువ. నిచ్చెన మెట్ల హిందూ సమాజంలో బిసి కులాల మధ్య పెద్ద కులం, చిన్న కులం అనే అంతరాలు వున్నాయి. పేరుకి బిసిలని వ్యవహరిస్తున్నప్పటికీ ప్రస్తుతం బిసి జాబితాలో 136 కులాలు వున్నాయి. ఇందులో సంచార జాతులు, అర్ధ సంచార జాతులు, సేవా కులాలు, చేతివృత్తి కులాలు, ఉత్పత్తి కులాలు అంటూ అనేక తేడాలు వున్నాయి. ఈ స్థితిలో బిసిలకు సంబంధించి 56 కుల కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం ద్వారా కార్పొరేషన్ ఛైర్మన్లు ఎవరికి వారే వ్యక్తిగతమైన అజెండాలతో వేరు వేరుగా వ్యవహరించే ప్రమాదం వుంది. కులానికో కార్పొరేషన్ ఏర్పాటు చేయడమే కాకుండా బలమైన కొన్ని బిసి కులాలను ఉపకులాల పేరుతో ఒకే కులాన్ని మూడు నాలుగు కులాలుగా విభజించారు. ఉదాహరణకి గౌడ సామాజికవర్గంలో ఆయా
ప్రాంతాలను బట్టి గౌళ్ళ, శెట్టిబలిజ, శ్రీశైన, యాత, ఈడిగ ఉపకులాలు వున్నాయి. అయిదు ఉపకులాలు వున్నప్పటికీ గౌడ సామాజికవర్గంగా వ్యహారిస్తూన్నారు, పెళ్లిళ్ల విషయంలో కూడా ఈ అయిదు కులాలు ఇచ్చిపుచ్చుకొంటాయిఇ. కాని ప్రస్తుతం ఈ అయిదు కులాలుగా చీల్చి వేరు వేరు కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. అదేవిధంగా చేపలు పట్టే వృత్తి కలిగిన అగ్నికుల క్షత్రియులలో పల్లెకారులు, వడ్డీల పేరుతో ఉపకులాలు వున్నాయి. అగ్నికుల క్షత్రియ కులాన్ని కూడా ఉపకులాల పేరుతో విభజించి వేరు వేరు కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. ఈ స్థితిలో బిసిల ఐక్యత ప్రశ్నార్ధకంగా మారే ప్రమాదం వుంది