ప్రొఫెసర్ – చల్లపల్లి స్వరూపరాణి-
బౌద్ధాన్ని ఒక్కొక్కరు ఒక్కో విధంగా అర్ధం చేసుకున్నారు. బుద్ధుడిని కేవలం ఒక అహింసావాదిగా, దుఃఖవాదిగా, ధ్యాన మార్గాన్ని బోధించిన ఒకానొక దేవుడిగా భావించేవారే ఎక్కువగా వున్నారు. అయితే బౌద్ధాన్ని అసలు మతం అనాలా వద్దా అనే కీలకమైన చర్చ చేసి బౌద్ధంలోని సామాజిక విప్లవ కోణాన్ని వెలికితీసిన వారిలో పండిత అయోతీదాసు తర్వాత ప్రొఫెసర్ లక్ష్మీనరుసు ముఖ్యుడు.
భారత దేశంలో బౌద్ధం చాలావరకు కనుమరుగైపోయి బుద్ధగయలోని బౌద్ధాలయం హిందూ మహంతుల అధీనంలో ఉన్నప్పుడు శ్రీలంక బౌద్ధ భిక్షువైన అనాగారిక ధర్మపాల మహాబోధి ఆలయాన్ని తిరిగి బౌద్ధులకు అప్పగించాలని ఎంతో శ్రమించాడు. ఆయన శ్రీలంకలో స్థాపించిన మహాబోధి సొసైటీని భారత దేశంలో విస్తరించే క్రమంలో ఆయనకి దక్షిణ భారత దేశంలో అయోతీదాసు, లక్ష్మీనరుసు గొప్పగా సహకరించారు. అయితే ఇక్కడి బ్రాహ్మణవాదులు ఆయన్ని కూడా కబ్జా చేశారు. ఇల్లూ, వాకిలీ, దేశం అన్నీ వొదులుకుని బౌద్ధం కోసం బయలుదేరిన అనాగారిక ధర్మపాలనని ఒక బ్రాహ్మణుడిగా మార్చి మహాబోధి సొసైటీని ఒక ధ్యాన కేంద్రంగా కుదించారు.
బుద్ధుడు ముక్కోటి హిందూ దేవీ దేవతలలో ఒకడని, బౌద్ధం అంటే హిందూమతంలోని ఒకానొక శాఖ అని భావిస్తున్న రోజుల్లో బౌద్ధాన్ని హిందూ చట్రం నుంచి బైటికి తీసుకురావడానికి పండిత అయోతీదాసుతో పాటు లక్ష్మీనరుసు కృషి చెయ్యడమేకాక బౌద్ధాన్ని పీడితుల విముక్తి సిద్ధాంతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళారు. కులనిర్మూలనకు బౌద్ధం మాత్రమే సాధనంగా ఉపకరిస్తుందని చెప్పారు.
బౌద్ధంలోని వివేచనను, శాస్త్రీయతను మతకోణానికి భిన్నంగా బ్రాహ్మణేతర ద్రుక్పధంనుంచి అర్ధం చేసుకోడానికి ప్రొఫెసర్ లక్ష్మీనరుసు పుస్తకం తనకెంతో ఉపయోగపడిందని బాబాసాహెబ్ అంబేడ్కర్ పేర్కొన్నారు. 1907 లో మొదటిసారి ప్రచురించబడిన లక్ష్మీనరుసు పుస్తకం Essence of Buddhism ను అంబేడ్కర్ తన పరిచయ వాక్యాలతో 1948 లో మూడోసారి ప్రచురించారు.
అంబేడ్కర్ ని అంతగా ప్రభావితం చేసిన ప్రొఫెసర్ లక్ష్మీనరుసు తెలుగువాడని చాలామందికి తెలీదు, అందరూ ఆయన్ని తమిళుడనే అనుకున్నారు. ప్రముఖ బౌద్ధ పరిశోధకుడు టి. రవిచంద్ పరిశోధనలో లక్ష్మీ నరుసు తెలుగువాడనే విషయం బైటికొచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో భాషల్లోకి అనువదించబడిన లక్ష్మీ నరుసు పుస్తకం Essence of Buddhism ను 2009 లో వేటపాలెం కి చెందిన మరొక బౌద్ధ పరిశోధకుడు డి. చంద్రశేఖర్ తెలుగులోకి అనువదించారు. నేను ఆపుస్తకానికి ‘సత్యాన్వేషణే బౌద్ధధర్మ సారం’ శీర్షికతో సమీక్ష రాశాను. అంబేడ్కర్ నుంచి అలోషియస్ వరకు కేవలం కొద్దిమంది తప్ప పెద్ద పెద్ద ఉద్దండ పండితులు లక్ష్మీనరుసు కృషిని చాలా సౌకర్యవంతంగా విస్మరించారు. కారణాలు స్పష్టమే! ఆయన బుద్ధుడిని సామాజిక విప్లవకారుడిగా చూపించడం. అంతేకాదు, కులవ్యవస్థ భారత దేశానికి సోకిన ప్రాణాంతక వ్యాధి అని, దానికి బౌద్ధమే అసలైన మందు అని చెప్పడం. ఆక్రమంలో లక్ష్మీ నరుసు తన కాలానికి దేశంలో ఎంతో పేరు ప్రఖ్యాతులు, పలుకుబడి వున్న ఆధునిక హిందూ దేవుళ్ళు రామకృష్ణ పరమ హంస, వివేకానంద, దివ్యజ్ఞాన సమాజం ద్వారా హిందూమతానికి, కులానికి కొమ్ముకాసిన అనీబిసెంటులను నిర్మొహమాటంగా ధిక్కరించాడు. మేడిపండువంటి దేశభక్తిలో వుండే లుకలుకల్ని కడిగిపారేశాడు. ఈదేశంలో కులం భారతీయుల మధ్య ఐక్యతకు,అభివృద్ధికి ఆటంకంగా మారిందని, ఒక హిందువుగా వుండడమంటే ఏదోఒక కులంలో పుట్టడమేకాడు, కులానికి మరమ్మత్తులు చెయ్యడం కూడా అని 1922 లోనే కుండబద్దలు చేసిన లక్ష్మీనరుసు ప్రాతఃస్మరణీయుడు.