చెప్పు క‌మ‌లా? మా పుణ్యభూమిలో పుట్టివుంటే నువ్వు ఏమయ్యే దానివి?

1399

— సిద్ధార్ధి సుభాష్ చంద్రబోస్

పొద్దుగాల లేచి, మొగుడి కాళ్లకి దండం పెట్టుకుని, ఆనక ఇళ్లంతా వూడ్చి, గుడ్డతో తుడిచి, ఇంటిబయట వూడ్చి, కళాపి జల్లి, ముగ్గు వేసి, అందులో కుంకుమా, పసుపూ పోసి, మధ్యలో పదిపూలు అలంకరించి, మొహం కడుక్కుని, ఇంత కాఫీ నోట్లో పోసుకుని, మొగుడూ, పిల్లల నోట్లో మరింత పోసి, స్నానం చేసి, మడిగుడ్డల్తో బయటికి వచ్చి, సూర్య నమస్కారాలు చేసుకుని, తూలసికోటకు పూజ చేసి, రూపాయి బిళ్లంత బొట్టు పెట్టుకుని, ఇంటిముందు చెట్లు బోడులయ్యేంతవరకు పూలు తెగ్గోసుకుని, ఇంట్లోకి వెళ్లేది.

దేవుని మందిరంలొ కూర్చొని, లలితా సహస్రనామలు వల్లెవేస్తూ పటాలు తుడిచి, వొత్తులు తయారుచేసుకుని, బొట్టుపెట్టి, తెంపుకొచ్చిన పూలు అలంకరించి, దీపాలు వెలిగించి, అగరొత్తులు తిప్పి, లేచి వాటిని ఇంటా బయటా పొగ దివిటీలుగా గుచ్చి, ఇంట్లోకి వచ్చి పదిదినాల కింద ఫ్రిజ్‌లో నిల్వచేసి, రోజూ కొంత అందులోంచి తవ్వుకుని మిగిలిపోయిన పిండిని తవ్వుకుని, దాంతో పులిసిపోయిన దోశెలు పోసి, అందరికీ వడ్డించి, తనూ ఇంత ఎంగిలిపడి, లేస్తూ లేస్తూ, తాను తిన్న కంచంతో పాటు భర్తా పిల్లలూ తిన్న కంచాలు, పాత్రలూ తీసుకుని, వాటిని తోముకుని, వంటిట్లో సర్దుకుని, మరల మధాహ్న భోజనానికి దినుసులు కడుక్కుని, మధ్యలో వీధిలోని కూరగాయలు కొనుక్కుని, కడుక్కుని, కత్తరించుకుని, వంటచేసేసుకుని, వంటగదిని సర్దేసి, హాల్లో కూర్చొని సీరియల్ చూద్దామనుకుంటే, సగంలోనే వచ్చే భర్త, పిల్లలకు వడ్డించి, తిన్నాక, కంచాలు కడిగి సర్ది, నడుం వాల్చి, కొచెం పురాణం చదువుకుని, సీరియల్ చూసేసరికి సాయంత్రం కాగానే, పదిదేవుడు ప్రత్యక్షం కాగానే టిఫిన్లు, కాఫీలూ కాచి పోసి, రాత్రికి వండి, అందరూ తిన్నాక, అంట్లు సర్దేసి, నడుం వాల్చి.. స్వామీ, రామా! అని కళ్లుమూస్తే..!

సీతలాగా పసితనం నుండి చదువుకున్న చదువుని, బ్రతుకుకి అర్థాన్ని మర్చిపోయి, సొంత వికాసం వదిలేసి జీవితమంతా రాముడీకీ, రాముడి పిల్లలకీ, రాముడి అడుగుజాడల్లో నడిచే ఈ దేశపు సగటు మెదళ్లకు అనుగుణంగా జీవితాన్ని దేకిదేకి ముసలితనంలోకి అస్తమించే సమయం కలలోకి వస్తుండగా, అదే వాస్తవమై తెల్లారుతుంది… మరల రోజు మొదలు…

చెప్పు క‌మ‌లా? మా పుణ్యభూమిలో పుట్టివుంటే నువ్వు ఏమయ్యేదానివి?