ఔను, యీ దేశం మాది

1088

ప్రొఫెసర్ చల్లపల్లి స్వరూపరాణి

ఆది ఆంధ్ర వుద్యమానికి వందేళ్ళు వచ్చాయి. భాగ్యరెడ్డి వర్మ ప్రారంభించిన దళిత ఆత్మగౌరవ వుద్యమం మొదట 1906లో ‘జగన్మిత్ర మండలి’, ‘ఆదిహిందూ సోషల్ లీగ్’ అనే పేర్లతో పనిచేశాక 1917 లో విజయవాడలో జరిగిన మహాసభలో ‘ఆది ఆంధ్ర వుద్యమం’గా రూపుదిద్దుకుంది. సరిగ్గా 1917, నవంబర్ 4,5,6 వ తేదీలలో విజయవాడలో జరిగిన మహాసభ దళిత వుద్యమ చరిత్రలో వో మైలు రాయి అనుకోవచ్చు.

భాగ్యరెడ్డి వర్మ(మదారి భాగయ్య)కుముందు దళితులు సంఘటితమైనట్టు పెద్దగా తెలీదు. దళిత వుద్యమపరంగా ఆయన స్థాపించిన ‘జగన్మిత్ర మండలి’ మొట్టమొదటి సంస్థ అనుకోవచ్చు. ఆయనకి తర్వాత కాలంలో కుసుమ ధర్మన్న, అరిగే రామస్వామి, వేముల కూర్మయ్య, జాలా రంగస్వామి, బత్తుల వెంకటరావు(హైదరాబాద్ అంబేడ్కర్), శ్యాం సుందర్ వంటి మెరికల్లాంటి అనుచరులు వుద్యమ భాగస్వాములయ్యారు.

దళితులు యీ దేశపు మూలవాసులని(Sons of the soil), బ్రాహ్మణ వాద సాహిత్యాన్ని దళిత కోణం నుంచి భాగ్యరెడ్డి విశ్లేషించాడు. ఆరోజుల్లో దేశవ్యాప్తంగా బ్రాహ్మణ బనియాల నాయకత్వంలో జాతీయోద్యమం జరుగుతుంటే దేశ వ్యాప్తంగా దళితులు ఆత్మగౌరవ వుద్యమాన్ని ప్రారంభించి మాకు తెల్ల దొరలకంటే యిక్కడి పెత్తందారులైన నల్లదొరల నుంచి స్వతంత్ర్యం కావాలని ‘స్వరాజ్యం, ‘స్వతంత్ర్యం’ అనే విషయాలలో తమ ఆకాంక్షలను వ్యక్తం చేశారు. పంజాబ్ లో మంగూరాం(ఆది ధర్మి), వుత్తరప్రదేశ్ లో స్వామి అచ్యుతానంద(ఆది హిందూ), తమిళనాడులో పండిత అయోతీదాస్(శాక్య బౌద్ధ సమాజం), కేరళలో అయ్యంకాళి(సాధుజన పరిపాలనా సంఘం) యిదే తరహాలో దళితులు యీదేశ మూలవాసులనే ఆత్మగౌరవ ప్రకటన చేసి వారిలో చైతన్యాన్ని ప్రోది చేశారు.

దళిత వుద్యమకారులు విజయవాడలో పెద్ద యెత్తున సభ నిర్వహించబోతున్నారని తెలిసి బ్రాహ్మణ వాదుల గుండెల్లో రైళ్ళు పరుగెత్తాయి. అప్పట్లో దేశవ్యాప్తంగా దళితుల దేవాలయ ప్రవేశ వుద్యమాలు జరుగుతున్నందున వీరు గుడిలోకి యెక్కడ వస్తారోనని ఆ మూడు రోజులూ కనకదుర్గ గుడిని మూసి వుంచారు. స్థానికంగా కార్యక్రమాన్ని నిర్వహించేవారు ‘పంచమ మహాసభ’ గా బ్యానర్లు కట్టగా, భాగ్యరెడ్డి ‘పంచమ’ పదం తమను అవమానించడానికి బ్రాహ్మణ మత సాహిత్యం వుపయోగించింది కనుక దాన్ని తీసి వేయించి ‘ఆది ఆంధ్ర మహాసభ’ గా సవరించి రెండో రోజు బ్యానర్లలో కూడా పేరు మార్చి దళిత ఆత్మ గౌరవ పతాకను విజయవాడ నడిబొడ్డున యెగరవేశారు.

వీరు ప్రారంభంలో బ్రహ్మ, ఆర్య సమాజాల ప్రభావానికి గురైనప్పటికీ క్రమంగా దళిత తాత్వికతతో ముందుకెళ్ళి ఆనాటి మనువాదానికి ముచ్చెమటలు పట్టించారు. కుసుమ ధర్మన్న అనే మేరునగ ధీరుడు ‘యీహిందూమతంతో మేము వేగలేము, దీన్ని తిరస్కరిస్తున్నాము’ అని 1936లో విజయనగరంలో జరిగిన చారిత్రాత్మకమైన మహసభలో ప్రకటించి అంబేడ్కర్ దారిలో ప్రయాణం ప్రారంభించాడు.
ఆది ఆంధ్ర వుద్యమం యెంతో సాధించింది. దీని ప్రభావంతో కోస్తాంధ్రలో(వుభయ గోదావరి, విశాఖ జిల్లాలలో) మాల మాదిగలు తమ హేయమైన కుల అస్థిత్వాన్ని తిరస్కరించి ‘ఆది ఆంధ్ర’ అనే కొత్తకులంగా ఆవిర్భవించడం యీ వుద్యమ విజయంగా భావించవచ్చు.