ఎవరికీ పట్టని జాతీయ క్రీడాదినోత్సవం!

1224

ఆగస్టు 29.. జాతీయ క్రీడాదినోత్సవమని మనదేశంలో చాలామందికి తెలియదనడంలో ఏమాత్రం సందేహం లేదు. భారత హాకీ పితామహుడు , జాతీయ క్రీడామాంత్రికుడు మేజర్ ధ్యాన్ చంద్ జయంతిరోజైన ఆగస్టు 29న జాతీయ క్రీడాదినోత్సవాన్ని జరుపుకోడం గత కొద్ది సంవత్సరాలుగా భారతజాతికి ఓ ఆనవాయితీగా వస్తోంది.అయితే గత ఏడాది వరకూ వేడుకగా జరుపుకొన్న జాతీయ క్రీడాదినోత్సవాలు ఒక ఎత్తయితే…ఈ కరోనాసంవత్సరంలో జరుపుకొంటున్న క్రీడాదినోత్సవం మరో ఎత్తు.

టార్గెట్ 2028 ఒలింపిక్స్…
అమెరికా వేదికగా 2028లో జరిగే ఒలింపిక్స్.. పతకాల పట్టిక మొదటి పదిస్థానాలలో భారత్ ను నిలపడమే లక్ష్యంగా పథకాలు సిద్ధం చేసినట్లు కేంద్ర క్రీడామంత్రి కిరణ్ రిజ్జూచెబుతున్నారు.ఒలింపిక్స్ లో సూపర్ పవర్ గా ఉన్న అమెరికా, చైనా లాంటి దేశాలను అధిగమించే సత్తా భారత్ కు లేకున్నా..పతకాల పట్టిక మొదటి పదిస్థానాలలో నిలవాలంటే కనీసం 10 నుంచి 15 వరకూ బంగారు పతకాలు సాధించాలని, ఆ దిశగా క్రీడావిధానంలో సమూలంగా మార్పులు చేసినట్లు కేంద్రమంత్రి ప్రకటించారు. వివిధ రాష్ట్ర్రాల క్రీడామంత్రులతో సవివరంగా చర్చించిన తర్వాతే పలు కీలక నిర్ణయాలు తీసుకొన్నారు. కేంద్రప్రభుత్వం, భారత ఒలింపిక్ సంఘం, ప్రముఖ కార్పొరేట్ సంస్థలు కలసి సమన్వయంతో క్రీడాభివృద్ధికి కృషి చేస్తారని, మొత్తం 14 రకాల క్రీడలను గుర్తించి..వాటిలోనే ఒలింపిక్స్ పతకాలు సాధించటమే లక్ష్యంగా కృషి చేయాలని సూచించారు.
మనదేశంలో రాష్ట్ర్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కలసి మొత్తం 36 వరకూ ఉన్నాయని, తమ దృష్టిలో ఇవి 36 దేశాలతో సమానమని..ఒక్కో రాష్ట్ర్రం ఒకటి లేదా రెండు రకాలక్రీడల పైన మాత్రమే ప్రత్యేక దృష్టి పెట్టాలని, ఆయా రాష్ట్ర్రాలు ఎంపిక చేసుకొన్న క్రీడల అభివృద్ధికి కేంద్ర క్రీడామంత్రిత్వశాఖ, కార్పొరేట సంస్థలు నిధులు , వివిధ రూపాలలోసహాయసహకారాలు అందిస్తాయని కేంద్ర క్రీడామంత్రి ఇటీవలే ప్రకటించారు.
ఒక్కో రాష్ట్ర్రం పలు రకాల క్రీడలపైన దృష్టి పెడితే సాధించగలిగేది ఏమీ ఉండదని, ఒక్కో రాష్ట్ర్రం తనకు నచ్చిన ఒకటి లేదా రెండు క్రీడలను ఎంపిక చేసుకొని…వాటి పైనేదృష్టి కేంద్రీకరిస్తే ఒలింపిక్స్ లో పతకాలు సాధించడం ఏమంత కష్టం కాబోదని కిరణ్ రిజ్జూ ధీమాగా చెబుతున్నారు.

          

మనిషితో మహమ్మారి ఆటలు

కంటికి కనిపించని కరోనా వైరస్ తో విశ్వమానవాళి రాజీలేని పోరాటమే చేస్తోంది. మానవజాతికి కరోనా వైరస్ లాంటి మహమ్మారిల పరీక్షను ఎదుర్కొనడం ఇదే మొదటిసారికాదు.మనిషి మాత్రమే కాదు…మనిషిజీవితంలో ఓ ప్రధానభాగంగా ఉన్న క్రీడారంగం సైతం గతంలో ఎన్నడూలేని విషమపరీక్షను ఎదుర్కొంటోంది.ప్రపంచ వ్యాప్తంగా రెండువందలకు పైగా దేశాలను తాకి, జనజీవితాన్ని, ఆర్థికవ్యవస్థలను అతలాకుతలం చేసిన కరోనా వైరస్ చివరకు క్రీడారంగాన్ని సైతం కకావికలు చేసింది. కరోనా వైరస్ ప్రభావానికి భయపడిన ప్రపంచ క్రీడారంగం ముందు జాగ్రత్త చర్యగా నాలుగుమాసాలకాలం లాక్ డౌన్ పాటించి…ఆ తర్వాత ఖాళీ స్టేడియాలలో పోటీలు నిర్వహించడం ప్రారంభించింది. అయితే…టోక్యో వేదికగా జరగాల్సిన 2020 ఒలింపిక్స్, ఆస్ట్ర్రేలియా వేదికగా జరగాల్సిన టీ-20 ప్రపంచకప్, ఫ్రెంచ్ ఓపెన్ లాంటి గ్రాండ్ స్లామ్ టెన్నిస్ పోటీలు, పలురకాల అంతర్జాతీయ ఫుట్ బాల్ పోటీలు రద్దుల పద్దులో చేరిపోయాయి. ఒక్క మాటలో చెప్పాలంటే కరోనా వైరస్ దెబ్బతో క్రీడారంగం కొద్దివారాలపాటు స్తబ్ధుగా మారిపోయింది.
భారత హాకీ పితామహుడు ధ్యాన్ చంద్ జయంతిరోజైన ఆగస్టు 29న…ఢిల్లీలోని నేషనల్ స్టేడియంలోని విగ్రహానికి పూలమాలలు వేయటం, అదేరోజు సాయంత్రం జరిగే జాతీయ క్రీడాపురస్కారాల ప్రదాన కార్యక్రమం నిర్వహించడంతో…జాతీయక్రీడా దినోత్సం ఓ తంతుగా మిగిలిపోతూ వస్తోంది. 74 సంవత్సరాల స్వతంత్రభారత చరిత్రలో క్రీడారంగ ప్రగతి రెండడుగులు ముందుకు, నాలుగడుగులు వెనక్కు అన్నట్లుగా తయారయ్యింది.నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రస్తుత ప్రభుత్వం క్రీడారంగ అభివృద్ధి కోసం పలు రకాల చర్యలు చేపట్టింది.
ఒక రాష్ట్రం- ఒకే క్రీడ…
జనాభాపరంగా ప్రపంచంలోనే రెండో అతిపెద్ద దేశంగా ఉన్న భారత్ ఎన్నోరంగాలలో దూసుకుపోతున్నా…క్రీడారంగంలో మాత్రం ఆశించిన స్థాయిలో ప్రగతి సాధించలేకపోతోంది. అయితే..ఈ పరిస్థితిని చక్కదిద్దటానికి నరేంద్ర మోడీ నేతృత్వంలోని భారత ప్రభుత్వం గత ఆరు సంవత్సరాలుగా వినూత్న విధానాలతో పాటుపడుతోంది. ఒలింపిక్స్ పతకాల పట్టిక మొదటి 10 స్థానాలలో నిలవటమే లక్ష్యంగా కసరత్తు ప్రారంభించింది.
130 కోట్ల జనాభాతో భారత్ ప్రపంచంలోనే రెండో అతిపెద్ద దేశంగా ఉన్నా…ప్రపంచ క్రీడల పండుగ ఒలింపిక్స్ పతకాల పట్టిక మొదటి 50 స్థానాలలో నిలవటమే గగనమై పోతోంది. అత్యధిక యువజన జనాభా కలిగిన భారత్ ను క్రీడారంగంలో అమేయశక్తిగా తీర్చిదిద్దటానికి ప్రధాని నరేంద్ర మోడీ, క్రీడామంత్రి కిరణ్ రిజ్జూ వినూత్న విధానాలు, విప్లవాత్మక ఆలోచనలతో పాటుపడుతున్నారు. భారత క్రీడారంగ మౌలిక స్వరూపాన్నే మార్చివేయాలన్న పట్టుదలతో పలు రకాల చర్యలకు శ్రీకారం చుట్టారు.
అట్టడుగుస్థాయి నుంచే…..
లక్షలాది గ్రామాలు, పల్లెలకు ఆలవాలమైన భారత్ లో ప్రతిభావంతులైన క్రీడాకారులకు ఏమాత్రం కొదవలేదు. ప్రాథమిక స్థాయిలోనే ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి, ప్రపంచ మేటి శిక్షకుల పర్యవేక్షణలో తీర్చిదిద్దటానికి కేంద్రప్రభుత్వం ఖేలో ఇండియా గేమ్స్ ను నిర్వహిస్తోంది.
10 నుంచి 15 సంవత్సరాల లోపు వయసు కలిగిన ప్రతిభావంతులైన బాలలు, యువతను గుర్తించి..ప్రపంచ ప్రమాణాలతో కూడిన శిక్షణ ఇవ్వటానికి కేంద్రక్రీడామంత్రిత్వశాఖ ఏర్పాట్లు చేసింది. దేశంలోని వివిధ రాష్ట్ర్రాలతో కలసి పని చేస్తూ ప్రతిభాన్వేషణ కార్యక్రమాలు చురుకుగా నిర్వహిస్తోంది. దేశంలోని మొత్తం 36 రాష్ట్ర్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో వెయ్యికి పైగా ప్రతిభాన్వేషణ కేంద్రాలను ఏర్పాటు చేసింది. గ్రామీణ ప్రాంతాలకు చెందిన క్రీడాకారులలో ప్రతిభను గుర్తించడానికి శిక్షకులు, నిపుణుల బృందాలను అందుబాటులో ఉంచింది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్ర్రాలు, కేంద్ర పాలిత
ప్రాంతాలలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయటానికి చర్యలు చేపట్టింది.

క్రీడాశిక్షకులకు డబుల్ థమాకా…
అత్యుత్తమ క్రీడాకారులను తిర్చిదిద్దిన దేశీయ శిక్షకులను …విదేశీ శిక్షకులతో సమానంగా ఆదరించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. ఒలింపిక్స్ లో పతకాలుసాధించగల అథ్లెట్లను తీర్చిదిద్ధిన భారత శిక్షకులకు ఇప్పటి వరకూ ఇస్తున్న 2 లక్షల రూపాయల వేతనం పై పరిమితిని ఎత్తివేయటంతో పాటు…నాలుగేళ్ళపాటుకాంట్రాక్టు ఇవ్వాలని భారత క్రీడాప్రాధికార సంస్థ నిర్ణయించింది. దీంతో దేశవాళీ క్రీడాశిక్షకులకు ఉద్యోగభద్రతతో పాటు ఆర్థికంగా భరోసా కూడా ఉంటుందని, ఫలితంగాఅత్యుత్తమ ఫలితాలు సాధించే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ఒలింపిక్స్ లో భారత్ కు బంగారు పతకాలు అందించే అవకాశం ఉన్న కుస్తీ, బాక్సింగ్, వెయిట్ లిఫ్టింగ్, హాకీ, విలువిద్య, బ్యాడ్మింటన్, షూటింగ్ తో సహా మొత్తం 14 క్రీడాంశాలను కేంద్రప్రభుత్వం గుర్తించింది. ఈ 14 రకాల క్రీడాంశాల నుంచి ఒక్కో క్రీడను ఒక్కో రాష్ట్ర్రానికి కేటాయించడంతో పాటు క్రీడాభివృద్ధికి తగిన నిధులు సైతం సమకూర్చాలని నిర్ణయించింది. ఒకటి లేదా రెండు క్రీడాంశాలకు ఒక్కో కార్పొరేట సంస్థ స్పాన్సర్ గా ఉంటాయని, ప్రతిభావంతులైన క్రీడాకారులు, శిక్షకులకు ప్రభుత్వం అన్ని విధాల అండగా నిలుస్తుందని, ఇక ఆశించిన ఫలితాలు సాధించడమే మన కర్తవ్యమని కిరణ్ రిజ్జూ అంటున్నారు. అంతేకాదు..ప్రాథమిక పాఠశాలల స్థాయి నుంచే క్రీడలను నిర్భంధ పాఠ్యాంశంగా ప్రవేశపెట్టే దిశగాకూడా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
1980 మాస్కో ఒలింపిక్స్ లో భారత్ చివరిసారిగా హాకీ బంగారు పతకం సాధించగా…2008 బీజింగ్ ఒలింపిక్స్ లో షూటర్ అభినవ్ బింద్రా వ్యక్తిగతంగా ఒకే ఒక్క స్వర్ణ పతకం నెగ్గడం ద్వారా సరికొత్త చరిత్ర సృష్టించాడు.
మరో ఎనిమిదేళ్లలో జరిగే లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్ లో భారత్ 10 నుంచి 15 వరకూ బంగారు పతకాలు సాధించాలని భారత ప్రభుత్వం లక్ష్యంగా ఎంచుకొంది. ఈ బంగారు కల నిజం కావాలంటే ప్రభుత్వం, క్రీడాసంఘాలు, కార్పొరేట్ సంస్థలు, క్రీడాకారులు, శిక్షకులు కలసి పనిచేయటమే కాదు…అంకితభావంతో పాటుపడక తప్పదు.నాలుగుదశాబ్దాల క్రితం చివరిసారిగా హాకీలో బంగారు పతకం సాధించిన భారతజట్టు…వచ్చే ఒలింపిక్స్ లో స్వర్ణపతకం సాధించగలిగితే…భారత హాకీ మాంత్రికుడు ధ్యాన్ చంద్ కు తగిన నివాళి అర్పించినట్లవుతుంది. అప్పుడే అది అసలు సిసలు జాతీయక్రీడా దినోత్సవం కాగలుగుతుంది.
– చొప్పరపు కృష్ణారావు ( 84668-64969 )