బాలసుబ్ర‌హ్మ‌ణ్యం లేడు అంటారేంది… రాళ్ల‌ప‌ల్లి రాజావ‌లి

1812

రాత్రినుంచి ఒక‌టే టెన్ష‌న్‌..
కాలు కింద‌పెడ‌తాంటే మెడాల‌మీద తెలీని ఒత్తిడి..
మెద‌డంతా మొద్దుబారిన‌ట్టు, గుండె ప‌గిలిపోతాందేమో అనుకున్య‌ట్లు ఒక‌టే బాధ‌. బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యంగారికి బాగ‌లేదు, క‌ష్ట‌మేమో అనుకున్య‌ప్పుడు.. క‌మ‌ల్‌హాస‌న్ చూడ‌టానికి పోయినాడ‌నే వార్త విని భ‌య‌మేసి ఫేస్‌బుక్‌, ఛానెళ్లు క‌ట్టిపెట్టి భ‌య‌ప‌డిపోయి ప‌డుకున్యా. మాయ‌మ్మ చ‌నిపోయిన రోజు ఎలా భ‌య‌ప‌డ్డానో.. అట్ల‌నే బాలుగారి గురించి బాధ‌ప‌డ్డాను. బువ్వ తిన‌బిద్ధి కాలేదు. ఇంత‌లోనే వాట్స‌ప్పులో బాలుగారి ప్రొఫెల్ చూసి గుండెప‌గిలిపోయింది. దిక్కుతోచ‌ని ప‌రిస్థితి.

అస‌లు నేనెందుకు బాధ ప‌డాలి..
ఆయ‌న నా బంధువు కాదు.. ఫ్రెండు కాదు.. మార్గ‌ద‌ర్శ‌కుడూ కాదు.. నా ఓన‌రూ కాదు. ఆయ‌న్ని ఎందుకు అంత‌గా ఓన్ చేసుకున్యానంటే.. తెలీదు. ఆయ‌న నా ఆత్మ‌బంధువు.
1995ల్లో రాత్రిళ్ల పూట‌ బువ్వ‌తిని అర‌గ‌ల‌మింద కూకోని య‌వ్వారాలు కొడ‌తాంటే.. మా ప‌క్కింటి అనంత‌మ్మ‌వ్వ రాజావ‌లీ.. ఆ రేడియో పెట్టు జాన‌ప‌ద‌పాట‌లు వ‌చ్చాయేమో ఇంటా అనేది. రేడియో ఆన్ సేచ్చే.. గానం ఎస్‌.పీ.బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం-జాన‌కి పాడిన యుగ‌ళ‌గీతం అని తొలిసారి ఇన్యా. అట్ల నాకు బాలు ప‌రిచ‌య‌మైనాడు. మా క‌డ‌ప రేడియో స్టేష‌ను ఎప్పుడు పెట్నా.. గానం ఎస్పీ బాలసుబ్ర‌హ్మ‌ణ్యం-ఎస్పీ శైల‌జ‌.. ఎస్పీబాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం-చిత్ర అంటూ ఇన‌ప‌చ్చాండ‌. యా పాట‌లో చూసిన బాలు పేరు ఉంటాండ్య‌. ఏ పాట పాడిన బాలుదే అనుకుంటాంటి.

పెద్ద‌బ‌ళ్లో చ‌దువుతాండేట‌ప్పుడు.. గోళిగుండ్లు ఆడివ‌చ్చి కాళ్ల‌కు, చేత‌ల‌కుండే మ‌ట్టి గ‌బ‌గ‌బా క‌డుక్కోని, హ‌వాయి చెప్పులు కాళ్ల‌కు త‌గిలిచ్చుకోని టీవీల‌కాడికి ప‌రిగిత్తాంటి. ఈటీవీలో వ‌చ్చే పాడుతా తీయ‌గా ఎవురూ పెట్టోటోళ్లు కాదు. చానామంది సిన్మాలు చూసేవాళ్లు. పాడుతా తీయ‌గా ఎవురింట్లో వ‌చ్చాంటాదో ఆడ‌నే కూకుంటాంటి. కండ్ల‌తో బాలు స‌ర్‌ను చూడ‌టం, ఆయ‌న చెప్పే క‌రెక్ష‌న్లు.. అన్నింటికంటే పాట‌ల‌ర‌చ‌యిత‌, సంగీత ద‌ర్శ‌కులు, డైర‌క్ట‌ర్లు, ప్రొడ్యూస‌ర్ల గురించి ఆయ‌న చెప్పే మాట‌ల‌కోస‌ర‌మే సూపెట్టుకుంటాంటి. ఆ టైములో కొంద‌రు అట్ల చాన‌లు మార్చేవాళ్లు. వాళ్ల‌ను తిట్టుకుంటాంటి. మా ఇంట్లో టీవీ వ‌చ్చినాక మంచంమింద ప‌డుకోని నిమ్మ‌ళంగా మా బీపీఎల్ బ్లాక్ అండ్ వైట్ టీవీలో పాడుతా తీయ‌గా సూచ్చాంటి. అట్ల సూడంగా సూడంగా పెద్దోన్న‌యితి. హైద‌రాబాద్ వ‌చ్చి. జాబ్ సేచ్చి.నాకు బిడ్డ పుట్టినాది. అయినా పాడుతా తీయ‌గా వ‌చ్చానే ఉంది. బాలుని అట్ల‌నే సూచ్చాన‌. చ‌క్కెర‌పోసిన‌ట్లుండే ఆయ‌న తేనెమాట‌లు, తెలుగు మాట‌ల‌ను ప‌లికే విధానం, ఆయ‌న క్ర‌మ‌శిక్ష‌ణ‌, ఆయ‌న హాస్యం, ఆయన హుందాత‌నం, సింగ‌ర్ల‌కు ఏసే మాట‌ల మొటిక్కాయ‌లు.. చూడ‌టానికి రెండు క‌ళ్లు చాల‌వు. ఓ పెద్ద త‌రామంచిగా తెలుగుపాట‌కు ప్రాణం పోసినాడు. ఆ ఆటిట్యూడ్ అంటే నాకు చ‌చ్చేంత ఇష్టం.

బాలు అంద‌రికీ న‌చ్చుతాడు.. అంద‌రివాడు.
ఏ రేడియో, టీవీ, ఏ మంచి సినిమా చూసినా బాలు పాట ఇన‌ప‌డ‌తాది.
ఆయ‌న డ‌బ్బింగ్ అంటే నేను ప‌డిచ‌చ్చిపోతా. క‌మ‌ల్‌హాస‌న్ జీవిస్తే.. దానికి ప్రాణం పోసింది బాలునే క‌దా. మ‌నం చానా సినిమాలు చూసిన్లా. బాల్యంలో, టీనేజ్‌లో, డిగ్రీలో, ఉద్యోగం వ‌చ్చినాక‌.. నా ప్ర‌తి సంతోషంలోనూ, నా ప్ర‌తి బాధ‌లోనూ నా వాడిలా క‌న‌ప‌చ్చినాడు. నా ఫ్రెండులా క‌న‌ప‌న్యాడు. మా నాయినలా, మా అమ్మ‌లా, మా తోడుబుట్టువులా, మా అయివారులా క‌న‌ప‌చ్చినాడు. నా జీవితంలోని ప్ర‌తి మ‌లుపులో బాలు ఉన్యాడు. తీవ్ర మాన‌సిక ఒత్తిడికి లోన‌యిన‌ప్పుడు ఓ కుటుంబ‌స‌భ్యుడిలా పాట‌తో ఓదార్చి వైద్యం చేసినాడు. బాధ‌లో ఉన్య‌ప్పుడు త‌న గానంతో ఈ జీవితంలో ఏదో ఉందిప్పా అంటూ ఫ్రెండులాగా జీవితం మింద ప్రేమ‌ను పెంచినాడు. అట్లాంటి.. బాలును నేనెట్ల మ‌ర్చిపోతా చెప్పు?

సీనియ‌ర్ ఎన్టీయార్‌, బాల‌య్య‌, హ‌రిక‌క్రిష్ణ‌, జూనియ‌ర్ ఎన్టీయార్‌..అక్కినేని, నాగార్జునచిరంజీవి, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, రామ్ చ‌ర‌ణ్‌.. ఇట్లా ఎవ‌రికి పాడినా.. ఏ త‌రానికి పాడినా ఆ హీరో గొంతుగానే అనిపించేది. అదీ ఆయ‌న గొప్ప‌త‌నం. ముత్యాలు వ‌స్తావా..అంటా గొంతుతో మిమిక్రీ చేయ‌డం ఆయ‌న‌కే వ‌చ్చు. ద‌క్షిణాది భాష‌ల‌తో పాటు హిందీలో ఏక్ దుజియే లియే సినిమాలో పాట‌లు పాడితే అక్క‌డోళ్లంతా బెదురుకున్యారు. తెలుగాయ‌ప్ప హిందీలో ఇట్ల పాట‌లు పాడ‌తాడా, ఇంత స్ప‌ష్టంగా అని.
బాలుగారు పాట‌గాడే కాదు.. స్వ‌ర‌క‌ర్త కూడా!మంచి న‌టుడు.. అద్భుతంగా డ‌బ్బింగ్ చెబుతారు. సాహితీ ప్రేమికుడు!నిర్మాతగా మంచి సిన‌మాలు తీసినాడు.ఆయ‌న్ని సూచ్చే పుంభావ స‌ర‌స్వ‌తి ఆయ‌న క‌డుపులో కొలువై ఉండాది అనిపిచ్చేది. దేవుడు ఇట్లాంటి మ్యానిఫ్యాక్చ‌రింగ్ ప్ర‌పంచంలోనే చేయ‌లేదు అనిపిచ్చాది. అంత గొప్ప‌వ్య‌క్తి. ఆయ‌న ఏ పాట‌లు పాడినా మా వాడు అని అంటారు. తమిళోళ్లయితే బాల‌సుబ్ర‌హ్మ‌ణ్య‌న్‌ అంటూ రాసుకుంటారు. మ‌నం సిగ్గుప‌డాలి. తెలుగువాడై ఉండి తెలుగువాళ్లు ఆయ‌న్ని పెద్ద‌గా ప‌ట్టించుకోలేదేమో అనిపిచ్చాది. మీడియాలో నా సీనియ‌ర్లు, మా క్యాస్టు కాద‌ని ఇత‌రులు.. ఆయ‌న అంద‌రినీ తొక్కేశాడంటూ ఏడ్చేవారు. ఎందుకు ఏడుస్తారో అర్థ‌మ‌య్యేది కాదు. ఆయన తెలుగువాడిగా పుట్ట‌డం తెలుగువాళ్లు చేసుకున్న పుణ్యం.

బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం గారు ఈటీవీ కార్య‌క్ర‌మాల్లో పాడుతుంటే నాకు ఏ క్రికెట్‌, ఏ మంచులూ, అస‌లు బువ్వ కూడా ఆక‌ల‌య్యేది కాదు. ఆయ‌న స్వ‌రం ఆక‌లిని కూడా మాన్పిచ్చాది. ఇళ‌య‌రాజా, కె.వి.మ‌హ‌దేవ‌న్‌, రాజ్ కోటి.. ఎవ‌రి సంగీత ద‌ర్శ‌క‌త్వంలో అయినా.., కె.విశ్వ‌నాథ్‌, భార‌తీరాజా, వంశీ.. ఇట్ల ఏ మంచి ద‌ర్శ‌కుడిని చూసినా బాలు పాట‌లేనిదే వాళ్ల సినిమాల్లేవు, వాళ్ల పాట‌లూ లేవు. పాట‌ల‌న్నీ ఆయ‌నే పాడాడ‌ని కొంత‌మంది ఏడుచ్చారు. 50 ఏండ్ల‌ల్లో 40 వేల పాట‌లు పాడ‌ట‌మంటే ఓ ప్ర‌పంచ రికార్డే. ఆయ‌న పాడిన‌న్ని పాట‌లు, 16 భాష‌ల్లో భూమ్మీద ఎవురూ పాడ‌ల్య‌. అదీ ఈ బాలుడి రికార్డు!

టీవీ9లో ప‌నిచేసేప్పుడు నాంపల్లి తెలుగు ల‌లిత‌క‌ళాతోర‌ణంలో ఓ ప్రోగ్రామ్ జ‌రిగినాది. అదే చివ‌రి కాన్సెర్టు బ‌య‌ట అనే మాట ఇని ఎలాగైనా చూడాల‌ని బంజార‌హిల్స్ నుండి బైకులో, బ‌స్సులో, ఉరికిత్త పోయింది మొన్న‌నే అనిపిచ్చాంది. ఆ పొద్దు బాలు పాట‌లు విని ఆయ‌న‌తో మాట్లాడ‌టానికి ఎంతో ప్ర‌య‌త్నించినా కుద‌ర‌ల‌. బాలు పాట ద‌గ్గ‌ర‌గా చూడ‌టం చాలు ఈ జ‌న్మ‌కు అనుకున్యా.

2018 ఆగ‌ష్టు 18 వ తేదీన‌
ఈనాడు వ‌సుంధ‌ర ఇంచార్జి, మా సీనియ‌ర్ వీరూ స‌ర్ బాలుగారి ఇంట‌ర్వ్యూకు పోతాంటే తెల్చింది. వీరూ స‌ర్ కి ఫోన్ చేస్తే ర‌మ్మ‌న్నారు. ఆ పొద్దు బాలుగారి ఎదుట కూర్చోని, ఆయ‌న మాట‌ల‌న్ని రికార్డు చేసుకున్యా. ఆ మాట‌లు ఇప్ప‌టికీ విన‌ప‌డుతున్నాయి. శివ‌రంజ‌ని పాట ఆయ‌న పాడుతోంటే ఎదురుగా కూర్చోని ఇన‌టం నా పూర్వ‌జ‌న్మ‌సుకృత‌మే అనిపిచ్చినాది. ఆయ‌న ముఖ‌వర్ఛ‌స్సు, ఆయ‌న సునిశిత‌హాస్యం.. అద్భుత‌హా. మాట‌ల్లో చెప్ప‌ని ఆనందం. ఆ గంట‌న్న‌ర పాటు శ్రీన‌గ‌ర్ కాల‌నీలోని ఆయ‌న ఇంట్లో కూర్చున్య‌ట్లు కాదు.. ఓ దీవిలో దివ్య‌త్వం పొందిన‌ట్లు అనిపిచ్చినాది. ఆ పొద్దు మాది సింహాద్రిపురం. ప‌ద్మ‌నాభం వాళ్ల ఊరు అంటే.. అయ్యో నాకు తెలుసు. సింహాద్రిపురం. మ‌హానుభావుడు ప‌ద్మ‌నాభం గారు ఎన్ని సార్లు డ‌బ్బులు ఇచ్చారో అంటూ న‌మ‌స్కారం పెట్టినారు. అదీ బాలులోని గొప్ప‌ద‌నం. ఆ పొద్దు ఆయ‌న తొలిసారి స్టార్ హోట‌ల్‌లో తాగిన చాయి, కోక్‌, తొలి 150 రూపాయ‌ల పారితోషికం.. ఎన్నో విష‌యాలు .. ఆయ‌న జీవితాన్ని క‌ళ్ల‌ముందే కూర్చోని ఇన‌టం నా అదురుష్టం.

నేను ఓ క‌విత‌రాయాల‌న్నా..
క‌థ రాయాల‌న్నా.. ఆయ‌న పాట‌తో ఓ కొత్త శ‌క్తి వ‌చ్చేది.
కోపం చ‌ల్లారాల‌న్నా..
ఉదయం ఆహ్లాద‌క‌రంగా ఉండటానికి నా గానా, జియో శావ‌న్ యాప్‌లో ఆయ‌న నాతో పాటు కాలి న‌డ‌క‌న న‌డిచేవాడు.
రోజు దివ్య‌త్వంగా ఉండాలంటే నా గుండెలోకి బాలు పాట ఇంకాల్సిందే.
పొర‌పాటున రిపోర్టింగు లేదా ఇత‌ర బిజీతో బాలు పాట ఇన‌కుంటే .. ప‌డుకుండేట‌ప్పుడైనా యూట్యూబ్‌లోని జ్యూక్ బాక్స్‌లో బాలు పాట వినాల్సిందే. లేకుంటే పొద్దుపోదు. నిద్ద‌ర రాదు. ఆయన పాటే నాకు అమ్మ‌పాట‌!

బాలు పాడిన పాట ఏది బాగుంటాదంటే.. ఓ అభిమానిగా నేను చెప్ప‌లేను. చెప్ప‌టానికి త‌క్కువొచ్చా కూడా. బాలు.. బాలు.. బాలు.. బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం! ఈ పేరు ఎన్నోకోట్ల‌మందికి ద‌గ్గ‌ర‌గా ఉండొచ్చు. అయినా నాకు అంద‌రికంటే నాకే ద‌గ్గ‌ర అనుకుండే ఓ పిచ్చి అభిమానిని. ఆయ‌న లేడంటే నాకు కాళ్లూ, చేతులు ఆడ‌డం లేదు. మైండు బ్లాంకు అయినాది.
మ‌ళ్లా.. దేవుళ్లంద‌రూ ఒక్క‌టైనా అట్లాంటి పాట‌గాడిని పుట్టించ‌లేరు.
బాలు ఇక లేడు అనే మాట నేను న‌మ్మ‌ను.
అస‌లు ఎందుకొప్పుకోవాలి. ఒప్పుకోను కూడా.
నా నెత్త‌ర‌లో ఉండాడు. నా న‌రాల్లో పాటై ప్ర‌వ‌హిచ్చానాడు. నా మెద‌డులో అప్ర‌య‌త్నంగా పాడుతున్నాడు. నా గుండెంతా ఆయ‌న పాట‌ల‌తో నిండిపోయింది. నా చుట్టూ అంతా ఆ బాలుడి ప‌ల్ల‌వీ, చ‌ర‌ణాల‌తో ఊయ‌లూగుతోంది. ఇట్లాంట‌ప్పుడు బాలు లేడు. అని ఎట్లా అనాల‌. బాలు మంచి అని తెల్చు. అయినా అత‌నికి చావులేదు. మ‌నందరి గుండెల్లో ఉండాడు. మీరు రేడియో, టీవీ, యూట్యూబ్.. ఏది ఆన్ చేసినా బాలు పాట ఉండాల్సిందే. ఎవ‌రు పాట‌పాడిన బాలు పాట‌ను పాడాల్సిందే.
మ‌రి బాలసుబ్ర‌హ్మ‌ణ్యం లేడు అంటారేంది వీళ్లంతా.
ఎన్ని త‌రాలు మారినా..
యుగాలు మారినా..
ఈ పాట‌ల‌బాలుడు మ‌నంద‌రి గుండెల్లో బ‌తికే ఉంటాడు.నాలాంటి ప్ర‌తి గుండెను బ‌తికిచ్చే.. ఈ పాట‌ల‌బాలుడికి పుట్టుకే కానీ మ‌ర‌ణం దేవుడు కూడా రాయ‌లేక‌పోయాడు. పాట‌ల‌తో ఎళ్ల‌కాలం జీవిస్తాడు బాలు.
ఇట్లు
ఓ బాలు అభిమాని
✍🏻✍🏻✍🏻✍🏻
రాళ్ల‌ప‌ల్లి రాజావ‌లి
25.9.20