స్వరములు ఏడే అయినా రాగాలు కోకొల్లలు. కానీ కొన్ని ప్రత్యేక స్వరాల మేళవింపు మాత్రమే పరిపూర్ణతను సంతరించుకుంటుంది. సప్త స్వరాల మేళవింపు అసంఖ్యాకమైన రాగాలను ఆవిష్కరిస్తుంది. ఏ భావమైన ఆ రాగాల మేళవింపుతో మనసుని అలరిస్తుంది. అటువంటి అద్భుతమైన గీతాలు కూడా పి.బి.శ్రీనివాస్ మధుర గానంతో పరిపూర్ణతను సంతరించుకుని శ్రోతల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయాయనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. యుగళ గీతాలు, విషాద గీతాలు, భక్తి గీతాలు… ఇలా వైవిధ్యభరితమైన పాటలను తన మధురమైన గళంతో అజరామరం చేసారు పి.బి.శ్రీనివాస్. చిత్ర ప్రపంచం గర్వించతగ్గ మధుర గాయకులలో పి.బి.శ్రీనివాస్ ఒకరని నిస్సందేహంగా చెప్పవచ్చు. తన గాన మాధుర్యంతో సంగీతాభిమానులను మైమరపించారు. సెప్టెంబరు 22, 1930 సంవత్సరంలో పి.బి. శ్రీనివాస్ కాకినాడలో జన్మించారు. తండ్రి సంస్కృత పండితులు కావటంతో ఆయన చిన్నతనంలోనే సంస్కృతం భాషమీద పట్టు సాధించారు. ఆయన సంగీతంలో ఓనమాలు దిద్దుకున్నది తల్లి నుంచే. గాయకుడిగా ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నది అయన చిరకాల వాంఛ.
1952 లో వచ్చిన “మిస్టర్ సంపత్” హిందీ చిత్రంతో తన చలనచిత్ర జీవితం ప్రారంభించారు. వాస్తవానికి అయన మాతృభాష తెలుగు అయినా కూడా కన్నడ, తమిళ చిత్రాలలోనే ఎక్కువ పాటలు పాడారు. మహానటులు ఎన్టీఆర్, అక్కినేని కి అమర గాయకుడు ఘంటసాల తప్ప మరే గాయకుడు పాడినా సంగీత అభిమానులకు అంతగా రుచించేది కాదు. పి.బి. శ్రీనివాస్ తన గాన మాధుర్యంతో వారిద్దరికీ మరచిపోలేని ఎన్నో మధుర గీతాలను పాడారు. ప్రేమించి చూడు మూవీలో అక్కినేనికి అయన పాడిన “మీ అందాల చేతులు కందేను పాపం…, “బుచ్చబ్బాయి పని కావాలోయ్..” లాంటి పాటలు అప్పుడే కాదు, ఇప్పటికి ఎప్పటికి నిత్య నూతనమే. ఆడబ్రతుకులో ఎన్టీఆర్ కు అన్ని పాటలను ఆయనే పాడారు. ముఖ్యంగా “బుజ్జి బుజ్జి పాపాయి..” అనే పాట ఎప్పటికి ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్ అంటారు సంగీత ప్రియులు. వివాహ బంధంలో భానుమతితో కలసి పాడిన యుగళ గీతం వింటే తెలుస్తుంది ఎంత గంభీరంగా ఆ పాటను అయన గానం చేసారో.
ధర్మేంద్ర, మీనాకుమారి హీరో హీరోయిన్స్ గా నటించిన ‘మై భీ లడకీ హూ’ హిందీ చిత్రంలో ఆయన లతా మంగేష్కర్ తో కలసి పాడిన “చందా సె హోగా వో ప్యారా” గీతం సంగీత ప్రియులను అలరించింది. అప్పట్లో దక్షిణాది గాయకులు హిందీ చిత్రాల్లో పాటలు పాడటం అనేది చాలా అరుదనే చెప్పాలి. అందులోను లతా మంగేష్కర్ తో కలసి పాడటం అంటే మాములు విషయం కాదు. ముందు పి.బి. శ్రీనివాస్ ను ఎంతో తేలిగ్గా తీసుకున్న ఉత్తరాది సంగీతాభిమానులు అయన గాన మాధుర్యం విని మైమరచిపోయారు. తరువాత ఎన్ని అవకాశాలు వచ్చినా అయన మాత్రం దక్షిణాది సినిమాలకే ప్రాధాన్యమిచ్చారు. తెలుగు, కన్నడం, తమిళం, మళయాళం, హిందీ, ఉర్దూ, ఆంగ్లం, సంస్కృతం ఎనిమిది భాషలలో అనర్గళంగా మాట్లాడటమే కాదు, ఈయన స్వయంగా ఎన్నో గజళ్లు వ్రాసారు.
వివిధ భాషలలో ఎన్నో పాటలు పాడినప్పటికీ ఎక్కువ పాటలను మాత్రం కన్నడ భాషలోనే పాడారు. మహానటుడు రాజ్‌కుమార్‌కు సుదీర్ఘ కాలం పాటు ఎన్నో అజరామరమైన పాటలను పాడారు. అయన తమిళంతో ఎం.జి.రామచంద్రన్, శివాజీ గణేశన్ లకు పాడినప్పటికీ అయన ఎక్కువగా జెమిని గణేశన్ కు ఎన్నో సూపర్ హిట్ పాటలను పాడారు.
తెలుగు హీరోల్లో అయన గాత్రం జగయ్య, కాంతారావు, హరనాథ్ లకు బాగా నప్పేదని అంటారు. జగయ్యకు అయన పాడిన పాటల్లో “తలచినది జరిగినదా దైవం ఎందులకు”, “ఓహో గులాబీ బాల… అందాల ప్రేమ మాల..” పాటలను ఎంతో మృదు మధురంగా పాడారు. పౌరాణిక, జానపద, చారిత్రక చిత్రాల్లో హీరో కాంతారావు కు మరచిపోలేని ఎన్నో పాటలు పాడారు. హాస్యనటులకు పాటలు పాడే సందర్భం వచ్చినప్పుడు సంగీత దర్శకులు కొంత కాలం ఎదురు చూసైనా ఆయనతోనే పాటలు పాడించుకునేవారట.
అక్కినేని హీరోగా నటించిన ‘మూగనోము’ చిత్రంలో ఒక బ్యాక్ గ్రౌండ్ సాంగ్ ను ముందుగా ఘంటసాల చేత పాడిదామనుకున్నారట సంగీత దర్శకులు. కానీ ఆ సమయంలో ఘంటసాల అందుబాటులో లేకపోవడంతో ఆ పాటను పి.బి.శ్రీనివాస్ చేత పాడించారు. తరువాత అదే పాటను తిరిగి ఘంటసాల చేత పాడించారు సంగీత దర్శకులు. ఈ పాటను పి.బి.శ్రీనివాస్ ముందుగా పాడారన్న విషయం తెలిసిన ఘంటసాల మాస్టారు పి.బి.శ్రీనివాస్ వద్దకు వెళ్లి ‘ముందుగా ఈ పాటను మీరు పాడారని తెలిస్తే ఎట్టి పరిస్థితుల్లోను పాడేవాడిని కాదని’ బాధ పడ్డారట. ఘంటసాలగారి గొప్పతనం, సంస్కారం గురించి తరచూ తన సన్నిహితుల వద్ద ప్రస్తావించేవారట అయన. తమిళనాడు ప్రభుత్వం నుంచి కలైమామణి, పురస్కారాన్ని అందుకున్న ఆయనకు ఆరిజోనా విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ఇచ్చి గౌరవించింది.
ఆయనను కలుసుకోవడానికి అభిమానులు ఏ సమయంలో వచ్చినా ఆప్యాయతతో మాట్లాడేవారు. వారు అడిగిన వాటన్నిటికీ ఎంతో ఓపికగా సమాధానాలిచ్చేవారు. తీరిక సమయంలో తనకెంతో ఇష్టమైన కవితలను వ్రాసుకుంటూ ఉండేవారు. మధురమైన తన గానంతో సంగీత అభిమానులను అలరించిన పి.బి. శ్రీనివాస్ ఏప్రిల్ 14, 2013లో గుండెపోటుతో చెన్నైలో అస్తమించారు. భౌతికంగా ఆయన మనమధ్య లేకపోయినా సంగీతాభిమానుల హృదయాలలో అయన ఎప్పటికి నిలిచేవుంటారు