నిత్య‌యౌవ‌నుడు గాన‌గంధ‌ర్వుడు బాలు-కె.వి.రామకృష్ణ

1773

Collapse all
In new window
P


త‌న‌ అద్భుత గాత్రంతో వేలాది సుమధుర గీతాలకు  ప్రాణ ప్రతిష్ట చేసిన గాన గంధర్వుడు ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం కోట్లాదిమంది అభిమానులను శోక సంద్రంలో ముంచి తిరిగిరాని లోకాలకు తరలివెళ్లారు. ఇటీవల ఆయన కరోనా బారిన పడటంతో ఆగస్టు 5న చెన్నైలోని ఎంజీఎమ్ హాస్పిటల్ లో చికిత్స నిమిత్తం చేరారు. కరోనా నుంచి కోలుకున్నా ఇతర అనారోగ్య సమస్యలు చుట్టుముట్టడంతో ఆయన శుక్రవారం మధ్యాహ్నం తుది శ్వాస విడిచారు. గత 50 రోజులుగా చికిత్స పొందుతున్న ఆయన  సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి వస్తారని అభిమానులు ఎంతగానో ఆశపడ్డారు. కానీ ఆ ఆశలు అడియాసలు చేసి అనంతలోకాలకు పయనమై వెళ్లిపోయారు.
శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం 1946 జూన్ 4 న నెల్లూరు జిల్లా కోనేటమ్మపేట గ్రామంలో జన్మించారు.  ఆయన తండ్రి సాంబమూర్తి హరికథ చెప్పడంలో నిష్ఠాతులు కావడంతో  బాలసుబ్రహ్మణ్యంకు సంగీతంపట్ల అమితాసక్తి ఏర్పడింది. చిన్నతనం నుండే పాటలు పాడటమే కాదు, పాటల పోటీలలో పాల్గొని ఎన్నో బహుమతులు గెలుచుకొన్నారు.  బాలసుబ్రహ్మణ్యం ఇంజనీరు కావాలని ఆయన తండ్రి ఎంతో ఆశపడేవారు. ఆయన కోరిక మేరకు మద్రాసులో ఇంజనీరింగ్ కోర్సులో చేరారు.  చదువుకుంటూనే పాటల పోటీలలో పాల్గొనేవారు.
చదువుకుంటున్న సమయంలోనే బాలసుబ్రహ్మణ్యం చలనచిత్ర రంగ ప్రవేశం చేసారు. 1966లో ప్రముఖ హాస్య నటుడు పద్మనాభం నిర్మించిన శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న చిత్రంతో సినీగాయకునిగా చలన చిత్ర  జీవితం ప్రారంభించారు. తనకు సినీ గాయకునిగా జీవితాన్ని ప్రసాదించిన  సంగీత దర్శకుడు ఎస్.పి.కోదండపాణికి ఎంతగానో రుణపడి ఉంటానని అనేక సందర్భాలలో చెప్పారాయన. తాను నిర్మించిన ఆడియో ల్యాబ్ కు కోదండపాణిపై భక్తితో, అభిమానంతో  ‘కోదండపాణి ఆడియో లాబ్స్’ అని పేరు పెట్టుకున్నారు ఆయన.
సినిమా రంగానికి, సంగీతానికి బాలసుబ్రహ్మణ్యం చేసిన కృషికి గుర్తింపుగా భారత ప్రభుత్వం ఆయన్ని 2001లో పద్మశ్రీ, 2011లో పద్మభూషణ్ అవార్డులతో గౌరవించింది. తమిళనాడు ప్రభుత్వం  ‘కళైమామణి’ బిరుదుతో సత్కరించింది. పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ, సత్యభామ యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్లను అందుకున్నారు.నాలుగు దశాబ్దాల సినీ ప్రస్థానంలో విభిన్న భాషల్లో నలభై వేలకు పైగా మరపురాని ఎన్నోసుమధుర గీతాలు ఆయన గళం నుంచి వెలువడ్డాయి. తన సుమధుర గాత్రంతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన ఆయన ఎన్నో అవార్డులు అందుకున్నారు. అత్యధిక పాటలు పాడిన గాయకుడిగా గిన్నిస్ రికార్డు నెలకొల్పారు. ఎంతోమంది నటులకు వారి హావభావాలకు అనుగుణంగా పాటలు పాడి జీవం పోశారు.  ఘంటసాల మాస్టారు తరువాత చిత్రసీమలో  ఆయనకు అసలైన వారసుడిగా నిలిచారు బాలసుబ్రహ్మణ్యం. స్వరంతోనే కాకుండా నటనతోనూ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.  కమల్ హాసన్, జెమిని గణేషన్, రజనీకాంత్, సల్మాన్ ఖాన్, అనిల్ కపూర్, మోహన్ లాల్ తదితర పలువురు హీరోలకు డబ్బింగ్ చెప్పారు.
ఆయన తమ అమృత గానంతో, గాత్ర మాధుర్యంతో  ప్రతి ఒక్కరిని తన్మయులను చేసారు. బాలసుబ్రహ్మణ్యం గాత్రం గురించి ఎంతగా వర్ణించినా తక్కువే. ఆ గొంతులో ప్రతి ఒక్కరిని సమ్మోహనం చేసే శక్తి ఉంది. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ భాషల్లో కలిపి మొత్తం ఆరుసార్లు జాతీయ స్థాయిలో  ఉత్తమ గాయకుడిగా అవార్డులు అందుకుని చరిత్ర సృష్టించారు. గాయకుడిగానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్టుగా , నటుడిగా, సంగీత దర్శకుడిగా 29 సార్లు నంది పురస్కారాన్ని అందుకున్న బహుముఖ ప్రజ్ఞాశాలి ఆయన. 2016 నవంబరులో గోవాలో జరిగిన 47 వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలలో  ‘సెంటినరీ అవార్డ్‌ ఫర్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ పర్సనాలిటీ ఆఫ్‌ ది ఇయర్‌ 2016’  అవార్డు అందుకున్నారు. ‘పాడుతా తీయగా’ కార్యక్రమంతో బాలసుబ్రహ్మణ్యం బుల్లితెర ప్రవేశం చేసారు. అనేక మంది కొత్త గాయనీ గాయకులను ఈ కార్యక్రమం ద్వారా పరిచయం చేసారు.
కోట్లాదిమంది ప్రజలలో పరిపూర్ణత సాధించడం అనేది చాలా కొద్దిమందికి మాత్రమే సాధ్యమవుతుంది. తాను చేపట్టిన వృత్తిలో శిఖరాగ్రానికి చేరుకొని ఒక చరిత్ర సృష్టించి అందరికి స్ఫూర్తిగా, అందరి మనస్సులో నిలిచిపోయిన గాన గంధర్వులు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యంది అటువంటి పరిపూర్ణ జీవితమే. ఆయన పాడే ప్రతి పాటలోనూ తెలుగుదనం ఉట్టిపడుతుంది. సన్నివేశానికి తగిన భావ వైశిష్ట్యం కలగజేయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. నేపథ్య గాయకుడు, సంగీత దర్శకుడు, నటుడు అయిన ఆయన వివిధ భాషల్లో సుమారు 40 వేలకుపైగా పాటలు పాడి సంగీతాభిమానులను అలరించారు. యుగళ గీతాలు, విషాద గీతాలు, భక్తి గీతాలు… ఇలా వైవిధ్యభరితమైన పాటలను తన మధురమైన గళంతో, స్పష్టమైన ఉచ్చారణతో అజరామరం చేసారు. సంగీత ప్రపంచంలో ఉన్నత శిఖరాలు అధిరోహించి, ఎన్నో తరాలకు స్ఫూర్తిదాతగా నిలిచారు