ఏడు దశాబ్దాల తీపి జ్ఞాపకాల తేనెపట్టు.
పాతాళ భైరవి సినిమాకు 70 ఏళ్ళా అని ఆశ్చర్యపోయాను..నిత్యనూతనంగా,నిత్యవసంతంలా,అమృతం తాగిన అప్సరసలా ఎంత అద్భుతంగా వుంది..ఈ సినిమా సూపర్ సీనియర్…Old is gold…Gold is always Gold…ఈ సినిమా గురించి నా ఆలోచనలు మీతో పంచుకోకుండా ఎలా…అసలు ఇంత అద్భుతమైన సినిమా రావడానికి,ఇంతకాలం ఇందరి హృదయాలను ఏలడానికీ,నా హృదయం కొల్లగొట్టడానికీ కారణం ఏమిటా అని ఆలోచిస్తే ఇద్దరే ఇద్దరు కనిపించారు…
ఒకరు కె.వి.రెడ్డి, రెండు పింగళి…కె.వి.దర్శకత్వ ప్రతిభ పింగళి వారి పాండితీ ప్రకర్ష రెండూ కలగలిపి పోటాపోటిగా ప్రేక్షకుల గుండెల్ని కొల్లగొట్టాయి అనటానికి నిదర్శనం పాతాళభైరవి.యన్.టి.ఆర్ యుక్తవయస్సు, ప్రతిభ, నేపాళ మాంత్రికుని గా యస్.వి. రంగారావు నటనా చాతుర్యం, ఘంటసాల సంగీతం, పాటలు దీనిని చరిత్ర లో చిరస్థాయిగా నిలిపేందుకు మరింత దోహదం చేసాయని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు.కాశీ మజిలీ కథలు, అల్లాద్దీన్ కథలప్రేరణతో ఈసినిమాకు కథను తయారు చేసినా కొద్దిగా రామాయణ పోకడలు నాకు కనిపించాయి..
ఉదాహరణకు రాజు గారి తోటరాముడిని బంధించి విడుదల చేసిన తరువాత ఇంటికి వస్తాడు.అప్పుడు రాముడితల్లి అతనితగిలిన గాయాన్ని తుడుస్తూ బాధ పడుతుంటే అంజి డైలాగ్ వుంటుంది.. మహారాజు గురించి..”సాక్షాత్తు జనకమహారాజే పిన్నీ!ఉరిదీయకుండా ఉపదేశం చేసి పంపించాడు”అని…”అమ్మా దీవించి పంపమ్మా”అని రాముడు అన్నప్పుడు అంజిచేత,తల్లిచేత ఒక డైలాగ్ అనిపిస్తారు..”సాక్షాత్తు శ్రీరామచంద్రుడంతటివాడివై సీతామహాలక్ష్మిని తీసుకురా”అని…పాతాళభైరవి సాయంతో మాంత్రికుడు రాకుమార్తెను తాకకుండానే మాయమవటం, రాకుమారి లంకలో సీతమ్మలా ఆభరణాలు, ఎటువంటి అలంకారాలు లేకుండా,నిరాహారంగా రాముడికోసం శోకిస్తూ వుండటం,ఆమె చుట్టూ లంకలో రాక్షసుల్లాంటి ఆడవాళ్ళను కావలి వుంచటం,చివరకు తోటరాముడు అంజి(ఆంజనేయుడి పేరేగా)సాయంతో రాక్షసుడిని సంహరించి రాకుమార్తెను రాజ్యానికి తీసుకెళ్ళి పెళ్ళి చేసుకోవడం..అయితే రామాయణంలో వనవాసంలో వుండగా సీతమ్మవారిని రావణుడు ఎత్తుకువెళతాడు…
అదొక్కటే చిన్నతేడా..ఇక ఈ చిత్రంతో బాలకృష్ణ పేరు జనాల్లో అంజిగా స్థిరపడిపోయింది…ముఖ్యంగా పింగళి వారి మాటలు,పాటలు జవజీవాల్లా ఈ చిత్రవిజయానికి దోహదం చేసినయ్యంటే ఏమాత్రం అతిశయోక్తి కాదు..”సాహసం సేయరా డింభకా,””నరుడా ఏమి నీ రికా,”
“జనం అడిగింది మనంచేయవలెనా??మనం చేసింది జనం చూడవలెనా???”ఇక తోటరాముడి తల్లి తరుచుగా వాడే మాట”ఒక కొడుకు నిమ్మంటే రాక్షసుడిని ఇచ్చావేమిరా దేవుడా”…ఇదే డైలాగ్ ని మహేష్ బాబు అతడు సినిమాలో త్రివిక్రమ్ కొంచెం మార్చి వాడాడు”దేవుడా కూతుర్నిమ్మంటే క్వశ్చన్ బ్యాంక్ నిచ్చావు తండ్రి”అని.అలాగే తోటరాముడి ఊతపదం…”నిజం చెప్పమంటారా అబద్ధం చెప్పమంటారా”…
దీన్ని మన కళాతపస్వి విశ్వనాథ్ గారు”స్వాతిముత్యం”చిత్రంలో హీరోకి పెట్టారు…”నిజం చెప్పనా-అబద్ధం చెప్పనా”అని కమలహాసన్ అడుగుతాడు…అలాగే రాకుమార్తె గదిలోకి తో.రా వచ్చినప్పుడు చాటుగా పొంచివున్న రా.బా(రేలంగి-రాజుగారి బావమరిది)వచ్చి వెదుకుతూ రాకుమార్తె ప్రశ్నలకు”అంతేగా, అంతేగా”అని సమాధానమిస్తాడు…
దీన్ని F2 సినిమాలో ప్రదీప్ పాత్రకు ఊతపదంగా వాడాడు అనిల్ రావిపూడి..7 దశాబ్దాలుగా ఇన్ని తరాల వారిని ఆ మాటలు ప్రభావితం చేశాయంటే సామాన్యమా!!”సరిలేరు నీకెవ్వరూ పింగళి”అని అనాలికదూ…”గురు,బుల్ బుల్,గుబుల్ గుబుల్,తప్పు తప్పు”ఇలాంటి ఎన్నో మాటలు సామాన్యుల నుండి అసమాన్యుల వరకు ఊతపదాలుగా బహుళ ప్రచారం పొందాయి..అంతేనా…ఈ సినిమాలోని పాటలలో కొన్ని మాటలు సినిమా టైటిల్స్ గా మారి టైటిల్స్ కోసం పడే శ్రమను తగ్గించాయి..”కలవరమాయే మదిలో””ఎంత ఘాటు ప్రేమయో”..ఇలా..
ఇక దర్శకుడు కె.వి.గురించి కె.వి లో కె అంటే కొంటెతనం,వి అంటే వినోదం అన్నది ఈ సినిమాలో బాగా ఎస్టాబ్లిష్ అయింది…
ఇక సినిమా గురించి ఏ టూ జెడ్ తెలిసిన కె.వి.రెడ్డి గారి అంతరంగం తెలిసిన ముఖ్యులుగా పింగళిగారిని,కమలాకర కామేశ్వరరావు గారిని చెప్పుకోవచ్చేమో…
టి.జి.కమలాదేవి పాటలో …”యుగయుగానికొక కథానాయకుడు..”అని అనిపిస్తారు…అంతే కాకుండా “కధానాయకుడి లక్షణం చూపించావోయి”అంటూ విజయీభవ అని ఆమె ఆశీర్వదిస్తుంది..తరువాత అక్కడ గుంపులు గుంపులుగా వున్న జనంచేత”కథానాయకుడికి జై”అని ముమ్మారు జేజేలు కొట్టించి రామారావుని తిరుగులేని కథానాయకుడిగా ఉజ్వలంగా రాణిస్తాడని అక్షరాక్షతలతో పండితోత్తముడు పింగళి,ఎన్.టి.ఆర్ Career కి రాచబాట వేసిన దర్శకదేవుడు కె.వి.ఆశీస్సులు అమోఘంగా ఫలించి రామారావు నటవిశ్వరూపం జనంలో,సినీ జగత్తులో శాశ్వతంగా నిలిచింది…అలాగే మాంత్రికుడి పాత్ర రూపకల్పన..ఎస్.వి.ఆర్. ఓకన్ను చిన్నదిచేసి గడ్డం సవరించుకొనే మానరిజం అతనిలోని క్రూకెడ్ మెంటాలిటికి ప్రతీకగా నిలుస్తుంది…
పాత్రల స్వభావాన్ని బట్టి ఆయా పాత్రల రూపకల్పన తానే స్వయంగా ప్రత్యేక శ్రద్ధతో తీర్చిదిద్దే వారు కె.వి…
ముఖ్యంగా హీరో విషయంలో ఎంతో శ్రద్ధ తీసుకున్నారు”రామారావు పృష్ఠభాగం ఎత్తుగా వుంటుంది కదా అందుకని ఆ పైజమాను ప్రత్యేక శ్రద్ధతో డిజైన్ చేయించారు రెడ్డి గారు”అని డి.వి.నరసరాజుగారు నా ఇంటర్వ్యూ లో చెప్పారు…పుంసాం మోహన రూపాయా అన్నట్టు రామారావుని ఎంత అద్భుతంగా ఆవిష్కరించారో రెడ్డి గారు… ముఖ్యంగా Hair Style… అద్భుతం…కె.వి.మలచిన బొమ్మ రామారావు.. ఎందుకంటే ఏరీకోరీ ఈ పాత్రకు రామారావే కావాలని కోరుకున్నాడు..అందుకే ఆ అభిమానంతోనే రామారావుని అంత అద్భుతంగా తీర్చిదిద్దాడు.ధైర్యశౌర్యపరక్రమాలకు నిలువెత్తు అద్దంలా పురుషసింహం అనే పదానికి perfect నిర్వచనంలా రామారావుని చూపించడంలో రెడ్డిగారు కృతకృత్యులయ్యారు..హీరోయిజానికి సరికొత్త నిర్వచనాన్ని చెప్పి తెలుగు చలనచిత్ర సీమలో తిరుగులేని కథానాయకుడిగా ఎన్.టి.ఆర్.ను తీర్చిదిద్దారు కె.వి.అందుగ్గానుప్రారంభంలోనే నాంది పలికారు…
ఈ ఒక్క చిత్రంతోనే నటనా దురంధరుడిగా ఎస్.వి.ఆర్.విజయకేతనం ఎగురవేసారు..తరువాత చాలా సినిమాల్లో మాంత్రికులకు ఇదే స్టైల్ మార్గదర్శకంగా నిలిచిందీ…నాయక, ప్రతి నాయక పాత్రల గ్రామర్ ను తిరగరాసి రాబోయే తరాలకు ఒక కొత్త బాణినీ సృష్టించారు కె.వి…తరువాత కాలంలో వచ్చిన జానపద చిత్రాల్లో అదే ఒరవడి కొనసాగింది…కెఅంటే కొంటెతనంవిఅంటే వినోదం రెండూ జాస్తియే మనరెడ్డి గారికి అని చెప్పాను కదూ…
ఈ సీనే ఉదాహరణ…”అక్కు…అక్కు…”అంటూ పిలుస్తూ రాణీగారి చాటున బ్రతికే తమ్ముడిగా రాజుగారి ప్రాపకంలో బతికే బావమరిది పాత్రలో రేలంగి..”పిల్లి-ఒక పిల్లి-పిల్లి ముందు రెండు పిల్లులు-పిల్లి వెనుక రెండు పిల్లులు-రెండు పిల్లుల మధ్య పిల్లి”…సరదాగా ఉడుకుమోతు మేనమామను ఏడిపిస్తూ రాకుమార్తె పొడుపుకథ… పిల్లుల పొడుపుకధ విన్న రేలంగి ఉక్రోషంతో ఉడికిపోతూ చేసిన చేష్టలు చూసే మాయాబజార్ లో లక్ష్మణకుమారుడి పాత్రకు రెండో ఆలోచన లేకుండా రేలంగిని కె.వి. ఫిక్స్ చేసుంటారు.ఇక జీవికా జీవుల్లాంటి ఇద్దరు ముఖ్యమైన వ్యక్తుల గురించి చెప్పుకోవాలి..
వారే కె.వి..పింగళి…పింగళి నాగేంద్రరావుది పాత్రలస్వభావాల రూపకల్పనలోను, ఊతపదాలు సృష్టించడలోను అందెవేసిన చేయి.
అందువల్లే తొలి చిత్రమైన గుణసుందరి కథతో కె.వి/పింగళి మధ్య ప్రారంభమైన అక్షరానుబంధం పాతాళభైరవి తో అపురూపమై”మాయా బజార్”తో విడలేని అనుబంధంగా మారి భాషా భావంలా కలిసిపోయాయి…. అందుకే పాతాళభైరవి టైటిల్స్ లో మొట్టమొదటి పేరే
కథా,మాటలు,పాటలు”పింగళి నాగేంద్రరావు”అని వేసి అగ్రతాంబూలమిచ్చి తన ఆత్మీయతను వ్యక్తం చేశారు కె.వి…
ఈ చిత్రానికి సంబంధించి ప్రతి నిర్ణయం కె.వి.దే కావటం గమనార్హం…పింగళి గారికి అంతటి సమున్నత స్థానం ఎందుకు ఇచ్చారో ఈ చిత్రంలోని అక్షరంఅక్షరం నిరూపీస్తుంది…అసలు కవి అన్నవాడు సినిమాలోని ఆయాపాత్రల స్వభావాన్ని అర్ధం చేసుకోవాలి..
తరువాత సంభాషణలు కానీ,పాటలు కానీ వ్రాసేటప్పుడు ఆ పాత్రలను ఆవాహన చేసుకొని ఆయా పాత్రల స్వభావానికనుగుణంగా ఆ పాత్రల ఔచిత్యం దెబ్బ తినకుండా రచన చేయాలి…
ఈ విషయంలో పింగళి గురించి ప్రత్యేకంగా చెప్పాలి.సినిమా పాట,మాట ఎలారాయాలో,ఎలారాయకూడదో స్పష్టమైన అవగాహన వున్న రచయిత పింగళి…కొన్ని సందర్భాల్లో అత్యున్నతమైన పాటలు,పద్యాలు రాసి తెలుగు సినిమాకు కావ్యగౌరవం కలిగించిన అభినవ శ్రీనాధుడు…ఇక పింగళి చమత్కారానికి,ప్రతిభకు పట్టంకట్టే మచ్చుతునకల్లాంటి సరదామాటలు,పేర్లు హరమతి,కాలమతి,దైవాధీనం,నిక్షేపరాయుడు,సదాజప,ఏకాశ, రెండు చింతలు,త్రిశోకానందుడు,డింగరి, డింభకా,అక్కూఇంకా చాలా వున్నాయి…లాచిత్రవిచిత్రమైన పదజాలంతో ప్రేక్షకులను మాయజేసి తనవైపు లాక్కొనే మాటల మరాఠీ మన రచయిత పింగళి అంటే ఏమాత్రంఅతిశయెక్తి లేదు…అందుకే ఆయన సంభాషణలు,పాటలతో తబ్బిబ్బైన నేను ఆయనకు ఇచ్చుకున్న బిరుదులు”విచిత్రకవి, విశిష్టకవి”…చిత్రవిచిత్ర పదజాలాల వైతాళికుడు పింగళి…ఆయన కలం స్ప్రశించని సాహితీ ప్రక్రియ లేదు…తన విద్వత్తును జనబహూళ్యంలోకి తీసుకువెళ్ళిన పింగళి కవనం తప్ప కనకం మొహం చూడని శ్రోత్రయ బ్రాహ్మణుడు..ఆయనేమిటి ఆతరంలో దాదాపు అందరూ”దోచుకోవటం-దాచుకోవటం” తెలియని పండితోత్తములే…ఇకముఖ్యంగా ఆయన రాసిన మదిని కలవరపరిచే పాట…”ఎంత ఘాటు ప్రేమయో”…
అక్కడికీ రేలంగికి సందేహమొచ్చి అడిగాట్టా”బ్రహ్మచారై వుండి ఇలాంటి పాటలు ఎలా రాస్తున్నారు”అని…ఆయన సమాధానమేదైనా…”సంసారంలో ఈదులాడేవాడికి ఇంత రసానుభూతి వుంటుందా..”అన్నది నా సందేహం…వుండదుగాక వుండదు అందుకే ఆ పాట సూపర్ డూపర్ హిట్టై ఆల్ టైం మనసులను హిట్టు చేస్తోంది…ఇంతేనా కొంతమందైతే”ఘాటు ప్రేమ ఏమిటండీ పింగళిగారు…ప్రేమకు రంగు,రుచి,ఇంకా వాసన కూడానాపైగా అదో దుష్ట సమాసం…భావప్రకటన కూడా సరికాదు…”అన్నారట”గుడిసెలో వుండే తోటరాముడికి,కోటలోని రాకుమార్తెకి మధ్య పుట్టిన ప్రేమ అది… రాకుమారికి రాముడి ప్రేమ ఘాటుగా అన్పించింది…
అయినా ప్రేమలో పడ్డవాడికి వ్యాకరణమేమిటి…ళ్ళు పాడిందే పాట గానీ…”అని కొంటె సమాధానంతో వాళ్ళ నోటికి తాళం వేసారు పింగళి…ఆ పాట ఆంధ్ర దేశమంతటా ఎంత గొప్పగా మారుమ్రోగిందో చెప్ప నవసరం లేదు…కె.వి,పింగళి గార్ల కాంబినేషన్ ఆరోజుల్లో కళతోపాటు కాసుల వర్షం కురిపించిందిపాతాళభైరవి.. అందుకే ఇది బ్లాక్ అండ్ వైట్ బంగారం…ఇప్పటికే చాలా సుదీర్ఘమైన రైటప్ అయింది… అందుకని”ఎంత ఘాటు ప్రేమయో”పాట గురించి మళ్ళీ మాట్లాడుకుందాం..ఈ సినిమా తమిళంలో కూడా రు,హిందీలో డబ్ చేసారు కూడా…సరదాగా తమిళపాటను చూద్దాం…అటువంటి అందగాడైన రామారావు పక్కన ఒకే ఒక్క సినిమాలో నటించి చరిత్రలో మిగిలిపోయింది”మాలతి”మళ్ళీ మన తెలుగు ఘాటు ప్రేమతో కలుద్దాం… శెలవ్…