25 ఆగస్టు 2020
అమీన్‌పూర్ ఘటనపై సిట్ ఏర్పాటుకు మహిళా సంఘాల డిమాండు.అమీన్‌పూర్ ఘటనపై సిట్ ఏర్పాటు చేసి మహిళా పోలీసు అధికారిణి నేతృత్వంలో విచారణ జరిపించాలని మహిళా సంఘాలు, ట్రాన్్స జండర్ సంఘాల ఐక్యకార్యాచరణ వేదిక డిమాండు చేసింది.
అమీన్పూర్ మారుతి అనాధాశ్రమంలో దళిత మైనర్ బాలికపై అత్యాచారం, మృతిపై సమగ్ర విచారణ జరిపించాలి ఈ సంఘాల నేతలు కలసి ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో కోరారు.
తల్లిదండ్రులను కోల్పోయిన దళిత మైనర్ బాలిక సంగారెడ్డి జిల్లా పరిధిలోని అమీన్‌పూర్ మారుతి అనాధాశ్రమంలో ఆశ్రయం పొందుతుండగా అనేకసార్లు అత్యాచారానికి గురయ్యి…తీవ్ర అనారోగ్యంతో మరణించిన సంఘటన పై సమగ్ర విచారణ జరిపి దోషుందర్ని కఠినంగా శిక్షించాలని, ఇటువంటి అక్రమాలన్నింటిపైన దర్యాప్తు జరపాని మహిళా, టాన్స్ జెండర్ సంఘాల, వ్యక్తుల ఐక్యకార్యాచరణ డిమాండ్ చేస్తున్నది. ఐక్య కార్యాచరణ నిజ నిర్ధారణ కమిటీ విచారణలో తేలిన వాస్తవాల ఆధారంగా చేస్తున్న డిమాండ్లు:(వీటిని సంబంధిత అధికారుల దృష్టికి కూడా తీసుకువెళ్ళడం జరిగింది.)
-మారుతి అనాధాశ్రమం నిర్వాహకులు పాప అనారోగ్యంతో ఉన్నప్పుడు ఆసుపత్రికి కాకుండా మార్చి 21న బంధువు ఇంటికి లాక్ డౌన్ పేరుతో పంపేశారు. జూలై 30న పాప తన మీద జరిగిన అత్యాచారాన్ని బంధువు దృష్టికి తీసుకెళ్లగా జూలై 31న పోలీసుల దగ్గర ఫిర్యాదు చేశారు. బాలికపై అత్యాచారం జరిగిందని పరీక్షలో తెలిసినా గానీ, అప్పటికే తీవ్ర అనారోగ్యంతో వున్న పాపకు వైద్యచికిత్స అవసరమయినప్పటికీ పరీక్షలు జరపకుండా ఆగస్టు 7న పరిస్థితి విషమించేదాకా అధికారులు ఆసుపత్రిలో చేర్చలేదు.
పాప చనిపోవటానికి కారణమయ్యారు. ఇది నేరపూరిత నిర్లక్ష్యమే కాదు వ్యవస్థాగత వైఫల్యం కూడా. దీనికి బాధ్యులైనవారిపై కఠినమైన చర్యలు తీసుకుకోవాలి.
-జులై 31న FIR చేసిన తర్వాత వేణుగోపాల్ రెడ్డి, వార్డెన్ విజయ, ఆమె తమ్ముడు జయదేవ్‌ను అరెస్టు చేయటంలో జాప్యం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి. FIR లోనిందితుల పూర్తి పేర్లు, వివరాలు ఉండాలి.
–ఆగస్టు 1వ తేదీన భరోసా కేంద్రంలో బాలికకు వైద్య పరీక్ష నిర్వహించాక అమె శరీరంపై హింసించిన చిహ్నాలు ఉంటే పాపను వెంటనే ఆసుపత్రికి పంపి, అనుమానితులపై వెంటనే కేసు ఎందుకు పెట్టలేదో విచారించాలి.
–ఆగస్టు 3వ తేదిన విచారణకు పిల్చి బాలిక స్టేట్‌మెంట్ నమోదు చేసుకొన్న CWC రంగారెడ్డి జిల్లా బాధ్యులు… ఐదో రోజున అంటే ఆగస్టు 7వ తేదీన తిరిగి బందువుల పైనే పోక్సో కేసు నమోదు చేసి వారి అరెస్టుకు వత్తిడి చేయడానికి కారణాలు విచారించాలి. మారుతి అనాధాశ్రమంలో జరిగిన అత్యాచారం, దానిమీద రిజిస్టరు అయిన FIR (218/2020) ను కనీసం ప్రస్తావించకుండా ఎందుకు వదిలివేశారు?
`ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే నింబోలిఅడ్డ హొమ్ (CCI) కి ఆగస్టు 3వ తేదీ పాప ని పంపించిన కారణం అక్కడ వైద్యుల పర్యవేక్షణ వుంటుందనే! 7వ తారీఖున పాప ఆరోగ్య పరిస్థితి తీవ్రంగా విషమించేవరకూ అక్కడి అధికారులు ఏం చేశారని ప్రశ్నించారు.పెద్దల రక్షణ లేని పిల్లల సంరక్షణను బాధ్యతాయుతంగా నిర్వర్తించాల్సిన ప్రభుత్వ వ్యవస్థలన్నీ కూడా ఈ పాప ఆరోగ్య పరిస్థితిని ఏ మాత్రం సీరియస్‌గా పట్టించుకోకపోవటంతో అత్యంత విషాదకర పరిస్థితిలో చనిపోయింది. ఈ పాప కేసులో ఇన్‌వాల్వ్ అయిన అన్ని వ్యవస్థల మీదా కూడా నిష్పక్షపాతమైన విచారణ జరిపి బాధ్యులను శిక్షించాలని డిమాండు చేశారు.-ఈ పాపతో పాటు మార్చికి ముందు ఆశ్రమంలో ఉన్న బాలికను ఎక్కడవున్న వెతికి తీసుకువచ్చి చైల్డ్ ఫ్రెండ్లీ పోలీస్ అధికారి, సోషల్ వర్కర్, తల్లి తండ్రులు, చైల్డ్ సైకాజిస్టు ఆధ్వర్యంలో నిజాలు వెలికితీయాలని కోరారు. వీరు కింది డిమాండ్లు ప్రభుత్వం దృష్టికి తెచ్చారు.
-ఆశ్రమంలోని బాలలందరికీ ‘‘ట్రామా’’ ట్రీట్‌మెంట్ ఇప్పించాలి.
–రిజిస్టర్ అయిన లేదా రిజిస్టర్ చేసుకోని అన్ని హోమ్‌లు, ఆశ్రమాలపై, వాటి అక్రమాలపై పూర్తిస్థాయి విచారణ జరపాలి. ఇటువంటి ఘటనలు భవిష్యత్తులో మళ్లీ జరగకుండా ప్రభుత్వంచే గుర్తింపబడిన సంస్థల మేలు కలయికతో పారదర్శకంగా పర్యవేక్షణ జరిగేలా చర్యలు చేపట్టాలి.
-NCPCR(నేషనల్ కమిషన్ ఫర్ ది ప్రొటెక్షన్ ఆఫ్ ఛైల్డ్ రైట్స్), NCW ల మార్గదర్శకాలు పాటించని అన్ని హోమ్‌ల గుర్తింపు రద్దు చేయాలి. ఆ బాలలకు ప్రభుత్వం బాధ్యత వహించాలి.
` మారుతీహోమ్ విజయ, ఆమెకు సంబంధించిన వ్యక్తులు ఎవ్వరూ మళ్ళీ ఇటువంటి ఆశ్రమాలు నడపకుండా వారిని బ్లాక్ లిస్టు లో పెట్టాలి.
ఈ ప్రత్రికా సమావేశంలో సజయ(సామాజిక విశ్లేషకులు), సంధ్య (POW), ప్రొఫెసర్ సుజాత సూరేపల్లి(దళిత్ విమెన్ కలెక్టివ్), ఖలీదా పర్వీన్ (అమూమత్ సొసైటీ), నాగలక్ష్మి(ఐద్వా), ప్రీతీ (పాప పిన్ని), కొండవీటి సత్యవతి(భూమిక), అనురాధ(అమన్వేదిక) మాట్లాడారు. వీరితో పాటు దేవి,
సుమిత్ర, కృష్ణ కుమారి, ఇందిర, అంబిక, రుక్మిణి, పద్మజ, మల్లు లక్ష్మి, సుమలత, విజయ బండారు, గిరిజ, ప్రకాష్, వెంకటనరసయ్య, ప్రసాద్, బీరం రాము మొదలైనవారు పాల్గొన్నారు.