పశ్చాత్తాపం లేని ఒక కార్పోరేట్ దళారీ

1385

భారత ప్రభుత్వంతో రైతులు వీరోచితింగా చేస్తున్న పోరాటాన్ని మండీ దళారుల ప్రోత్సాహంతో నడిపిస్తున్న కృత్రిమ ఉద్యమంగా చిత్రీకరించే పనిని కొందరు మేధావులని ముద్రలేసుకున్న వాళ్ళు భుజానికి ఎత్తుకున్నారు. ప్రస్తుతం తెలుగు నేల మీద అలాంటి పని చేస్తున్న వాళ్ళలో ప్రముఖుడు జయప్రకాష్ నారాయణ్ (జేపీ).

ప్రస్తుత సందర్భంలో జేపీని ఒక మేధావిగా భావించడం కన్నా ఒక కార్పోరేట్ దళారీగా చూడడం సరయినది. ఎందుకంటే “రైతు మేలు కోసమే” అంటూ కార్పోరేట్ ప్రయోజనాల కోసం ఆయన సమర్థిస్తున్న కొత్త చట్టాల మూలంగా రైతు తన పంట మీద, జీవితం మీద పూర్తి నియంత్రణ కోల్పోయి ఒక నిర్జీవ వస్తువుగా మారి మార్కెట్ చేతిలో ఒక సాధనమయ్యే ప్రమాదం ఉంది. ఇక మీదట రైతు మార్కెట్ నిర్దేశించే పంటలే వెయ్యాలి. అది చెప్పే విత్తనాలు, రసాయనాలే వాడాలి. మార్కెట్టే ధర నిర్ణయిస్తుంది. చివరికి రైతు భూమికి, మార్కెట్ కు మధ్య ఒక appendage గా మిగిలిపోయే అవకాశం వుంది. ఈ మొత్తం ప్రక్రియలో జేపీ లాంటి ఎందరో మేధో దళారులు తమ శక్తినంతటిని పోగుచేసుకోని రైతు వ్యతిరేక చట్టాలకు ప్రజల మద్దతు కూడగట్టే పని చేస్తున్నారు.

జేపీకి వున్న ప్రత్యేకత ఏమంటే కుతర్కాన్ని కూడా గట్టిగా ఒక్కానించి తర్కంగా చెలామణీ చేయగల్గడం. వాదనలోని వైరుధ్యమైన, అహేతుకమైన అంశాలను సహితం తన గంభీరత్వంతో కప్పేయడం. తనకు తానుగా ప్రజల తరుపున వకాల్తా పుచ్చుకున్న మేధావిలా ముద్ర వేసుకొని ప్రజల గొంతుకకు అడ్డుపడటం. తన భాషా ప్రావీణ్యంతో అనేకనేక ప్రవచన విన్యాసాలు చేస్తున్నప్పుడు ఎంతోకొంత మందైనా “అరే జేపీ లాంటి పెద్ద మనిషే ఈ చట్టాలను ఆహ్వానిస్తున్నాడంటే వాటిలో ఏదో మంచి వుండేవుంటది” అని భ్రమ పడేటట్లు చెయ్యడం. అయితే “మా ఇల్లు సత్యహరిచంద్రుని ఇంటి పక్కనే” అని చెప్పుకున్నంత మాత్రాన తాను చెప్పేవన్నీ సత్యాలయిపోవు కదా. అందుకే నీ “ఒట్టి మాటలు కట్టిపెట్టోయ్” అని సున్నితంగానే కొందరు చెబుతున్నారు. కాని ఆయన మాత్రం “నాకు ఏ సిద్ధాంతాలతో పనిలేదు, రైతు మేలే నాకు ముఖ్యం” అనే మాట అన్ని టీవీ చానల్స్ లో ప్రతిధ్వనించేలా మళ్ళీ మళ్ళీ చెబుతూనే వున్నాడు.

వ్యవసాయ చట్టాల మీద తాను చేస్తున్న వాదనలోని డొల్లతనాన్ని ఇప్పటికే ఎందరో రైతు మిత్రులు అనేక మాధ్యమాలలో ఎండగట్టివున్నారు. కాబట్టి వాటి లోతుల్లోకి మళ్ళీ వెల్లదల్చుకోలేదు. అయితే ఆయనలాంటి దళారీలను లోతుగా అర్థం చేసుకోవాలంటే తనకు ఏ సిద్ధాంతమూ లేదంటూనే ప్రచారం చేస్తున్న నయాఉదారవాద మార్కెట్ సిద్ధాంతం గురించి మాట్లాడుకోవాలి.

చట్టాల గురించి ఆయన చేస్తున్న వాదనలను ఉపరితలంలోనే పరిశీలిస్తే అవి ఎంతో ఆకర్షణీయంగా, రైతు ప్రయోజనకారిగా కనిపిస్తాయి. ఈ చట్టాలు చెబుతున్న కొన్ని ముఖ్యమైన అంశాలను చూద్దాం: ఈ కొత్త చట్టాలు రైతును దళారీ వ్యవస్థ నుండి విముక్తి (liberation) చేస్తాయి. రైతులు తమ ఇష్టానుసారం పంటను దేశంలో ఎక్కడైనా, ఎవరికైనా అమ్ముకునే అవకాశం (choice) పొందుతారు. మార్కెట్లో ఎక్కువమంది కొనుగోలుదారులు ఉంటే రైతు తన పంటకు ధర ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ళకే అమ్ముకునే ప్రయోజనం (competitive advantage) ఉంటుంది. దీని మూలంగా మధ్యవర్తులు, వాళ్ళ లాభాల గోల లేని ఒక పారదర్శక (transparency) పరిస్థితి వచ్చి రైతు, మార్కెట్ శక్తులు ఇద్దరు లాభపడే అవకాశం (win-win situation) ఉంటుంది. ఈ చట్టాల మూలంగా ప్రభుత్వ గిడ్డంగుల్లో ధాన్యం కుళ్ళిపోకుండా రైతు పొలం నుండే కొనబడిన ఆహారధాన్యాలు మార్కెట్ సామర్ధ్యం (market efficiency) మూలంగా మెరుగైన నాణ్యతతో కూడిన ఆహారంగా (value added food) తిరిగి వాళ్ళ పళ్ళాలలోకి వస్తాయి. మొత్తంగా ఈ చట్టాల మూలంగా రైతుల ఆదాయాలు పెరుగుతాయి. రిస్క్ తగ్గుతుంది. గ్రామీణ ఉపాధులు పెరుగుతాయి. చివరిగా రైతులు స్వేఛ్ఛా వాణిజ్య మార్కెట్ (free market) లో ఎలాంటి అడ్డంకులు లేకుండా విహరిస్తారు.

వినడానికి ఎంత బాగున్నాయి కదా! ఇటువంటి మాటలు చెప్తూ ఒక ఊహాలోకంలోకి తీసుకుపోతున్నారు జేపీ లాంటి పెద్దమనుషులు. ఇవన్నీ వీళ్ళ బుర్రల్లోంచి వచ్చినవే అనుకుంటే పొరబడినట్లే. వీటి మూలాలు వెతకడం పెద్ద కష్టమైన పనేమి కాదు. కనీసం 1980 నుండి వ్యవసాయం మీద ప్రపంచబ్యాంక్ ప్రకటిస్తున్న ఏ పాలసీ డాక్యుమెంట్ ను చూసినా ఈ పెద్దమనుషుల సుద్దుల అసలు రహస్యం బయట పడుతుంది.

ప్రపంచబ్యాంక్ ఏం చెబుతుంది? వ్యవసాయాన్ని ఒక వ్యపారంలాగా చూడాలని చెబుతుంది. వ్యవసాయంలో మా జీవితముంది, సంస్కృతి వుంది, అది ప్రకృతితో ముడిపడివుంది… ఇలాంటివన్ని ప్రపంచబ్యాంక్ దృష్టిలో “పనికిమాలన వెనుకబాటుతనపు మాటలు.” మరి వ్యవసాయం ఎట్లా చెయ్యాలి, రైతులు ఏం పండించాలి? ప్రపంచ మార్కెట్ ఏది నిర్దేశిస్తే అది రైతులు పండించాలి. ఎందుకంటే మార్కెట్ వ్యక్తులకన్నా, ప్రభుత్వాల కాన్నా ఎక్కువ సామర్థ్యం కలిగి ఉంటుంది. నిష్పాక్షికంగా పనిచేస్తుంది. కాబట్టి ప్రభుత్వాలు మార్కెట్ కు చట్టపరంగా, భద్రత పరంగా కావాల్సిన అన్ని చర్యలు తీసుకోవాలని ప్రపంచబ్యాంక్ గత నలభై సంవత్సరాలుగా అన్ని దేశాలను ఆదేశిస్తుంది.

ప్రపంచబ్యాంక్ కేవలం ఆదేశించడమే కాదు, దానికి అనుకూలంగా తన వాదనలను ప్రజల్లోకి తీసుకుపోవడానికి ప్రజలను మోసం చేస్తున్నామని పశ్చాత్తాప పడని ఒక దళారీ మేధావి వర్గాన్ని కూడా తయారు చేసుకుంది. అటువంటి ప్రయోగశాలలో తయారుకాబడిన దళారీ లక్షణాలు పుష్కలంగా వున్న వ్యక్తుల్లో పోటీ పడి మొదటివరుసలో ఉండగలిగిన వాడు జేపీ. సరే, ఆయన ఏ పల్లకీ మోస్తే మనకేంటి, దాని మూలంగా రైతులకు వచ్చే నష్టం ఏంటి? అనేది సహజంగా వచ్చే ప్రశ్నే.

ఈ చట్టాల ఫలితాలు అనుభవిస్తేనే కాని తెలువనివి కాదు. ఎందుకంటే వీటిని సామ్రాజ్యవాద శక్తులు ప్రపంచమంతా ఏదో ఒక స్థాయిలో, ఏదో ఒక రూపంలో అమలు చేస్తూనే ఉన్నాయి. అన్నింటికి “ఆదర్శంగా” చెప్పుకునే అమెరికాలో 1980ల నుండి వ్యవసాయ రంగంలో తీసుకొచ్చిన సంస్కరణల మూలంగా రైతాంగం తీవ్రంగా నష్టపోయి చతికిల పడింది. ముఖ్యంగా చిన్న రైతులు (మూడు, నాలుగు వందల ఎకరాల భూమి వుండే వాళ్ళు) వ్యవసాయం నుండి బయటకు వెళ్ళిపోయి పెద్ద రైతుల (మూడు, నాలుగు వేల ఎకరాల భూముండే) కమతాలు ఇంకా పెరుగుతున్నాయి. ఈ భూకేంద్రీకరణ తీవ్రం కావడానికి కారణం చిన్న రైతులు “స్వేచ్ఛా మార్కెట్” లో బతకలేని పరిస్థితి మూలంగానే.

“స్వేచ్ఛా మార్కెట్” లో స్వేచ్ఛ వుండేది కేవలం కార్పోరేట్ శక్తులకే కాని రైతులకు కాదు. ఎందుకంటే అందంగా చెప్పబడుతున్న స్వేచ్ఛా మార్కెట్ లో కేవలం కొన్ని బహుళజాతి సంస్థలు మాత్రమే గుత్తాధిపత్యాన్ని కొనసాగిస్తున్నాయి. ఎలాంటి పరిస్థితుల్లో, ఏ నిర్వచనం పరంగా కూడా మార్కెట్ లో రైతులకు స్వేచ్ఛ దొరకదు. కేవలం ఐదు కార్పోరేషన్లే ప్రపంచ వ్యాప్తంగా ఎనభై ఐదు శాతం విత్తనాలను, రసాయనాలను, ఆహార ఉత్పత్తుల కొనుగోలును నియంత్రిస్తున్నాయి. ఇటువంటి స్థితిలో అమెరికాలోని రైతే బతకలేని పరిస్థితి వుంటే ఇక భారత రైతాంగం గురించి ఏం చెప్పగలము. వాస్తవానికి, అమెరికన్ రైతులలో ప్రతి సంవత్సరం ఆత్మహత్యల సంఖ్య పెరుగుతూ వుంది. ఆశ్చర్యంగా ఉండొచ్చు, కాని ఇది వాస్తవం. కొద్దిపాటి పరిశోధనతో ఎవరికైనా అర్థమయ్యే విషయం.

అమెరికా పైన వున్న కెనడాలో కూడా పరిస్థితి ఏమి మెరుగ్గా లేదు. దాదాపు పదిహేను సంవత్సరాల క్రితం నేను పిహెచ్ డి చెయ్యడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక రైతు సదస్సుకు వెళ్ళే అవకాశం వచ్చింది. అక్కడికి వెళ్ళే ముందు అనుకున్నా ఈ రైతులకు ఏం సమస్యలు ఉంటయిలే అని. నేను అనుకున్నట్లే ఆ రైతులు మంచి సూటు, బూటు వేసుకొని వున్నారు. అక్కడ మీటింగ్ అయిపోగానే కొందరు డాన్స్ ప్లోర్ మీద బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అవన్నీ చూస్తున్నప్పుడు తెలంగాణలో పురుగుల మందు తాగి చస్తున్న రైతులే గుర్తుకొచ్చారు. అయితే కాసేపు అయిన తర్వాత డిన్నర్ దగ్గర ఒక రైతుతో మాటలు కలిసి అతనే అడిగాడు “మీ దగ్గర రైతు పరిస్థితి ఏంటి?” అని. ఆయన ఆ మాట అడగగానే రైతుల బాధలు, ఆత్మహత్యలు అన్ని ఆగకుండ పది- పదిహేను నిమిషాలు చెప్పిన. అంతా ఓపికగా విన్న ఆ పెద్దాయన మెల్లగా అన్నడు “మా దగ్గర రైతు ఆత్మహత్యలు లేవు కాని మేము ఆత్మహత్యా పరిస్థితుల్లో (suicidal conditions) బతుకుతున్నం” అని.

ఆ ఒక్క మాటతో నాకు దిమ్మ తిరిగి పోయింది. ఒక్క దెబ్బతో నా తప్పుడు అవగాహన పటాపంచలయ్యింది. కేవలం వాళ్ళ తెల్ల రంగుని బట్టి, వాళ్ళ రూపాన్ని బట్టి వాళ్ళను తప్పుగా అంచనా వేసినందుకు చాలా గిల్టీ ఫీల్ అయిన. ఆ ఒక్క మాటతోనే నా పరిశోధనలో కెనేడియన్ వ్యవసాయాన్ని జత చేసిన. అయితే వాస్తవానికి ఆ కెనేడియన్ రైతు చెప్పినట్లు ఆత్మహత్యలు లేవని కాదు, కాని వాళ్ళ మరణాలు ఆత్మహత్యలుగా నమోదు కావడం లేదు. ఎందుకుంటే ఆత్మహత్య అని చెబితే వాళ్ళకు రావాల్సిన ఇన్సూరెన్స్ డబ్బులు రాకుండా పోతాయని. ప్రస్తుతం నేను అమెరికాలో రైతుల మీద చేస్తున్న పరిశోధన కూడా అదే విషయాన్ని చెబుతుంది.

అభివృద్ధి చెందిన దేశాలలోనే పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే ఇక మన రైతుల భవిష్యత్తు గురించి ఊహించుకోవడం కష్టమేమీ కాదు. ఇది కేవలం వ్యవసాయానికి మాత్రమే కాదు, ప్రజల ఆహారభద్రతకు, జీవవైరుధ్యానికి, ప్రకృతికి పెద్ద విఘాతం. ఇప్పటి వరకు ఏదో బాగుందని కాదు. కాని ఈ చట్టాల మూలంగా రైతులు పెనం మీది నుండి పొయ్యిలో పడిపోతారు.

రైతులు ఒక వర్గంగా, సమూహంగా ఉండే స్థితి నుండి మార్కెట్ కు సరుకులు అందించే ఒక ఏజెంట్ వ్యవస్థగా మార్చబడుతారు. సమిష్టితత్వం స్థానంలో వ్యక్తివాదం నిలబడిపోతుంది. రైతుల హక్కులు హరించబడటమే కాకుండా, వాళ్ళు సంఘటితమయ్యే శక్తి కూడా సన్నగిల్లుతుంది. ఎందుకంటే వాళ్ళ రాజకీయ ఏజన్సీని మార్కెట్ శక్తులు, వాళ్ళ ప్రయోజనాలు నియంత్రిస్తాయి కాబట్టి.

ఇది కేవలం రైతుల సమస్య కాదు. అందరి మనుషుల సమస్య. మనిషికి-ప్రకృతికి ఉండే సమతుల్య సంబంధాల సమస్య. ఇది భవిష్యత్తు సమస్య. భావితరాల సమస్య. అందుకే బడా కార్పోరేట్ సంస్థల ప్రయోజనాల కోసం పాటుబడుతున్న దళారీలను ఎండగడుదాం. రైతులతో కౄర పరిహాసం ఆడుతున్న రాజ్యం కళ్ళల్లో మట్టిగొట్ట సిద్ధమవుతున్న మనుషులందరిని గుండెకు హద్దుకుందాం. రైతుల పోరాటానికి అన్ని రకాల మద్దతునిద్దాం!

అశోక్ కుంబము