రాజ్యాంగ హక్కులపై పితృస్వామ్య పెత్తనం

2767

రాజ్యాంగం పౌరులకు యే వివక్ష లేకుండా సమానత్వ హక్కు యిచ్చినప్పటికీ అమలుపరిచే వారికి హృదయం లేకపోతే అవి కాగితాలకే పరిమితమై, అస్తిపంజరంలా మిగులుతాయని అంబేడ్కర్ పేర్కొన్న అంశాలు రాధికమ్మ, గుల్రుఖ్ గుప్తా, హదియా వంటి యెందరో స్త్రీల విషయంలో మళ్ళీ రుజువవుతున్నాయి. కుల, మతపరమైన అంశాలలో మహిళా ఉద్యమాలు యింకా ఉధృతంగా పనిచెయ్యాల్సిన అవసరాన్ని ఆ మహిళల ఉదంతాలు హెచ్చరిస్తున్నాయి.


భారత రాజ్యాంగం (ఆర్టికల్స్ 25–28) యే భేదం లేకుండా పౌరులందరికీ తమకిష్టమైన మతాన్ని పాటించే హక్కునిచ్చింది. రాజ్యాంగం ప్రకారం స్త్రీ పురుషులిద్దరూ అన్ని విషయాలలోనూ సమానమే. ఆచరణలో మాత్రం కుల, మత అంశాలలో పురుషుడిని ‘యెక్కువ సమానం’గా రాజ్య వ్యవస్థలు పరిగణిస్తూ స్త్రీని రెండవ తరగతి పౌరురాలిగా చూస్తుండడం గమనించవచ్చు. ఆ ధోరణి దళిత, మైనారిటీ స్త్రీల విషయంలో యిటీవల జరిగిన కొన్ని సంఘటనలలో స్పష్టంగా కనిపిస్తుంది. గుజరాత్‌లో పార్సీ మతస్థురాలైన గుల్రూఖ్ గుప్తా, హైదరాబాద్‌ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి రోహిత్ వేముల తల్లి రాధికమ్మ, కేరళలో హదియా, రాజస్థాన్‌లో జరిగిన ‘పరువు హత్య’ల విషయంలో సంబంధిత స్త్రీల పట్ల పోలీసులు, కోర్టులు కూడా పితృస్వామిక ధోరణితో మెలగడం ఆశ్చర్యం కలిగిస్తుంది.
గుజరాత్ రాష్ట్రంలో గుల్రుఖ్ గుప్తా అనే పార్సీ మతస్థురాలు యితర మతస్థుడిని వివాహం చేసుకున్నాక ఆమె తన పాత మతపరమైన గుర్తింపును, ఆచారాలను కొనసాగించుకోవడానికి కోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. అయితే గుజరాత్ హైకోర్టు 1954 స్పెషల్ మ్యారేజ్ చట్టం ప్రకారం మతాంతర, కులాంతర వివాహాలు చేసుకున్న స్త్రీలు తమ పాత కుల, మత పరమైన గుర్తింపులను యథావిధిగా కొనసాగించుకోవచ్చనే హక్కును తిరస్కరించి గుల్రుఖ్ గుప్తా పార్సీయేతర మతస్థుడైన తన భర్త మతాన్నే అవలంబించాలని తీర్పునిచ్చింది.
ఇటీవల కేరళ రాష్ట్రంలో మెడిసిన్ విద్యార్థిని అయిన అఖిల(హదియా) మత మార్పిడి, వివాహం కేసు కూడా స్త్రీల మత హక్కును ప్రశ్నార్థకం చేసి దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. హిందూ తల్లిదండ్రులకు పుట్టిన 24 సంవత్సరాల అఖిల తన స్నేహితురాలి ప్రభావంతో ఇస్లాం మతంపైన వ్యక్తిగతంగా అభిమానం పెంచుకుని తన మతం మార్చుకుని తన పేరును ‘హదియా’గా మార్చుకుంది. ఆ తర్వాత హదియా మ్యారేజ్ బ్యూరో ద్వారా ‘జహాన్’ అనే ముస్లిం మతస్థుడిని వివాహం చేసుకుంది. ఆమె మత మార్పిడి, వివాహం నచ్చని ఆమె తల్లిదండ్రులు తమ కుమార్తె విషయంలో ‘లవ్ జిహాద్’ అనే కుట్ర దాగి వుందని, ఆమెను మోసపూరితంగా మతం మార్చి పెళ్ళి చేశారని, జహాన్‌కు ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్నాయని, అతడు తమ కుమార్తెని అరబ్ దేశాలకు తరలించి మాయ చేస్తాడని, ఆ వివాహాన్ని రద్దు చేసి ఆమెని తిరిగి తమకు అప్పగించమని కోర్టుని ఆశ్రయించారు.
కేరళ హైకోర్టు హదియా 24 సంవత్సరాల మేజర్ అయినప్పటికీ ఆమె యితరుల చేత మోసగించబడటానికి అవకాశాలున్నాయని భావించి ఆమెకు జహాన్‌తో జరిగిన పెళ్ళిని రద్దు చేసి హదియాను ఆమె తల్లిదండ్రుల కస్టడీకి అప్పగించింది. సుమారు సంవత్సర కాలం పాటు హదియా తన భర్తను కానీ, స్నేహితులను కానీ కలవకుండా ఆమె తల్లిదండ్రులు కట్టుదిట్టం చేసినప్పటికీ తర్వాత హదియా తాను మేజర్‌ననీ తన మత మార్పిడి, వివాహం పూర్తిగా తన మనోభీష్టం ప్రకారం జరిగాయని, తనని తిరిగి భర్త దగ్గరకు వెళ్ళనివ్వమని సుప్రీం కోర్తును ఆశ్రయించింది. ఆమె భర్త జహాన్ కూడా తన భార్యను అప్పగించమని కోర్టుకు అప్పీల్ చేశాడు. హదియా మతమార్పిడి, వివాహం విషయంలో సుప్రీం కోర్టు ఆమె తండ్రి ఆరోపిస్తున్నట్టు ‘లవ్ జీహాద్’ వంటి కోణంపైన దర్యాప్తు చెయ్యడానికి నేషనల్ ఇన్వెష్టిగేషన్ ఏజెన్సీని ఆదేశించి, నివేదిక వచ్చాక తన తీర్పును వెలువరించింది. అందులో హదియా చదువు చెన్నై మెడికల్ కాలేజీలో సగంలో వున్నందున ఆమెని తన మొదటి పేరైన ‘అఖిల’గా హాస్టల్‌లో వుంటూ చదువు పూర్తి చెయ్యమని ఆదేశించింది.
ఈ రెండు కేసుల్లో కోర్టులు పూర్తిగా పితృస్వామిక ధోరణితోనూ, హిందూ మెజారిటీ మత ప్రయోజనాలను కాపాడే విధంగానూ వ్యవహరిస్తుండం గమనించవచ్చు. అంతే కాకుండా కోర్టులు ఆ స్త్రీల రాజ్యాంగపరమైన హక్కులను కాలరాస్తూ వారి వ్యక్తిగత జీవితాన్ని సంక్షోభంలోకి నెట్టి వేస్తున్నాయి. యిటీవల ‘ట్రిపుల్ తలాక్’ పద్ధతిని రద్దు చేస్తూ ముస్లిం స్త్రీల పట్ల సుప్రీం కోర్టు కొంత ప్రగతిశీలకంగా వుందనే ఆశాభావం వ్యక్తమవుతున్న దశలో గుల్రుఖ్ గుప్తా, హదియా విషయాలలో కోర్టులు ఆ స్త్రీల మత స్వేచ్ఛని గుర్తించకపోగా హైందవేతరులను బోనులో నిలబెడుతున్నాయి. హదియా కేసులో ‘లవ్ జిహాద్’ అనే కొత్త అంశాన్ని తెరమీదకు తీసుకొచ్చి ముస్లిం మతస్థులను పాపాల భైరవుల్ని చెయ్యడం లౌకిక ప్రజాతంత్రవాదుల్ని కలవర పెడుతుంది.
1954 స్పెషల్ మ్యారేజ్ చట్టం ప్రకారం కులాంతర, మతాంతర వివాహాలు చేసుకున్న దంపతుల్లో స్త్రీలు తమ కుల, మతపరమైన గుర్తింపులను యథావిధిగా కొనసాగించవచ్చు. కులాంతర వివాహం చేసుకున్న వారిలో పురుషుడు అగ్ర కులస్తుడు, స్త్రీ అణగారిన కులానికి చెందిన వ్యక్తి అయితే వారికి పుట్టిన బిడ్డలకు కుల సమాజంలో అగ్ర కులం వారి ఆదరణ దొరికే అవకాశం వుండదు కాబట్టి వారు తల్లికి సంబంధించిన కుల గుర్తింపును పొందవచ్చనే ప్రత్యేక కోర్టు ఉత్తర్వులు వున్నాయి. అయినప్పటికీ ఆచరణలో అవి బాధితులకు అందుబాటులోకి రాకపోవడం గమనార్హం. ఆధిపత్య కులాలకు కొమ్ముకాసే ప్రభుత్వ యంత్రాంగం బాధిత స్త్రీలకు ఆ మాత్రపు వెసులుబాటును అందనివ్వకుండా వేధించడం సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి రోహిత్ ఆత్మహత్య సందర్భంగా చూశాం. అందరూ కలిసి రోహిత్‌ని తన కుటుంబానికి యే విధంగానూ అండగా నిలబడని అతని తండ్రి కులానికి అంటగట్టడం తెలిసిందే!
వివాహం, విడాకులు, మనోవర్తి వంటి విషయాలలో న్యాయస్థానాలు స్త్రీల పట్ల యెంతో పితృస్వామిక వైఖరితో వ్యవహరిస్తూ వారికి రాజ్యాంగం ద్వారా సంక్రమించిన హక్కులను కాలరాస్తున్నాయి. కొన్ని ప్రత్యేక తీర్పుల ద్వారా స్త్రీలకు బిడ్డల సంరక్షణ వంటి విషయాలలో కల్పించిన హక్కులను అమలు జరపడంలో ప్రభుత్వ యంత్రాంగం యెంతో నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తూ తిరిగి పితృస్వామిక స్వభావాన్నే అంతటా ప్రదర్శించడం జరుగుతుంది. యిది కులధృవీకరణ పత్రాలు, ఆధార్ కార్డులు, పాస్ పోర్ట్, వీసాలు పొందే విషయంలో స్పష్టంగా కనిపిస్తుంది.
ఇటీవలి కాలంలో ‘పరువు హత్య’ల పేరుతో కులాంతర మతాంతర వివాహాలు చేసుకునే వారిని నిర్దాక్షిణ్యంగా చంపడం, భయభ్రాంతులకు గురిచెయ్యడం వంటి సంఘటనలు తరచుగా కనిపిస్తున్నాయి. మన సమాజం తిరిగి మధ్యయుగాల చీకటి లోయల్లోకి వెళ్ళిపోతుందేమోననే భయం అంతా ఆవహిస్తుంది. యీ ‘పరువు హత్యలు’ అణగారిన కులాల, మైనారిటీ యువతను బలితీసుకుంటున్నాయి. అవి వారి కుల మత హక్కులనే కాక వారి జీవించే హక్కును కూడా హరించడమే! యిటీవల రాజస్థాన్‌లో జరిగిన ‘పరువు హత్య’ మైనారిటీలను తీవ్ర అభద్రతా భావానికి గురిచేసిందనవచ్చు.
స్త్రీ బాల్యంలో తండ్రి సంరక్షణలోనూ, యవ్వనంలో భర్త సంరక్షణలోనూ, వృద్ధాప్యంలో కొడుకు అధీనంలోనూ వుండాలని మనుస్మృతి పేర్కొంది. భారతదేశంలో న్యాయస్థానాలు కూడా స్త్రీల విషయంలో తు.చ తప్పకుండా మనుస్మృతినే పాటిస్తున్న భావన కలుగుతుంది. ప్రభుత్వ యంత్రాంగం అవలంబించే పితృస్వామిక ధోరణి దళిత, బహుజన, మైనారిటీ స్త్రీల విషయంలో మరింత దారుణమైన పరిణామాలకు దారితీస్తూ ఆ స్త్రీలను వంటరితనానికీ, అభద్రతకూ గురిచేస్తోంది. అందుకే కాబోలు అంబేడ్కర్ ‘రాజ్యాంగ నైతికత’ అనే భావనను చర్చకు పెట్టారు.
రాజ్యాంగం పౌరులకు యే వివక్ష లేకుండా సమానత్వ హక్కు యిచ్చినప్పటికీ అమలుపరిచే వారికి హృదయం లేకపోతే అవి కాగితాలకే పరిమితమై, అస్తిపంజరంలా మిగులుతాయని డాక్టర్‌ బి.ఆర్‌. అంబేడ్కర్ పేర్కొన్న అంశాలు రాధికమ్మ, గుల్రుఖ్ గుప్తా, హదియా వంటి యెందరో స్త్రీల విషయంలో మళ్ళీ రుజువవుతున్నాయి. మన దేశంలో మహిళా ఉద్యమాలు యెంత పెద్ద యెత్తున జరిగినా, అవి కుల, మతపరమైన అంశాలలో యింకా ఉధృతంగా పనిచెయ్యాల్సిన అవసరాన్ని పై సంఘటనలు హెచ్చరిస్తున్నాయి.

ప్రొఫెసర్ చల్లపల్లి స్వరూపరాణి

( ఆచార్య నాగార్జునా యూనివర్సిటీ )