Home Blog Page 2

చెప్పు క‌మ‌లా? మా పుణ్యభూమిలో పుట్టివుంటే నువ్వు ఏమయ్యే దానివి?

— సిద్ధార్ధి సుభాష్ చంద్రబోస్

పొద్దుగాల లేచి, మొగుడి కాళ్లకి దండం పెట్టుకుని, ఆనక ఇళ్లంతా వూడ్చి, గుడ్డతో తుడిచి, ఇంటిబయట వూడ్చి, కళాపి జల్లి, ముగ్గు వేసి, అందులో కుంకుమా, పసుపూ పోసి, మధ్యలో పదిపూలు అలంకరించి, మొహం కడుక్కుని, ఇంత కాఫీ నోట్లో పోసుకుని, మొగుడూ, పిల్లల నోట్లో మరింత పోసి, స్నానం చేసి, మడిగుడ్డల్తో బయటికి వచ్చి, సూర్య నమస్కారాలు చేసుకుని, తూలసికోటకు పూజ చేసి, రూపాయి బిళ్లంత బొట్టు పెట్టుకుని, ఇంటిముందు చెట్లు బోడులయ్యేంతవరకు పూలు తెగ్గోసుకుని, ఇంట్లోకి వెళ్లేది.

దేవుని మందిరంలొ కూర్చొని, లలితా సహస్రనామలు వల్లెవేస్తూ పటాలు తుడిచి, వొత్తులు తయారుచేసుకుని, బొట్టుపెట్టి, తెంపుకొచ్చిన పూలు అలంకరించి, దీపాలు వెలిగించి, అగరొత్తులు తిప్పి, లేచి వాటిని ఇంటా బయటా పొగ దివిటీలుగా గుచ్చి, ఇంట్లోకి వచ్చి పదిదినాల కింద ఫ్రిజ్‌లో నిల్వచేసి, రోజూ కొంత అందులోంచి తవ్వుకుని మిగిలిపోయిన పిండిని తవ్వుకుని, దాంతో పులిసిపోయిన దోశెలు పోసి, అందరికీ వడ్డించి, తనూ ఇంత ఎంగిలిపడి, లేస్తూ లేస్తూ, తాను తిన్న కంచంతో పాటు భర్తా పిల్లలూ తిన్న కంచాలు, పాత్రలూ తీసుకుని, వాటిని తోముకుని, వంటిట్లో సర్దుకుని, మరల మధాహ్న భోజనానికి దినుసులు కడుక్కుని, మధ్యలో వీధిలోని కూరగాయలు కొనుక్కుని, కడుక్కుని, కత్తరించుకుని, వంటచేసేసుకుని, వంటగదిని సర్దేసి, హాల్లో కూర్చొని సీరియల్ చూద్దామనుకుంటే, సగంలోనే వచ్చే భర్త, పిల్లలకు వడ్డించి, తిన్నాక, కంచాలు కడిగి సర్ది, నడుం వాల్చి, కొచెం పురాణం చదువుకుని, సీరియల్ చూసేసరికి సాయంత్రం కాగానే, పదిదేవుడు ప్రత్యక్షం కాగానే టిఫిన్లు, కాఫీలూ కాచి పోసి, రాత్రికి వండి, అందరూ తిన్నాక, అంట్లు సర్దేసి, నడుం వాల్చి.. స్వామీ, రామా! అని కళ్లుమూస్తే..!

సీతలాగా పసితనం నుండి చదువుకున్న చదువుని, బ్రతుకుకి అర్థాన్ని మర్చిపోయి, సొంత వికాసం వదిలేసి జీవితమంతా రాముడీకీ, రాముడి పిల్లలకీ, రాముడి అడుగుజాడల్లో నడిచే ఈ దేశపు సగటు మెదళ్లకు అనుగుణంగా జీవితాన్ని దేకిదేకి ముసలితనంలోకి అస్తమించే సమయం కలలోకి వస్తుండగా, అదే వాస్తవమై తెల్లారుతుంది… మరల రోజు మొదలు…

చెప్పు క‌మ‌లా? మా పుణ్యభూమిలో పుట్టివుంటే నువ్వు ఏమయ్యేదానివి?

ఔను, యీ దేశం మాది

ప్రొఫెసర్ చల్లపల్లి స్వరూపరాణి

ఆది ఆంధ్ర వుద్యమానికి వందేళ్ళు వచ్చాయి. భాగ్యరెడ్డి వర్మ ప్రారంభించిన దళిత ఆత్మగౌరవ వుద్యమం మొదట 1906లో ‘జగన్మిత్ర మండలి’, ‘ఆదిహిందూ సోషల్ లీగ్’ అనే పేర్లతో పనిచేశాక 1917 లో విజయవాడలో జరిగిన మహాసభలో ‘ఆది ఆంధ్ర వుద్యమం’గా రూపుదిద్దుకుంది. సరిగ్గా 1917, నవంబర్ 4,5,6 వ తేదీలలో విజయవాడలో జరిగిన మహాసభ దళిత వుద్యమ చరిత్రలో వో మైలు రాయి అనుకోవచ్చు.

భాగ్యరెడ్డి వర్మ(మదారి భాగయ్య)కుముందు దళితులు సంఘటితమైనట్టు పెద్దగా తెలీదు. దళిత వుద్యమపరంగా ఆయన స్థాపించిన ‘జగన్మిత్ర మండలి’ మొట్టమొదటి సంస్థ అనుకోవచ్చు. ఆయనకి తర్వాత కాలంలో కుసుమ ధర్మన్న, అరిగే రామస్వామి, వేముల కూర్మయ్య, జాలా రంగస్వామి, బత్తుల వెంకటరావు(హైదరాబాద్ అంబేడ్కర్), శ్యాం సుందర్ వంటి మెరికల్లాంటి అనుచరులు వుద్యమ భాగస్వాములయ్యారు.

దళితులు యీ దేశపు మూలవాసులని(Sons of the soil), బ్రాహ్మణ వాద సాహిత్యాన్ని దళిత కోణం నుంచి భాగ్యరెడ్డి విశ్లేషించాడు. ఆరోజుల్లో దేశవ్యాప్తంగా బ్రాహ్మణ బనియాల నాయకత్వంలో జాతీయోద్యమం జరుగుతుంటే దేశ వ్యాప్తంగా దళితులు ఆత్మగౌరవ వుద్యమాన్ని ప్రారంభించి మాకు తెల్ల దొరలకంటే యిక్కడి పెత్తందారులైన నల్లదొరల నుంచి స్వతంత్ర్యం కావాలని ‘స్వరాజ్యం, ‘స్వతంత్ర్యం’ అనే విషయాలలో తమ ఆకాంక్షలను వ్యక్తం చేశారు. పంజాబ్ లో మంగూరాం(ఆది ధర్మి), వుత్తరప్రదేశ్ లో స్వామి అచ్యుతానంద(ఆది హిందూ), తమిళనాడులో పండిత అయోతీదాస్(శాక్య బౌద్ధ సమాజం), కేరళలో అయ్యంకాళి(సాధుజన పరిపాలనా సంఘం) యిదే తరహాలో దళితులు యీదేశ మూలవాసులనే ఆత్మగౌరవ ప్రకటన చేసి వారిలో చైతన్యాన్ని ప్రోది చేశారు.

దళిత వుద్యమకారులు విజయవాడలో పెద్ద యెత్తున సభ నిర్వహించబోతున్నారని తెలిసి బ్రాహ్మణ వాదుల గుండెల్లో రైళ్ళు పరుగెత్తాయి. అప్పట్లో దేశవ్యాప్తంగా దళితుల దేవాలయ ప్రవేశ వుద్యమాలు జరుగుతున్నందున వీరు గుడిలోకి యెక్కడ వస్తారోనని ఆ మూడు రోజులూ కనకదుర్గ గుడిని మూసి వుంచారు. స్థానికంగా కార్యక్రమాన్ని నిర్వహించేవారు ‘పంచమ మహాసభ’ గా బ్యానర్లు కట్టగా, భాగ్యరెడ్డి ‘పంచమ’ పదం తమను అవమానించడానికి బ్రాహ్మణ మత సాహిత్యం వుపయోగించింది కనుక దాన్ని తీసి వేయించి ‘ఆది ఆంధ్ర మహాసభ’ గా సవరించి రెండో రోజు బ్యానర్లలో కూడా పేరు మార్చి దళిత ఆత్మ గౌరవ పతాకను విజయవాడ నడిబొడ్డున యెగరవేశారు.

వీరు ప్రారంభంలో బ్రహ్మ, ఆర్య సమాజాల ప్రభావానికి గురైనప్పటికీ క్రమంగా దళిత తాత్వికతతో ముందుకెళ్ళి ఆనాటి మనువాదానికి ముచ్చెమటలు పట్టించారు. కుసుమ ధర్మన్న అనే మేరునగ ధీరుడు ‘యీహిందూమతంతో మేము వేగలేము, దీన్ని తిరస్కరిస్తున్నాము’ అని 1936లో విజయనగరంలో జరిగిన చారిత్రాత్మకమైన మహసభలో ప్రకటించి అంబేడ్కర్ దారిలో ప్రయాణం ప్రారంభించాడు.
ఆది ఆంధ్ర వుద్యమం యెంతో సాధించింది. దీని ప్రభావంతో కోస్తాంధ్రలో(వుభయ గోదావరి, విశాఖ జిల్లాలలో) మాల మాదిగలు తమ హేయమైన కుల అస్థిత్వాన్ని తిరస్కరించి ‘ఆది ఆంధ్ర’ అనే కొత్తకులంగా ఆవిర్భవించడం యీ వుద్యమ విజయంగా భావించవచ్చు.

రామాయణమే నమ్మనివాళ్లు, రావణుడిని ఎందుకు వెనకేసుకొస్తారు?

సిద్దార్థి సుభాష్ చంద్రబోస్

ప్రశ్న-జవాబులు: —

  • “నువ్వు పురాణాలు, దేవుళ్లని నమ్మవు, మరెందుకు నీ వాదనకు మద్దతుగా పురాణాలి ఉటంకిస్తున్నావు?” ఒక సనాతనుడు లేచి, వితంతు వివాహానికి మద్దతుగా పురాణాల్లోని ఉదాహరణాల్ని చూపుతూ ప్రసంగిస్తోన్న కందుకూరి వీరేశలింగం అనే సంస్కర్తని నిలదీశాడట సభలో దానికి సమాధానం అయనిలా చెప్పాడు. “అయ్యా, నాకు గుడ్డితనం లేదు. నీకుంది. నాదారి బాగా కనిపిస్తోంది. నువ్వు తడుముకుంటున్నావు. అందుకే నీకు వెలుగని భావిస్తోన్న నీ పురాణాన్ని ఎత్తి నీకు వెలుగు చూపిస్తున్నాను.
  • ఎందుకంటే చీకట్లో కనపడకపోతే సరైనదారిలో నడుస్తోన్న నన్ను గుద్దేసే ప్రమాదం నాకుంది కాబట్టి”.–రామాయణం ఒక కావ్యం. పురాణాలు, ఇతిహాసాలవలె అదొక వ్యక్తి లేదా వ్యక్తులు రాసిన రచన. అందులోని పాత్రలు, వాళ్ల వ్యక్తిత్వాలూ, సాంఘిక పరిస్తితులు, ఉద్దేశాలూ, భావజాలాలూ పరిశీలన, పరామర్శ, విమర్శ చేస్తూ ఇప్పటికి ఈ దేశంలో లక్షలుగా వచ్చివున్నాయి. అందుల్లో డాక్టరేట్లు చేశారు, పరిశోధనా పత్రాలు సమర్పించారు. ఎందుకంటే ఒక్క రామాయణమే ప్రస్తుతం వేలసంఖ్యల్లో రాశారు. కాబట్టి రామాయణం ఇంట్లో పూజకు పెట్టుకునేవాళ్లు చదువురానివాళ్లు. చదువుకున్నవాళ్లు అందులోని లోటుపాట్లను, పాత్రలని చర్చిస్తారు.—కాదని కొట్టిపారేసేలా ప్రతివాదన చెయ్యడం ఒకరకమైతే, అతని వాదనని అంగీకరిస్తూ అందులోనికి ప్రవేశించి అందులోని డొల్లని ఎత్తిచూపి అతడిని ఒప్పించి మరీ, అతనివాదన తుంచేయడం రెండవది. నిజానికి రెండవది నిలకడైనదీ, ఓపికతో కూడుకున్నది, ఫలితాల్ని సమర్థవంతంగా అందించేది.-
  • -*నువ్వు రామాయణం గురించి మాట్లాడుతున్నావంటే మరోరకంగా రాముడి భావజాలన్ని మోస్తున్నట్లే కాబట్టి ఆ విషయం మాట్లాడరాదు అంటూ అతితెలివి వాదన లేవనెత్తి అది చర్చకు, విమర్శకు రాకుండా దారిమల్లిస్తారు.కులమతాలు పోవాలని రాస్తే నీవింకా కులాన్ని అంటిపెట్టుకున్నావు అని నిందించే మోసకారి వాదనకిది దగ్గరి వాదన. మూఢాచారాలు పోవాలని రాస్తే నీవింకా మూఢాచారాల్లో వున్నావనే బాపతు ఇది.

(ఈ విషయమై మరిన్ని ప్రశ్నల్ని ఆహ్వానిస్తూ)

విస్మృతుడు ప్రొఫెసర్ లక్ష్మీనరుసు

ప్రొఫెసర్ – చల్లపల్లి స్వరూపరాణి-

బౌద్ధాన్ని ఒక్కొక్కరు ఒక్కో విధంగా అర్ధం చేసుకున్నారు. బుద్ధుడిని కేవలం ఒక అహింసావాదిగా, దుఃఖవాదిగా, ధ్యాన మార్గాన్ని బోధించిన ఒకానొక దేవుడిగా భావించేవారే ఎక్కువగా వున్నారు. అయితే బౌద్ధాన్ని అసలు మతం అనాలా వద్దా అనే కీలకమైన చర్చ చేసి బౌద్ధంలోని సామాజిక విప్లవ కోణాన్ని వెలికితీసిన వారిలో పండిత అయోతీదాసు తర్వాత ప్రొఫెసర్ లక్ష్మీనరుసు ముఖ్యుడు.

భారత దేశంలో బౌద్ధం చాలావరకు కనుమరుగైపోయి బుద్ధగయలోని బౌద్ధాలయం హిందూ మహంతుల అధీనంలో ఉన్నప్పుడు శ్రీలంక బౌద్ధ భిక్షువైన అనాగారిక ధర్మపాల మహాబోధి ఆలయాన్ని తిరిగి బౌద్ధులకు అప్పగించాలని ఎంతో శ్రమించాడు. ఆయన శ్రీలంకలో స్థాపించిన మహాబోధి సొసైటీని భారత దేశంలో విస్తరించే క్రమంలో ఆయనకి దక్షిణ భారత దేశంలో అయోతీదాసు, లక్ష్మీనరుసు గొప్పగా సహకరించారు. అయితే ఇక్కడి బ్రాహ్మణవాదులు ఆయన్ని కూడా కబ్జా చేశారు. ఇల్లూ, వాకిలీ, దేశం అన్నీ వొదులుకుని బౌద్ధం కోసం బయలుదేరిన అనాగారిక ధర్మపాలనని ఒక బ్రాహ్మణుడిగా మార్చి మహాబోధి సొసైటీని ఒక ధ్యాన కేంద్రంగా కుదించారు.

బుద్ధుడు ముక్కోటి హిందూ దేవీ దేవతలలో ఒకడని, బౌద్ధం అంటే హిందూమతంలోని ఒకానొక శాఖ అని భావిస్తున్న రోజుల్లో బౌద్ధాన్ని హిందూ చట్రం నుంచి బైటికి తీసుకురావడానికి పండిత అయోతీదాసుతో పాటు లక్ష్మీనరుసు కృషి చెయ్యడమేకాక బౌద్ధాన్ని పీడితుల విముక్తి సిద్ధాంతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళారు. కులనిర్మూలనకు బౌద్ధం మాత్రమే సాధనంగా ఉపకరిస్తుందని చెప్పారు.
బౌద్ధంలోని వివేచనను, శాస్త్రీయతను మతకోణానికి భిన్నంగా బ్రాహ్మణేతర ద్రుక్పధంనుంచి అర్ధం చేసుకోడానికి ప్రొఫెసర్ లక్ష్మీనరుసు పుస్తకం తనకెంతో ఉపయోగపడిందని బాబాసాహెబ్ అంబేడ్కర్ పేర్కొన్నారు. 1907 లో మొదటిసారి ప్రచురించబడిన లక్ష్మీనరుసు పుస్తకం Essence of Buddhism ను అంబేడ్కర్ తన పరిచయ వాక్యాలతో 1948 లో మూడోసారి ప్రచురించారు.

అంబేడ్కర్ ని అంతగా ప్రభావితం చేసిన ప్రొఫెసర్ లక్ష్మీనరుసు తెలుగువాడని చాలామందికి తెలీదు, అందరూ ఆయన్ని తమిళుడనే అనుకున్నారు. ప్రముఖ బౌద్ధ పరిశోధకుడు టి. రవిచంద్ పరిశోధనలో లక్ష్మీ నరుసు తెలుగువాడనే విషయం బైటికొచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో భాషల్లోకి అనువదించబడిన లక్ష్మీ నరుసు పుస్తకం Essence of Buddhism ను 2009 లో వేటపాలెం కి చెందిన మరొక బౌద్ధ పరిశోధకుడు డి. చంద్రశేఖర్ తెలుగులోకి అనువదించారు. నేను ఆపుస్తకానికి ‘సత్యాన్వేషణే బౌద్ధధర్మ సారం’ శీర్షికతో సమీక్ష రాశాను. అంబేడ్కర్ నుంచి అలోషియస్ వరకు కేవలం కొద్దిమంది తప్ప పెద్ద పెద్ద ఉద్దండ పండితులు లక్ష్మీనరుసు కృషిని చాలా సౌకర్యవంతంగా విస్మరించారు. కారణాలు స్పష్టమే! ఆయన బుద్ధుడిని సామాజిక విప్లవకారుడిగా చూపించడం. అంతేకాదు, కులవ్యవస్థ భారత దేశానికి సోకిన ప్రాణాంతక వ్యాధి అని, దానికి బౌద్ధమే అసలైన మందు అని చెప్పడం. ఆక్రమంలో లక్ష్మీ నరుసు తన కాలానికి దేశంలో ఎంతో పేరు ప్రఖ్యాతులు, పలుకుబడి వున్న ఆధునిక హిందూ దేవుళ్ళు రామకృష్ణ పరమ హంస, వివేకానంద, దివ్యజ్ఞాన సమాజం ద్వారా హిందూమతానికి, కులానికి కొమ్ముకాసిన అనీబిసెంటులను నిర్మొహమాటంగా ధిక్కరించాడు. మేడిపండువంటి దేశభక్తిలో వుండే లుకలుకల్ని కడిగిపారేశాడు. ఈదేశంలో కులం భారతీయుల మధ్య ఐక్యతకు,అభివృద్ధికి ఆటంకంగా మారిందని, ఒక హిందువుగా వుండడమంటే ఏదోఒక కులంలో పుట్టడమేకాడు, కులానికి మరమ్మత్తులు చెయ్యడం కూడా అని 1922 లోనే కుండబద్దలు చేసిన లక్ష్మీనరుసు ప్రాతఃస్మరణీయుడు.

అశోక విజ‌య‌ద‌శ‌మి ఎప్పుడు.. ఎలా .. ఎక్క‌డ‌-ప్రొఫెసర్ . చల్లపల్లి స్వరూపరాణి —

మతతత్వ చరిత్రకారులు భారతదేశ చరిత్రలో ప్రాచీన యుగాన్ని ‘హిందూ యుగం’గానూ, మధ్య యుగాన్ని ‘ముస్లిం యుగం’గానూ, ఆధునిక యుగాన్ని ‘బ్రిటీష్ యుగం’గానూ విభజించారు. ఈ విభజనకు ప్రాతిపదిక పాలకుల వ్యక్తిగత మతమే అనుకున్నప్పటికీ ప్రాచీన భారతాన్ని పాలించిన రాజుల్లో అత్యధిక మంది హిందువులు కారు. వారి వ్యక్తిగత, అధికారిక మతం బౌద్ధం. ఐలైనప్పటికీ ఆ విషయాన్ని చరిత్రకారులు చాలా సౌకర్యవంతంగా దాటవేసి కట్టుకధలతో చరిత్ర పుస్తకాలు నింపారు. ఆ కట్టుకధలు, పిట్టకధలే నిజమని అశేష ప్రజానీకాన్ని నమ్మబుచ్చారు. రిపబ్లిక్కులలో రాజులు, వాటినుంచి తర్వాత మొదటి ‘రాజ్యం’ అనే స్థాయి పొందిన మగధను ఏలిన బింబిసారుడు నుంచి అశోకుడు, కనిష్కుడు, హర్షవర్ధనుడు, పదో శతాబ్దం వారైన పాల రాజుల వరకూ అనేకమంది రాజులు బౌద్ధాన్ని అవలంబించి, దాని వ్యాప్తి కొరకు కృషి చేసినవారే. అలాగే పాలితులైన ప్రజలు కూడా హిందువులు కారు, వారు బౌద్ధాన్ని లేదా స్థానిక బ్రాహ్మణేతర మతాచారాలను పాటించారు. అందుకే ప్రఖ్యాత సామాజిక వేత్త అయిన గెయిల్ ఆమ్వేద్ట్ మతతత్వ చరిత్రకారుల హ్రస్వ దృష్టికి భిన్నంగా ప్రాచీన కాలంలో ‘బౌద్ధ నాగరికత’ విలసిల్లిందని పేర్కొన్నారు.

భారతదేశాన్ని ఏలిన గొప్ప చక్రవర్తిగానే కాక బౌద్ధాన్ని విసృతంగా వ్యాప్తి చేసినవాడిగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన అశోకుడు కళింగ యుద్ధంలో జరిగిన హింసతో పరితాపం చెంది యుద్ధం తర్వాత పదవరోజున బౌద్ధ ధర్మాన్ని స్వీకరించిన రోజును బౌద్ధ చరిత్రలో ‘అశోక విజయ దశమి’ గా పేర్కొన్నారు. అశోకుడు చెట్లు నాటించాడు అని చెప్పే చరిత్రలో ఆయన బౌద్ధాన్ని విస్తరింపచేసిన విధానాన్ని గురించి అంతగా రాయరు, ఆయన మతమార్పిడి ఎదో ‘మారుమనసు’మాదిరి చెప్పుకొస్తారు. అశోకుడు వ్యక్తిగతంగా బౌద్ధాన్ని అవలంబించడంతో పాటు తన రాజ్యాన్ని ‘బౌద్ధ రాజ్యం’గా ప్రకటించాడు. కేవలం యుద్దం చెయ్యడం అనేది వదిలెయ్యడమే కాక అహింసను అన్ని కోణాల్లో ఆచరించాడు. వైదిక కర్మకాండలలో జరిగే జంతుబలితో పాటు రాజుగారి వంటింట్లో కూడా జంతువులను చంపడాన్ని నిషేధించాడు. వైదిక మతం యజ్ఞ యాగాది కర్మ కాండలతో మతాన్ని ఒక సంక్లిష్టమైన వ్యవహారంగా మార్చడాన్ని వ్యతిరేకించి వైదిక పరమైన క్రతువులను నిషేధిస్తూ ఆజ్ఞలు జారీ చేశాడు. తన పరిపాలనలో బౌద్ధ ధర్మ ప్రచారం కోసం ‘ధర్మ మహా మాత్రులు’ అనే అధికారులను నియమించాడు. అశోకుని రాజధాని అయిన పాటలీపుత్రంలో మూడవ బౌద్ధ సంగీతిని నిర్వహించి బౌద్ధ సంఘంలో అప్పటికి చోటు చేసుకున్న క్రమశిక్షణా రాహిత్యాన్ని చక్కదిద్ది, కొత్తగా పుట్టుకొస్తున్న శాఖల మధ్య సమన్వయాన్ని తీసుకురావడానికి కృషి చేశాడు. దేశ దేశాల్లో బౌద్ధాన్ని విస్తరింప చెయ్యడానికి తన కూతురు ‘సంఘమిత్ర’నూ, కొడుకు ‘మహేంద్ర’నూ పంపాడు. అశోకుడు కట్టడాలపరంగా కూడా బౌద్ధాన్ని వ్యాప్తి చేశాడు. తన అధీనంలో ఉన్న భూభాగమంతా బౌద్ధ స్తూపాలనూ, చైత్యాలనూ, విహారాలనూ నిర్మించాడు.

ఈ కార్యక్రమాలన్నీ ఒక ఎత్తయితే అశోకుడు వైదిక కర్మలను నిషేధించడం వల్ల ఆయన బౌద్దాభిమానిగా కంటే బ్రాహ్మణ ద్వేషిగా గుర్తింపు పొందాడు. అశోకుడు బ్రాహ్మణ పూజారులకు ప్రాధాన్యత ఉండే యజ్ఞ యాగాది క్రతువులను నిషేధించడంతో పూజారి వర్గం జీవనోపాధి కోల్పోవడమే కాక అసంతృప్తితో వారు అశోకునికి శత్రువులుగా మారి కుట్రలు చేశారు. వారు మౌర్య సామ్రాజ్య పతనం దిశగా పనిచేశారు. అశోకుని మనుమడైన బృహద్రదుని సైన్యాధ్యక్షుడు, బ్రాహ్మణుడైన ‘పుష్యమిత్ర శుంగుడు’ రాజుని ఖూనీ చేసి రాత్రికి రాత్రి సింహాసనాన్ని చేజిక్కించుకుని శుంగ రాజ్యాన్ని స్థాపించాడు. అతడు రాజ్యానికి రావడంతోనే బౌద్ధపరంగా ద్వేషపూరిత వైఖరిని అవలంబించి తన రాజ్యంలో బ్రాహ్మణాదిక్యతను తిరిగి ప్రతిష్టించాడు. వైదిక క్రతువులను పునరుద్దరించి బౌద్ధ భిక్షువులను చంపి వారి విహారాలను ధ్వంసం చేశాడు. అంతేకాదు పుష్యమిత్రుడు అప్పటివరకు ప్రజల్లో అధికారికంగా చెలామణి అయిన బౌద్ధం స్థానంలో వైదిక మతాన్ని పెంపొందించడానికి అధికారికంగా ఒక శిక్షాస్మృతి ఉండాలని ‘సుమతీ భార్గవ’ అనే బ్రాహ్మణ పండితుని చేత ‘మనుస్మృతి’ ని క్రోడీకరింపజేశాడు. ‘మనుస్మృతి’ ఒక సాధారణ మత గ్రంధంగా కంటే అధికారిక పత్రంగా, తమదైన ‘రాజ్యాంగం’ గా చాలాకాలం పాటు భారత దేశంలో చెలామణి అయ్యింది. అసమానతలకు ప్రాతిపదిక అయిన వైదిక హిందూ మతం ఆ సామాజిక చట్రాన్ని మనుస్మృతి ద్వారా స్తిరీకరింపజేసిందని దాని ప్రకారమే సమాజం చాలాకాలం నడిచి సూద్ర, అతిసూద్ర కులాలనూ, స్త్రీలనూ కట్టడి చేశారని అంబేద్కర్ ‘ప్రాచీన భారతదేశం లో విప్లవం-ప్రతీఘాత విప్లవం’ అనే వ్యాసంలో వివరించాడు. ఈ రకమైన విశ్లేషణ మనకి చరిత్ర పుస్తకాల్లో కనిపించదు. జాతీయవాద చరిత్రకారులు కూడా అశోకుడు గొప్ప రాజు అంటారుగానీ ఆయనలోని బౌద్ధభిమాన కోణాన్ని వొదిలేస్తారు. అశోకుడు వేసిన శాసనాల ద్వారానే కాక, బౌద్ధ సాహిత్యం ద్వారా కూడా ఆయన బౌద్దాభిమానం వ్యక్తమయింది. బౌద్ధ సాహిత్యం ఆయన్ని ‘దేవానాం ప్రియ, ప్రియదర్సి రాజా’ అని పేర్కొంటుంది. ఆయన పరిపాలనా దక్షత, ప్రజోపయోగ కార్యక్రమాలు, బౌద్దాభిమానం రీత్యా ప్రఖ్యాత బ్రిటీష్ చరిత్రకారుడైన H.G.Wells పదివేలమంది రాజుల్లో అశోకుడు ఒక్కడే ఒక ద్రువతారలా వెలుగొందే చక్రవర్తి అనే పేర్కొన్నాడు.

అశోకుడు బౌద్ధానికి అందించిన తోడ్పాటు పట్ల, ఆయన అసమానతకు ప్రాతిపదికగా ఉండే వైదిక మతాన్ని వ్యతిరేకించడం పట్ల ఆకర్షితుడైన అంబేద్కర్ అశోకుడు బౌద్ధ ధర్మాన్ని స్వీకరించిన విజయ దశమి రోజున 1956లో బౌద్ధంలోకి మారాడు. ఆయన చారిత్రిక పరిణామాల పరంగా భారతదేశ చరిత్రను బౌద్ధానికి వైదిక హిందూ మతానికి మధ్య జరిగిన ఘర్షణ గా అభివర్ణిస్తూ సమతనూ, సామాజిక విప్లవాన్ని ప్రతిపాదించిన బౌద్ధాన్ని అంతమొందించి, అసమానత్వాన్ని తిరిగి మునుస్మ్రుతి ద్వారా ప్రతిష్టించి బ్రాహ్మణవాదులు ప్రతీఘాత విప్లవానికి తెరలేపారని అంబేద్కర్ పేర్కొన్నాడు. ఇక్కడ బౌద్ధంలోని సమత, కరుణ, ప్రజ్ఞ అనే భావనల ద్వారానే సామాజిక రుగ్మతలైన కుల వివక్ష, లింగ వివక్ష సమసిపోయి సామాజిక ప్రజాస్వామ్యం వస్తుందని, ఈ దేశాన్ని తిరిగి బౌద్ధ దేశంగా మార్చడం తన జీవితాశయాలలో ఒకటని పేర్కొన్నాడు. అశోక ధర్మ చక్రాన్ని, నాలుగు సింహాల అశోక స్తంభాన్ని ఈ దేశపు చిహ్నాలుగా చేర్చడంలో ఆయన ఉద్దేశం అదే.

చరిత్రను విస్మరించినవాడు చరిత్ర హీనుడౌతాడు అని బాబాసాహెబ్ అంబేద్కర్ అంటారు. చరిత్రలో కట్టు కధలు, పిట్ట కధలకు కాలం చెల్లింది. భారతీయత అనేది హైందవంలో ఉందని చెప్పే కుహనా జాతీయవాదుల ‘దేశభక్తి’ వారి వారి సొంత కుల, మత భక్తి, ‘దేహభక్తి’ తప్ప మరేదీ కాదని ప్రాచీన భారతదేశ చరిత్ర రుజువు చేస్తుంది.

‘ప్రజా గొంతుక ‘ కలేకూరి ప్రసాద్ – తంగిరాల సోని

(అక్టోబర్ 25 – 2020 మహా కవి , రచయిత , అనువాదకులు , వక్త , ఉద్యమ కారులు ‘ కలేకూరి ప్రసాద్ ‘ 58 వ జయంతి
1968లో కంచికచర్ల కోటేశు ఘటన జరిగనప్పుడు నాలుగు సంవత్సరాలు కలేకూరి ప్రసాద్ కు. ఆ ఘటన అలజడి లో నుంచే కలేకూరి ప్రసాద్ ఒక పేను ఉప్పెనలా మారాడు అంటారు స్థానికులు.నిత్యం రగిలే మంట .కారంచేడు , చుండూరు ,పదిరికుప్పం , నీరుకోండ‌‌, గోకరాజు పల్లి ,బత్తినపాడు ,లక్షీంపేట ఘటనకు స్పందిచి అనేక పాటలు , కవితలు రూపొందించి , స్వయంగా ఉద్యమంలో మమేకమైవాడు.కారంచేడు ఒగ్గు కథ కలేకూరి నుంచి జాలువారినదే.

1985 లో ప్రకాశం జిల్లా ‘టంగుటూరు’లో ఇందిర హత్యనుంచి వచ్చిన పాట ‘ కర్మభూమిలో పూసిన ఓ పువ్వా విరిసి విరియని ఓ చిరునవ్వా ‘ పాట అప్పుడు రసిందే . దానిని తర్వాత శ్రీరాములయ్య సినిమాలో ఉపయోగించుకున్నారు. అదే సినిమాలో ‘ భూమికి పచ్చాని రంగేసినట్టో అమ్మలాలో ‘ పాట కూడా. జయం మనదేరా లో చిన్నిచిన్ని ఆశలన్నీ పాట , బహుజన ఉద్యమాలకు అనేక పాటలు రాసి ఉద్యమాలను ఉదృతంచేసారు.’కుమిలిపోయిన నలిగిపోయిన చుండూరు గుండెల గాయం ‘పాట చుండూరు ఉద్యమానికి వెన్ను థనై నిలిచింది.

దళిత మ్యానిఫెస్టో లాంటి కవిత . ‘పిడికెడు ఆత్మగౌరవం ‘కోసం రాసాడు.దళిత సాహిత్యం , దళిత కిరణాలు,దళిత ఉద్యమం – దళిత సాహిత్యోద్యమం ,ఆంధ్రప్రదేశ్ ళితులు లాంటి పుస్తకాలు కలేకూరి ప్రసాద్ రాసారు. అనేక అనువాదాలు చేసారు . మహాశ్వేతాదేవి ‘ రుదాలి’ , ఛోళీకే పీచే,’పాలతల్లి. అరుంధతీ రాయ్ ‘ ఊహలు సైతం అంతమయ్యే వేళ’, స్వామిధర్మతీర్థ ‘ హిందూ సామ్రాజ్య వాద చరిత్ర’. ప్రిము లెవి ‘ ఖైదీ నెం 174517’, బషీర్ కథలు ,కీశోరు శాంతబాయి కాళే ఆత్మకథ ‘ఎదురిత’చేగువేరా రచన , ఏ.జి.నూరాని ‘ ఇస్లాం – జిహాద్’.బోపాల్ డాక్యుమెంట్ ,గెయిల్ అంవతే ‘ మహాత్మా జ్యోతిరావు ఫూలే’లాంటి అనేక పుస్తకాలు అనువాదం చేసారు. పాబ్లో నెరుడా , నామ్ దేవో ధసాల్, డేవిడ్ దియోప్, శరణ్ కుమార్ లింబాలే,దయాపవర్ ,ఎల్.ఎస్.రోకాడే,ఖలీల్ జిబ్రాన్ , గూగివా ధియాంగో జాతీయ ,అంతర్జాతీయ కవులు దాక అందరిని తెలుగు సాహిత్యం లోకానికి కవిత్వం ద్వారా పరిచయం చేసారు . అసలు కన్నా అనువాద మే బాగుంది అనేవారు ఉన్నారు.
అనేక అంతర్జాతీయ అంశాలపై వివిధ పత్రికలలో వ్యాసాలు , రాసారు.ఉద్యమం సంబంధించిన దాదాపు నాలుగు వందల పాటలు రాసాడు అంటారు మిత్రులు. కలేకూరి ప్రసాద్ సాహిత్యం కోసం తన పేర్లుశబరి , సంఘమిత్ర , యువక , కోటేశు ,కవన పేర్లతో రాసాడు.
ఇటూ , కవిత్వం , అనువాదం , పాటలు , గొప్ప వక్త , ఉద్యమాన్ని స్వయంగా నిర్మించడం కలేకూరి ప్రసాద్ లో అనేక కోణాలు ఉన్నాయి.

Photo Courtesy: Telugubooks.in

1994 లో బహుజన సమాజ్ పార్టీ నుంచి నందిగామ నియోజకవర్గ నుంచి ఎమ్మెల్యే గా పోటీ చేసారు.ఆంధ్రభూమి లో సబ్ ఎడిటర్ గా కొంత కాలం చేసారు. కంచికచర్ల ప్రాంతంలో అనేక ఉద్యమంలో క్రీయశీలక పాత్ర వహించాడు.ఏదైనా కలేకూరి ప్రసాద్ జీవితం మొత్తం ఉద్యమం – సాహిత్యం కొరకే జీవించాడు. తెలుగు రాష్ట్రం మొత్తం కలేకూరి అభిమానులు ఉన్నారు. కలేకూరి ప్రసాద్ పాట కర్మభూమిలో పూసిన పాట ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం పాఠ్యంశంగా చేర్చారు.ఎవరిని తక్కువగా చులకనగా చూడకపోవడం కలేకూరి ప్రసాద్ వ్యక్తిత్వం . డబ్బులపై మోజు లేనోడు, పూరిగూడిశో , మిద్దెల్లో ఒకేలా బతికాడు ఎప్పుడు జనంలోనే బతికాడు.జనంకోసమే బతికాడు .
నిరంతరం దళిత సమాజం మార్పుకోసం , రాజ్యాధికారం కోసమే రచనలు చేసాడు.ఉవ్వెత్తున ఎగిసిపడే అలల కెరటంలాగా తన మాట దారాళంగా ఉంటుంది.అతను మాట్లాడుతుంటే సభలో అలజడులు పుట్టాల్సిందే.కలేకూరి ప్రసాద్ 50 వ పుట్టినరోజు ఒంగోలు లో ఘనంగా జరిగింది. అప్పటికే కలేకూరి ప్రసాద్ ఆరోగ్యం సరిగ్గా లేదు. జీవితం లో ఎబై సంవత్సరాల బతుకులో దాదాపుగా 35 సంవత్సరాలు ఉద్యమం కోసమే పనిచేసాడు.అనేక అవమానాలు , అనేక అటుపోట్లు , ఎదుర్కొని దళిత ఉద్యమంకోసం నిరంతరం పెనుగులాట లాడిన ఊపిరి 2013 మే 17 న ఆగిపోయింది. తెలుగు ఉద్యమ లోకం , సాహిత్య లోకం మొత్తం కన్నీరై ఆత్మీయ గుర్తులను గుర్తుచేసుకుంటున్నారు .తెలుగు రాష్ట్రాల్లో అనేక ప్రాంతాల్లో, మరియు యూనివర్సిటీ లో కలేకూరి ప్రసాద్ వర్థంతులు , జయంతులు జరుగుతున్నారు.కవులు మరణించరు ఎప్పుడూ ప్రజల్లో పుడుతునే వుంటారు అనటానికి సాక్ష్యం కలేకూరి ప్రసాద్ జీవితం మాత్రమే.

తంగిరాల సోని -96 766 09 234

కులానికో కుంప‌టి-వంట‌కి ప‌నికొచ్చేనా?

  • అన్నవరపు బ్రహ్మయ్య, జర్నలిస్ట్
    సామాజిక అంశాల విశ్లేషకులు.

వివిధ బిసి కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు ద్వారా బిసి కులాలను ఉద్దరించినట్టుగా ప్రచారం చేసుకోవడం చూస్తుంటే భార్యకు భోజనం పెట్టి ప్రజాసేవ చేస్తున్నట్టు ప్రచారం చేసుకొన్నట్టుగా అనిపిస్తోంది. ఒక రకంగా చెప్పాలంటే ఈ కార్పొరేషన్లు కూడా కుల సంఘాల వంటివే. ఎందుకంటే బిసి కులాల కార్పొరేషన్లకు ఆయా కులానికి చెందిన వ్యక్తిని మాత్రమే ఛైర్మన్ గా నియమించాల్సి వుంది. అందువల్ల ఆయా కులాలవారికి ప్రత్యేకంగా లభించే గుర్తింపుగాని, సదాకాని వుండదు. సహాజంగా ఆర్ధికశాఖ నిబంధనల ప్రకారం ఏర్పాటు చేసిన కార్పొరేషన్లకు ఆర్ధిక స్వాతంత్ర్యత వుంటుంది. రాష్ట్ర ప్రభుత్వం నేరుగా ఆయా కార్పొరేషన్లకు బడ్జెట్ నుంచి నిధులు కేటాయిస్తుంది. ఆ నిధులను ఆయా కార్పొరేషన్లు ఆయా కులాల కుటుంబాల అభివృద్ధికి వినియోగిస్తున్నారు. కాని ప్రస్తుతం ఎంతో గొప్పగా చెబుతున్న బిసి కుల సంఘాల కార్పొరేషన్ అర్ధిక పరంగా ఎటువంటి అధికారం లేని సంక్షేమ అభివృద్ధి (వెల్ ఫేర్ డెవలప్ మెంట్) కార్పొరేషన్లు మాత్రమే. అందువల్ల ఈ కార్పొరేషన్లను ఏర్పాటు బిసి కులాలకు ఒరిగేది ఏమీ లేదు.
రాష్ట్రంలో ఎంతో కీలకమైన పారిశ్రామిక మౌళిక సదుపాయాల అభివృద్ధి సంస్థ, ఎపిఎస్ఆర్టీసి, నీటిపారుదల అభివృద్ధి సంస్థ, పర్యాటక అభివృద్ధి సంస్థ, టిటిడి తిరుమల తిరుపతి దేవస్థానం) బోర్డు, తిరుపతి, విశాఖ, మచిలీపట్నం పట్టణాభివృద్ధి సంస్థలు, ఎపి నైపుణ్య కమిటీ, ఉన్నత విద్యామండలి కమిటీ వంటి దాదాపు 80 ప్రతిష్టాత్మక సంస్థలు వున్నాయి. ఇవి కాకుండా మరో 30 ప్రభుత్వ సలహాదారుల పోస్టులు వున్నాయి.కేబినెట్ హోదా కలిగిన అటువంటి సంస్థలకు ఛైర్మన్లలో కనీసం 20 శాతం పోస్టులలో కూడా బిసీలను నియమించలేదు. ప్రాధాన్యత కలిగిన సంస్థల ఛైర్మన్లుగా ఉన్నతవర్గాల వారిని నియమించి ఎటువంటి ప్రాధాన్యత లేని కులసంఘాల కార్పొరేషన్లకు ఆయా కులాలవారిని ఛైర్మన్లుగా నియమించి బిసీలను ఉద్దరించినట్టుగా ప్రచారం చేస్తున్నారు. ఇదే సమయంలో రాష్ట్రంలో అగ్రకులాలుగా వున్నబ్రాహ్మణ, కాపు కులాలవారికి ఏర్పాటు చేసిన బ్రాహ్మణ కార్పొరేషన్, కాపు కార్పొరేషన్లు మాత్రం ఆర్ధికశాఖ నిబంధనల ప్రకారం ఏర్పాటు చేశారు. అందువల్ల ఆయా కార్పొరేషన్లకు ఆర్ధిక స్వాతంత్ర్యం వుంది. ఆయా కార్పొరేషన్లు నేరుగా బ్రాహ్మణులకు, కాపులకు ఆర్ధిక సాయం అందిస్తాయి. అంతేకాకుండా బ్రాహ్మణ, కాపు కార్పొరేషన్ ఛైర్మన్లకు కేబినెట్ హోదా కలిగివున్నారు, బిసి కుల సంఘాల ఛైర్మన్లకు కనీసం వాహనం ఇస్తారన్న నమ్మకం కూడా కనిపించడం లేదు. లక్ష్యం నీరుకారిపోతోంది:


బిసి కార్పొరేషన్ అనేది ఒక ప్రత్యేక లక్ష్యంతో ఏర్పడింది. బిసిలలో ప్రధానంగా చేతివృత్తి కులాలు, సేవాకులాలు, సంచార, అర్ధసంచార కులాలు అత్యంత వెనుకబడిన కులాలు వున్నాయి. వీరు ప్రభుత్వ పథకాలు వినియోగించుకోవడంలో కాని ఇతర అభివృద్ధి అంశాలలో ఇతర కులాలతో, కార్పొరేట్ సంస్థలతో పోటీ పడలేరనే, చేతివృత్తి కులాలవారు మోడ్రన్ టెక్నాలజీ అందిపుచుకొనే విధంగా వారి అభివృద్ధికి ప్రత్యేకంగా కృషిచేయాలనే లక్ష్యంతో బిసి కార్పొరేషన్ ఏర్పడింది. క్రమంగా బిసి కార్పొరేషన్ లక్ష్యం నీరుకారిపోతోంది. గతంలో బీసీ కులాల అభివృద్ధి నిమిత్తం ఏర్పడిన బిసి కార్పొరేషన్ కు బడ్జెట్ నుంచి నేరుగా నిధులు కేటాయించేవారు. బిసీ జాబితాలో వున్న కులాలన్నీ ఈ బిసి కార్పొరేషన్ ద్వారా స్వయం ఉపాధి పథకాలకు, చేతివృత్తులు అభివృద్ధికి అవసరమైన రుణాలను పొందేవారు.
రాష్ట్ర విభజన అనంతరం నూతనంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ లో కూడా బిసి కార్పొరేషను బడ్జెట్ ద్వారానే నిధులు కేటాయించారు. అయితే దురదృష్టం కొద్ది నాటి తెలుగుదేశం ప్రభుత్వం బిసి కార్పొరేషన్ నిధులను కాపు కార్పొరేషన్‌కు తరలించి బిసిలకు తీవ్ర అన్యాయం చేసింది. ప్రస్తుత వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసి బిసి కార్పొరేషన్ నిర్వీర్యం చేస్తూ ఎటువంటి అధికారాలు లేని కులాల పేరుతో సంక్షేమ అభివృద్ది కార్పొరేషన్లను ముందుకు తీసుకు వచ్చింది. నేడు బిసి కులసంఘాలు రాజకీయ వేదికలుగా మారిపోతున్నాయి. అవసరం వున్నా… లేకపోయినా కుల కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇటీవల కాలంలో ప్రస్తుతం సమాజంలో పాలక కులాలుగా, అగ్రకులాలుగా వున్న రెడ్డికులస్తులకు రెడ్డి కార్పొరేషన్ అదేవిధంగా కమ్మ కార్పొరేషన్, వైశ్య కార్పొరేషన్, క్షత్రియ కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలని విజ్ఞాపనులు కూడా వస్తున్నాయి.


అయిఇప్పటికే బ్రాహ్మణ, కార్పొరేషన్లు వున్నాయి. ఈ స్థితిలో రాష్ట్రంలో ఏ కులం జనాభా ఎంతో నిర్ధారించి ఆయా కులాల జనాభాను బట్టి నిధులు, వనరులు, రాజకీయ పదవులు పంపిణీ చేస్తే బాగుంటుంది కదా? ఆ విధంగా చేసే దమ్ము ఈ ప్రభుత్వాలకు ఉందా?
రాష్ట్రంలో ఎన్టీ రామారావు నేతృత్వంలో తెలుగుదేశంపార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బిసి కార్పొరేషన్ ద్వారా గ్రామీణ ప్రాంతాలలో రజక, నాయీబ్రాహ్మణులకు అందవలసిన స్థాయిలో సహాయం అందడం లేదనే భావనతో ఆయా కులాల పేరిట రజక, నాయీ బ్రాహ్మణ ఫెడరేషన్లు ఏర్పాటు చేశారు. ఈ ఫెడరేషన్లకు అవసరమైన నిధులను బిసి కార్పొరేషన్ నుంచి అందించేవారు. ఆ తర్వాత వై.ఎస్.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా వుండగా శాలివాహన(కుమ్మరి), విశ్వబ్రాహ్మణ వంటి మరో ఏడు చేతివృత్తుల వారికి కూడా ప్రత్యేకంగా ఫెడరేషన్లు ఏర్పాటు చేశారు. ఈ ఫెడరేషన్లకు చెందిన చేతివృత్తిదారులు క్షేత్రస్థాయిలో కో ఆపరేటివ్ సొసైటీలు ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఫెడరేషన్ల నుంచి కూడా సహాయం పొందేవారు. గుడ్డికంటే మెల్లమేలు అన్నచందంగా ఆదరణ వంటి పథకాల ద్వారా కులసంఘాలవారికి ఆర్ధిక సహాయం లభించేవి. ప్రస్తుతం ఫెడరేషన్లు రద్దుచేసి, వాటి స్థానంలో కుల సంఘాల కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం వల్ల బిసి కార్పొరేషన్ తో పాటు ఫెడరేషన్లు ఎందుకు పనికిరాకుండా పోవడమే కాకుండా బిసి కులాల అభివృద్ధి అనే లక్ష్యం పూర్తి అటకెక్కిందని చెప్పవచ్చు.

విదేశీ విద్యా పథకం :
విదేశాలకు వెళ్లి ఉన్నత విద్య చదువుకోవాలనుకొనే ప్రతిభావంతులైన వెనుకబడిన తరగతుల విద్యార్థులకు 2014 వరకు విదేశీ విద్యా పథకం అమలు చేసేవారు. టోఫెల్, జిఆర్మ్ వంటి పరీక్షలలో ఉత్తమ ర్యాంక్ సాధించి, ఆర్ధిక పరమైన కారణాల వల్ల విదేశాలకు వెళ్లలేని విద్యార్థులకు 15 లక్షల రూపాయల ఆర్ధిక సహాయం అందించేవారు. ఈ సహాయం వల్ల విదేశాలలో చదువు, అపై ఉద్యోగులు పొందడం వల్ల బిసి విద్యార్ధుల, కుటుంబాలలో వెలుగులు నిండేవి. కాని ప్రస్తుతం బిసి కార్పొరేషన్ నిర్వీర్యం కావడంతో ఈ విద్యా పథకమే కాదు స్వయం ఉపాధి పథకాలు, కులవృత్తుల అభివృద్ధికి ఇచ్చే రుణాలు వంటి అభివృద్ధి కార్యక్రమాలన్ని పూర్తి నిలిచిపోయాయి.
నిజానికి ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏలూరులో నిర్వహించిన బిసి సదస్సులో బిసిల అభివృద్ధికి ప్రత్యేకంగా బడ్జెట్ లో ఏడాది 15వేల కోట్ల రూపాయలు కేటాయిస్తామని ప్రకటించారు. కాని అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఊసే లేకుండా పోయింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కులాల పేదలకు ఇచ్చే వివిధ పింఛన్లు, ఆరోగ్యశ్రీ, రైతు భరోసా, అమ్మఒడి, గోరుముద్ద, విద్యాదీవెన, చేదోడు వంటి పథకాలకు ఖర్చు చేసిన నిధులను పరిగణలోకి తీసుకొని బిసి కులాల అభివృద్ధికి 33వేల కోట్లు ఖర్చుచేసినట్టుగా ఇటీవల పత్రికలకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. బిసిల ఐక్యతకు విఘాతం:
గత ప్రభుత్వం ఎస్ సి కులాలను విభజన చేసినట్టుగానే ప్రస్తుత ప్రభుత్వం బిసిలకు సంబంధించి కులానికో కార్పొరేషన్ ఏర్పాటు చేయడంవల్ల బిసిలలో ఐక్కతకు విఘాతం కలిగిస్తోందనిపిస్తోంది. అసలే బిసి కులాలలో ఐక్యత తక్కువ. నిచ్చెన మెట్ల హిందూ సమాజంలో బిసి కులాల మధ్య పెద్ద కులం, చిన్న కులం అనే అంతరాలు వున్నాయి. పేరుకి బిసిలని వ్యవహరిస్తున్నప్పటికీ ప్రస్తుతం బిసి జాబితాలో 136 కులాలు వున్నాయి. ఇందులో సంచార జాతులు, అర్ధ సంచార జాతులు, సేవా కులాలు, చేతివృత్తి కులాలు, ఉత్పత్తి కులాలు అంటూ అనేక తేడాలు వున్నాయి. ఈ స్థితిలో బిసిలకు సంబంధించి 56 కుల కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం ద్వారా కార్పొరేషన్ ఛైర్మన్లు ఎవరికి వారే వ్యక్తిగతమైన అజెండాలతో వేరు వేరుగా వ్యవహరించే ప్రమాదం వుంది. కులానికో కార్పొరేషన్ ఏర్పాటు చేయడమే కాకుండా బలమైన కొన్ని బిసి కులాలను ఉపకులాల పేరుతో ఒకే కులాన్ని మూడు నాలుగు కులాలుగా విభజించారు. ఉదాహరణకి గౌడ సామాజికవర్గంలో ఆయా
ప్రాంతాలను బట్టి గౌళ్ళ, శెట్టిబలిజ, శ్రీశైన, యాత, ఈడిగ ఉపకులాలు వున్నాయి. అయిదు ఉపకులాలు వున్నప్పటికీ గౌడ సామాజికవర్గంగా వ్యహారిస్తూన్నారు, పెళ్లిళ్ల విషయంలో కూడా ఈ అయిదు కులాలు ఇచ్చిపుచ్చుకొంటాయిఇ. కాని ప్రస్తుతం ఈ అయిదు కులాలుగా చీల్చి వేరు వేరు కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. అదేవిధంగా చేపలు పట్టే వృత్తి కలిగిన అగ్నికుల క్షత్రియులలో పల్లెకారులు, వడ్డీల పేరుతో ఉపకులాలు వున్నాయి. అగ్నికుల క్షత్రియ కులాన్ని కూడా ఉపకులాల పేరుతో విభజించి వేరు వేరు కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. ఈ స్థితిలో బిసిల ఐక్యత ప్రశ్నార్ధకంగా మారే ప్రమాదం వుంది

ద‌స‌రాకు ఆర్టీసీ బ‌స్సులు ఎందుకు లేవు?

Why No RTC Buses In Dasara Season between Hyderbad and Andhra Pradesh

కూచిపూడి నాట్య మ‌యూరి శోభానాయుడు- కె.వి.రామకృష్ణ

అకుంఠిత దీక్షతో అద్భుతమైన నాట్య విద్యను అభ్యసించి, ఆ నాట్యకళకు అంకితమైన నాట్య కళా తపస్విని శ్రీమతి శోభానాయుడు.  అప్రతిహతంగా అఖండమైన విజయాలను సాధిస్తూనే నిరాడంబరంగా, స్నేహశీలిగా, అరుదైన వ్యక్తిత్వాన్ని తన సొంతం చేసుకున్నారు శోభానాయుడు. ఇటీవల అనారోగ్య  సమస్యలతో బాధపడుతూన్న శోభా నాయుడు హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ  అశేష అభిమానులను దుఃఖ సాగరంలో ముంచి అనంతలోకాలకు తరలివెళ్లారు. ఆమె నిష్క్రమణతో   కూచిపూడి నాట్య రంగం ఒక అద్భుతమైన నాట్య కళాకారిణిని  కోల్పోయిందని నిస్సందేహంగా చెప్పవచ్చు.

1956లో అనకాపల్లిలో  వెంకట నాయుడు, సరోజినీ దేవి దంపతులకు జన్మించారు ఆమె. వెంపటి చిన సత్యం వద్ద శిష్యరికం చేసిన శోభానాయుడు చిన్ననాటి నుంచే నృత్య ప్రదర్శనలు ఇచ్చారు.  తన ప్రతిభతో  నాట్య ప్రదర్శనల్లో  ఎన్నో ప్రతిష్టాత్మక  పురస్కారాలను సొంతం  చేసుకున్నారు.  నృత్యరూపాలలో ఈమె అన్ని ప్రధాన పాత్రలనూ పోషించి అభిమానులను మెప్పించారు. సత్యభామ, పద్మావతి పాత్రల్లో ఆమె అనితరసాధ్యంగా రాణించారు. పద్మావతిగా ఆమె వేదికపైకి వచ్చారంటే సాక్షాత్తూ ఆ అమ్మవారే మన ముందు ప్రత్యక్షమయ్యారా? అన్నంతలా ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేస్తారామె.
హైదరాబాదులో కూచిపూడి ఆర్ట్ అకాడమీ ప్రిన్సిపాల్‌గా వ్యవహరిస్తూ ఎంతోమంది పిల్లలకు నాట్యంలో ఆమె శిక్షణ ఇచ్చారు. కూచిపూడి నృత్యంలో అంకితభావం ఉన్న నాట్య గురువు,  ప్రతిభాశాలి శోభానాయుడు. గత  40 ఏళ్లుగా కూచిపూడి నాట్యంలో శిక్షణ తరగతులు నిర్వహిస్తున్న ఆమెకు ఎంతోమంది శిష్యులు ఉన్నారు. 2001లో పద్మశ్రీ పురస్కారం అందుకున్న శోభానాయుడు దేశ విదేశాల్లో వేలమంది విద్యార్థులను కూచిపూడి నాట్య తారలుగా తీర్చిదిద్దిన ఘనతను సొంతం చేసుకున్నారు.
ప్రపంచ వ్యాప్తంగా వేలాది ప్రదర్శనలు ఇచ్చిన ఆమెకు  సినిమాల్లో అరుదైన పాత్రలు ఎన్నో  వెత్తుకుంటూ వచ్చినా వాటన్నిటిని సున్నితంగా తిరస్కరించి తన జీవితాన్ని నాట్యానికే అంకితం చేసిన మహోన్నతమైన కళాకారిణి ఆమె. కూచిపూడి నాట్యం అంటే శోభానాయుడు,  శోభానాయుడు అంటే కూచిపూడి నాట్యం అన్నంతలా ఆమె అభిమానుల హృదయాల్లో చిరస్మరణీయమైన స్థానం సొంతం చేసుకున్నారు.  
కూచిపూడి నాట్యం కోసమే జన్మించిన  కళాకారిణి ఆమె.  తాను దైవంగా భావించే వృత్తిలో చివరి అంకం వరకూ అంకితమవ్వాలనే కోరుకున్నారు.  నాట్య  ప్రపంచంలో ఎన్నో తరాలకు స్ఫూర్తిదాతగా నిలిచారు ఆమె. నాట్య రంగంలో ఉన్నత శిఖరాలను అధిరోహించినా ఏమాత్రం గర్వం దరిచేరనివ్వని గొప్ప వ్యక్తిత్వం ఆమె సొంతం. భౌతికంగా ఆమె మనమధ్య లేకపోయినా అభిమానుల హృదయాల్లో  ఆమె శాశ్వతంగా నిలిచే ఉంటారు.

సంఘం శరణం గచ్చామి

వినియోగదారుల విజ్ఞానం కోసం రూపొందించిబడిన లఘునాటిక