భ‌క్తి విక‌టిస్తే చ‌స్తార్రోయ్‌..

3878

– ఇండస్ మార్టిన్

2019 అగస్ట్ 30, గుర్తే వుంటుంది మీకు. అమలాపురంలో పెనుమత్సం రామక్రిష్ణం రాజు భార్యా కొడుకులతో పాటు పాయిజన్ ఇంజెక్షన్లు తీసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. పరిశోధనలలో తేలింది ఏమంటే ఆయన రైస్ పుల్లింగ్ రాగి పాత్ర కోసం మాఫియాతో బేరసారాలు సాగించి కోటి రూపాయలు మోసపోయాడు. ఇవాళ్ళ మదనపల్లి పురుషోత్తం నాయుడూ, ఆయన భార్య పద్మజ కలిసి ఎదిగిన ఇద్దరు కూతుళ్ళను పాశవికంగా హత్య చేశారు. కారణం తాంత్రిక భక్తి, జిగ్గీ శిష్యరికం . రెండు కుటుంబాలూ విధ్యాధికులే. సమాజం దృష్టిలో మేధోవర్గానికి చెందినవాళ్ళు. ఒక కుటుంబం ప్రాణం పోసే వృత్తిలో, మరో కుటుంబం జ్ఞానంపోసే వృత్తిలో… బహుశా వీళ్ళు బతికి వున్నప్పుడు ఎందరో వీరిని మార్గదర్శకులు అనుకుని ఉంటారు. వాళ్ళ సలహా మేరకు ఎందరో తమ జీవితాల్లో సర్దుబాట్లూ మర్పులూ చేసుకునే ఉంటారు. వీళ్ళ జీవన విధానం ఎంతో కొంత మందికి ఆదర్శం అయ్యే వుంటుంది.

కానీ వీళ్ళు మాత్రం మూఢవిశ్వాసాలకూ, బాబాలకూ, సద్గురువులకూ బానిసలు. ఐనప్పటికీ వీళ్ళ జీవితాల్లో ఉన్నతవిధ్య, ఐశ్వర్యం, గౌరవం అనేవి ఎలా సాధ్యం అయ్యాయీ? ఈ దేశంలో చదువులూ, పదవులూ అనేవి జ్ఞానంతో ముడిపడని విషయాలు అని ఋజువు అవుతుంది కదా! మనచుట్టూ రోజూ జ్ఞాన వితరణ చేసే అనేకమందిని జ్ఞాపకం చేసుకుందాం. రోజూ . వీళ్ళల్లో డాక్టర్లూ, లాయర్లూ, సైకాలజిస్టులూ, మరీ ముఖ్యంగా చేతులూ కాళ్ళూ రికెట్స్ వచ్చి మెలితిరిగిన రచైతలూ కూడా ఉంటారు. వాళ్ళ మాటలకు ఇంతేసి విలువ ఎలా వస్తుందీ? ఒక్కొక్కరి నోటిముత్యాలకోసం దోసిళ్ళు పట్టి ఎదురు చూసే స్నేహితులు మనకు కనబడతారు. ఎలా సాధ్యం అయ్యింది వాళ్ళకు ఇదంతా? జవాబు పైన ఉదహరించిన రెండు కుటుంబాల కథల్లో ఉంది. చేసే వృత్తినిబట్టీ, అందునా కొన్ని వృత్తులకు అప్పనంగా అంటకట్టుకున్న అపార గౌరవాన్నిబట్టీ ఇదంతా సాధ్యం అవుతుంది.

కానీ సత్యం మరోలా ఉంది. మనకు రోజూ దోసిళ్ళకొద్దీ ఉచిత జ్ఞానామృత దానం చేసే వీళ్లల్లో ఎందరో, లేదా అందరూ ( ఎవ్వరమూ అతీతులం కాదు) పచ్చి నేలబారు జీవులు అయివుండవచ్చు. వీళ్ళను ఒకసారి గమనించండి. అందరూ ఏదో ఒక పెద్ద ఉద్యోగమో, భద్రజీవితమో, పెద్ద పేరుగలిగిన కుటుంబ నేపధ్యమో, అంతకన్నా పెద్ద ఇంటిపేరో (దదనుగుణమైన కులమో) కలిగి ఉంటారు. నాలుగు కవిత్వ సంకలనాలు వేసి సంకలు కొట్టుకునే ప్రతీ ఒక్కరూ ఇక్కడ పెద్దముతైదువలు. నాలుగు సంకలనాలు ప్రచురిస్తే చాలు…. శబరిమలై గురుస్వాములే.. ఇరుముడులు వెయ్యనూ, విప్పనూ …. అన్నీ వాళ్ళకే సాధ్యం. ఒకళ్ళు ప్రొఫెసర్ అంటారు, మరొకరు సామాజికవేత్త, మనోవిజ్ఞాన దుత్త అంటూ ముందుకు వస్తారు. ఏకాఏకీ పంచాయితీలూ, కోర్టులు, తీర్పులూ, శిక్షలూ అమలు చేస్తూ ఉంటారు. నాకు అర్ధం కాక అడుగుతాను…. సామాజిక మాధ్యమాల్లో ఉన్న, వీళ్ళ ఫ్రెండ్ లిస్టుల్లో ఉన్నవాళ్ళ వ్యక్తిగత జీవితాల వరకూ వెళ్ళి తీర్పులూ, శిక్షలూ ప్రకటిస్తారు కదా… అంటే వీళ్ళతో పరిచయం లేని వాళ్ళు వీళ్ళ శిక్షాస్మృతి జూరిస్డిక్షన్ లోకి రారు అనే కదా? ఆ లెక్కన వీళ్ళకు ఎంత దూరంగా ఉంటే అంత క్షేమం అనే కదా మనం అనుకోవాలి!

మన కాలనీలో ఉండే కౌన్సిలర్ అందరికన్నా జ్ఞాని. వాడు శ్రీశైలం వెళ్ళాలంటే మొత్తం కాలనీ అంతటినీ బయలుదేరదీస్తాడు. వాడికి ఎవడో ఒక వెధవ గురువు అవుతాడు. వాడ్ని మిగతా కాలనీ వాసులు అందరికీ గురువును చేస్తాడు. వాడు కౌన్సిలర్ కాబట్టి జ్ఞానవంతుడు. వాడి గురువు మహాజ్ఞాని. ఇదే తంతు వూళ్ళల్లోనూ….. స్కూల్ అసిస్టెంట్ మేష్టారు అందరికీ తలలో నాలుక. వాడి తలలో ఉన్నదంతా అజ్ఞానమే. చేతికి దారాలూ, బండి మీద నామాలూ, వేళ్ళకు రంగురాళ్ళు, పర్సులో మెహెర్ బాబా బొమ్మ. వీడి మాట మీద వూళ్ళో పిల్లల బతుకు నిర్మించబడుతుంది. ఎంత పెద్ద గొంతుంటే అంతపెద్ద స్త్రీ వాది….. సొంత బ్రతుకుల్లో చర్మవర్ణం చూసుకుని మురుసుకునే మనుషులు కూడా లింగవివక్షా వ్యతిరేక పోరటాలకు శ్రీరామరక్ష అయి కూర్చుంటున్నారు. జీవితంలో సగం అభ్యుదయం, మరో సగం పుణ్యక్షేత్ర దర్శనాలతో సాగించే జనాలు సిద్దాంతకర్తలూ, పదవులూ, ప్రాపకాలూ, కులం, మతం చూపించి రాసిన నాలుగు ముక్కల్నే మహాసాహిత్యం అని ప్రచారం చేసుకునే జనాలు విధ్యావేత్తలూ, ప్రభుత్వ కమిటీలలో సభ్యులూ అవుతారు.

ఎవర్నీ నమ్మకండి. మీ ముందు గుండేసుకుని ‘మా దగ్గర రేట్లు మిగతా వారితో సరిపోల్చుకోండి ‘ అని నమ్మబలికే గుండేశ్వర్రావులను కూడా నమ్మకండి. ఒకడి సామాజిక ఎదుగుదలకు వాడి జ్ఞానమే కారణం అనుకోకండి. వాడి ఆధిక్యం నుండీ, వార్తాపత్రికలనుండీ, వికీపీడియా నుండీ వెలువడే జ్ఞానగుళికెలూ, అద్భుత రహశ్యాలూ కేవలం వండర్ వరల్డ్, విజ్డం పత్రికల్లాగా చదివేసి వదిలేయడమే. సమాచారాన్ని కూడా జ్ఞానం అనే బాటిల్స్ లో అమ్మే మాయగాళ్ళూ, గత్తెలూ మనచుట్టూ ఉంటారు. వీరిలో కొందరికి గొప్ప పంచ్ డైలాగ్, పాష్ ఇంగ్లీష్ టేలెంట్ వుండటం మరొక దరిద్రం. పంచ్ డైలాగులనే దైవజ్ఞానం అని నమ్మించే గురువులూ, బోధకులూ, మౌల్వీలూ, జాకీర్ ఖల్నాయక్లూ, జగ్గూ పాసుదేవులూ, కొళవెరి సతీషులూ మనచుట్టూ చేరి మన ధనాన్నీ, స్నేహాలనూ, భావావేశాలనూ, సమయాన్నీ చివరకు మన ప్రాణాలనూ కుక్కలపాలు చేస్తారు.ఒకడ్ని మార్గదర్శకుడు, ఆరాధ్యుడు, గురువు అని అంటూ ఉన్నావంటే నువ్వో వెధవాయి అని అర్ధం. దీన్ని వారించని ఆ మార్గారాధ్యగురువు ఇంకా పెద్ద వెధవాయి అని తప్పకుండా నమ్ము.

– —