డీజీపీ పై యనమల ఫైర్

2146

ప్రధానికి చంద్రబాబు లేఖ రాస్తే, డిజిపి, హోంమంత్రి భుజాలు తడుముకోవడం ఏమిటి..?
-ఏపిలో ఫోన్ ట్యాపింగ్ లలో, సుప్రీంకోర్టు పేర్కొన్న హేతుబద్ద కారణాలు ఉన్నాయా..?
-ఆర్టికల్ 19,21ప్రకారం ఇది రాజ్యాంగ ఉల్లంఘనే, కేంద్ర చట్టాల ఉల్లంఘనే
-ఏపిలో ఫోన్ ట్యాపింగ్ పౌర హక్కులను, ప్రాథమిక హక్కులను కాలరాయడమే
-ఇది సుప్రీంకోర్టు ఆదేశాలను ధిక్కరించడమే, ‘‘రూల్ ఆఫ్ లా’’ ను అతిక్రమించడమే
-ప్రధాని స్పందన దాకా డిజిపి, హోం మంత్రి ఎందుకని ఆగలేక పోయారు..?
-ప్రతిపక్షాలను లేకుండా చేయడానికి, జ్యడిషియరీని బ్లాక్ మెయిల్ చేయడానికి బరితెగించారు
-వాదనలు వినిపించే న్యాయవాదుల ఫోన్ ట్యాపింగ్ కన్నా తీవ్ర నేరం మరొకటి లేదు.
-దేశ భద్రతకు భంగం వాటిల్లిందా ఇక్కడ ఏ అంశంలోనైనా..? ప్రజా భద్రతకు భంగం కలిగిందా ఇందులో ఎక్కడైనా..? మరి ఏ కారణంతో అడ్వకేట్లు, జడ్జిల ఫోన్లను ట్యాపింగ్ చేస్తున్నారు..?
-ట్యాపింగ్ పై సర్వీస్ ప్రొవైడర్లకు ఏమైనా లిఖితపూర్వక ఆదేశాలు అందజేశారా..?
-ఫోన్ ట్యాపింగ్ లో రాష్ట్ర ప్రభుత్వమే ముద్దాయి. ముద్దాయే సాక్ష్యాధారాలు ఇవ్వాలని అడగడం ఎక్కడైనా ఉందా..?
-ట్యాపింగ్ పై కేసు పెట్టాలని డిజిపి సలహా ఇవ్వడం మరో విడ్డూరం. ఇందులో రాష్ట్ర ప్రభుత్వమే దోషిగా ఉన్నప్పుడు ఎవరిపై కేసు పెట్టాలి..? డిజిపి, హోంమంత్రి స్పందన ఫోన్ ట్యాపింగ్ పై అనుమానాలను బలపరుస్తోంది
-వైసిపి ప్రభుత్వ దుశ్చర్యలపై మండిపడ్డ యనమల రామకృష్ణుడు

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై గతంలో అనేక సందర్భాల్లో, అనేక రాష్ట్రాల్లో జరిగిందేమిటో చూశాం. హైకోర్టులు, సుప్రీంకోర్టు దీనిపై స్పష్టమైన మార్గదర్శకం చేశాయి.
1)ప్రజా భద్రతా ప్రయోజనాలు, 2) అత్యవసర పరిస్థితులు ఉత్పన్నం అయితే, దేశ సార్వభౌమాధికారానికి, దేశ సమగ్రతకు భంగం వాటిల్లిన సందర్భాల్లో మాత్రమే దీనికి ఆమోదం ఉంటుందని పియూసిఎల్ వర్సెస్ భారత ప్రభుత్వం కేసులో సుప్రీంకోర్టు పేర్కొంది. మాస్ సర్వైలెన్స్ ప్రొహిబిటెడ్ అన్నారు.
ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ 1885 ప్రకారం, దీనిపై ఇంటర్ సెప్షన్ ఆర్డర్స్ ఇవ్వాల్సి వుంటుంది. ఆర్డర్స్ ఇచ్చేముందు అందులో పైన పేర్కొన్న హేతుబద్ద కారణాలు ఉన్నాయా లేదా అనేది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల హోం శాఖల కార్యదర్శులు చూడాలి. ఆ తర్వాతే సదరు ఆర్డర్ కాపీలను సర్వీస్ ప్రొవైడర్లకు అందజేయాలని స్పష్టంగా నిర్దేశించింది.
ఇప్పుడు మన రాష్ట్రంలో జరుగుతున్న ఫోన్ ట్యాపింగ్ లలో అలాంటి హేతుబద్ద కారణాలేమీ లేవు. హైకోర్టులు పేర్కొన్న మార్గదర్శకాలు గాని, సుప్రీంకోర్టు నిర్దేశించిన 2అంశాలుగాని ఇక్కడ వర్తించేవి కావు.
అటువంటప్పుడు ఆర్టికల్ 21, ఆర్టికల్ 19 ప్రకారం ఈ ఫోన్ ట్యాపింగ్ లన్నీ రాజ్యాంగ ఉల్లంఘనలే, కేంద్ర చట్టాల ఉల్లంఘనలే. రాజ్యాంగం కల్పించిన ప్రాధమిక హక్కుల ఉల్లంఘనలే.
హైకోర్టు మార్గదర్శకాలను, సుప్రీంకోర్టు ఆదేశాలను ఇది పూర్తిగా ధిక్కరించడమే. (పియూసిఎల్ వర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కేసులో 1997లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్ పేజి 568)
అత్యున్నత స్థాయిలో వ్యక్తుల ఫోన్ ట్యాపింగ్ లు చేయడం ‘‘రూల్ ఆఫ్ లా’’ కు ఇది వ్యతిరేకం.
నిజంగా ట్యాపింగ్ చేయాల్సిన పరిస్థితులే వస్తే, లిస్ట్ ఆఫ్ టెలిఫోన్ల జాబితా సర్వీస్ ప్రొవైడర్లకు ఇవ్వాలి, డేటా కలెక్షన్ చేపట్టాలని సర్వీస్ ప్రొవైడర్లను ఆదేశించాలి.
ప్రధాని నరేంద్రమోదికి మాజీ సిఎం చంద్రబాబు లేఖ రాస్తే, దానికి డిజిపి స్పందించడం నిజంగా భుజాలు తడుముకోవడంలాగానే ఉంది.
దళిత యువకుడు వర ప్రసాద్ శిరోముండనం కేసులో రాష్ట్రపతి ఏవిధంగా స్పందించారో, అదేవిధంగా ప్రధాని కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ పై స్పందిస్తారు. అప్పటిదాకా ఆగకుండా డిజిపి వెంటనే భుజాలు తడుముకుని, కొన్నిగంటల్లోనే మాజీ సీఎంకు లేఖ రాయడం, హోం మంత్రి ప్రెస్ మీట్ పెట్టడం విచిత్రంగా ఉన్నాయి.
రాజకీయ పార్టీలను అణిచేయడానికి, ప్రతిపక్షాలను లేకుండా చేయడానికి, జ్యుడిసియరీని బ్లాక్ మెయిల్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వ పెద్దలే బరితెగించారనేది స్పష్టంగా తెలుస్తోంది. ఇది ప్రజాస్వామ్య విరుద్దం, రాజ్యాంగ సూత్రాల ఉల్లంఘన, ప్రాథమిక హక్కులను కాలరాయడమే.
ఏపిలో ఫోన్ ట్యాపింగ్ గురించి మీడియాలో కథనాలు వచ్చాయి. దానిపై తన బాధ్యతగా మాజీ సీఎం చంద్రబాబు ప్రధానికి లేఖ రాశారు. తర్వాత పరిణామాలపై ఎదురు చూడకుండా రాష్ట్ర హోం మంత్రి, డిజిపి స్పందించడాన్నిబట్టి అనుమానాలు మరింత బలపడుతున్నాయి.
ఫోన్ ట్యాపింగ్ కన్నా తీవ్ర నేరం మరొకటి లేదు. వివిధ అంశాలపై న్యాయస్థానాల్లో న్యాయవాదులు వాదనలు వినిపించేటప్పుడు, న్యాయవాదులు వాదనలను జడ్జిలు వినేటప్పుడు, అడ్వకేట్ల ఫోన్లను, జడ్జిల ఫోన్లను ట్యాప్ చేయడం అనేది చాలా తీవ్రమైన అంశం.
ఇంతకన్నా ప్రమాదకరమైన పోకడ మరొకటి లేదు. దురుద్దేశ పూర్వకంగా రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు చేస్తున్న ఈ దుర్మార్గాలను ఖండిస్తున్నాం, వ్యతిరేకిస్తున్నాం.
దేశ భద్రతకు భంగం వాటిల్లిందా ఇక్కడ ఏ అంశంలోనైనా..? ప్రజా భద్రతకు భంగం కలిగిందా ఇందులో ఎక్కడైనా..? మరి ఏ కారణంతో అడ్వకేట్లు, జడ్జిల ఫోన్లను ట్యాపింగ్ చేస్తున్నారు..?
ట్యాపింగ్ పై సర్వీస్ ప్రొవైడర్లకు ఏమైనా లిఖితపూర్వక ఆదేశాలు అందజేశారా..? ఇచ్చివుంటే సదరు ఫోన్ నెంబర్ల లిస్ట్ బైట పెట్టాలి. వాళ్లిచ్చిన సమాచారం వెంటనే కేంద్రానికి పంపాలి.
ఫోన్ ట్యాపింగ్ చేసేది రాష్ట్రప్రభుత్వంలో వాళ్లే. ఇందులో రాష్ట్ర ప్రభుత్వమే ముద్దాయి. ముద్దాయే సాక్ష్యాధారాలు తనకివ్వాలని అడగడం ఎక్కడైనా ఉందా..? ఇంతకన్నా విడ్డూరం ఏమైనా ఉంటుందా..?
ట్యాపింగ్ పై కేసు పెట్టాలని డిజిపి సలహా ఇవ్వడం మరో విడ్డూరం. ఇందులో రాష్ట్ర ప్రభుత్వమే దోషిగా ఉన్నప్పుడు ఎవరిపై కేసు పెట్టాలి..?
అందుకే కేంద్రానికి ఫిర్యాదు పంపడం జరిగింది. కేంద్రం స్పందన కోసం అందరం వేచి వుండాలి. అలా కాకుండా కేంద్రాన్ని కూడా ప్రభావితం చేసేలా డిజిపి, హోంమంత్రి వ్యాఖ్యలు చేయడం సబబు కాదు.
ఫోన్ ట్యాపింగ్ పై మీడియాలో కథనాలు రాకూడదని ఆంక్షలు పెట్టడానికి అదేమీ నిషేధిత అంశమేమీ కాదు. మీడియా ప్రతినిధులను సోర్సెస్ వెల్లడించాలని కోరడం జర్నలిజం మూలసూత్రాలకే వ్యతిరేకం అనేది రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు గుర్తుంచుకోవాలి.
ఆంధ్రప్రదేశ్ లో చట్టాలను అతిక్రమించి, న్యాయవ్యవస్థను అతిక్రమించి, రూల్ ఆఫ్ లాను అతిక్రమించి ఇష్టారాజ్యంగా చేస్తున్నారు. కేంద్రం తక్షణమే జోక్యం చేసుకుని ఈ దుశ్చర్యలకు అడ్డుకట్ట వేయాలి.
యనమల రామకృష్ణుడు
శాసనమండలి ప్రధాన ప్రతిపక్ష నేత