నూతన్‌ నాయుడు ఇంట్లో నిర్వాకం

2214

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ వీరాభిమాని, పరాన్నజీవి దర్శకుడు నూతన్‌ కుమార్‌ నాయుడు ఇంట్లో ఓ దళిత యువకుడికి ఘోర అవమానం జరిగింది. తమ ఇంట్లో పని మానేశాడన్న నెపంతో నూతన్‌కుమార్‌ నాయుడు భార్య మధుప్రియ.. కర్రి శ్రీకాంత్‌ అనే యువకుడికి శిరోముండనం చేయించిన ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. తనకు జరిగిన అవమానంపై బాధితుడు పెందుర్తి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు సమగ్ర దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

► విశాఖ జిల్లా పెందుర్తి సమీపంలో గిరిప్రసాద్‌నగర్‌లోని నూతన్‌కుమార్‌ నాయుడు ఇంట్లో కర్రి శ్రీకాంత్‌ అనే యువకుడు నాలుగు నెలల క్రితం పనికి చేరాడు. వ్యక్తిగత కారణాలతో ఆగస్టులో పని మానేశాడు. అయితే శుక్రవారం శ్రీకాంత్‌కు నూతన్‌కుమార్‌ భార్య మధుప్రియ ఫోన్‌ చేసి ‘నువ్‌ సెల్‌ఫోన్‌ తీశావు.. ఇంటికిరా మాట్లాడాలి’ అని పిలిచింది.
► అక్కడకు వెళ్లిన శ్రీకాంత్‌ను నిర్బంధించి అతడిపై తప్పుడు ఆరోపణలు గుప్పించారు. ఈ క్రమంలో స్థానికంగా ఉన్న సెలూన్‌ నిర్వాహకుడు రవిని పిలిపించి మధుప్రియ సమక్షంలో శ్రీకాంత్‌కు శిరోముండనం చేయించారు.
► తీవ్ర మనస్తాపానికి గురైన శ్రీకాంత్‌ పెందుర్తి పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు వెస్ట్‌ ఏసీపీ శ్రావణ్‌కుమార్, ఎస్సీ, ఎస్టీ విభాగం ఏసీపీ త్రినా«థ్‌ పెందుర్తి పీఎస్‌కు చేరుకుని బాధితుడితో మాట్లాడారు. అతడి వాంగ్మూలం మేరకు నిందితురాలు మధుప్రియ సహా నలుగురిని జరిగిన ఘటనపై విచారిస్తున్నారు.
► ఈ ఘటనలో నూతన్‌కుమార్‌నాయుడు పాత్రపై లోతుగా విచారణ చేస్తున్నారు. కాగా నూతన్‌ కుమార్‌ నాయుడు జై సమైక్యాంధ్ర పార్టీ తరఫున పెందుర్తి ఎమ్మెల్యేగా 2014లో పోటీ చేశారు. గతేడాది ఓ చానల్‌లో ప్రసారమైన బిగ్‌బాస్‌ షోలో పాత్రధారి. ఇటీవల విడుదలైన పరాన్నజీవి చిత్రానికి దర్శకుడు. విశాఖ నగర మాజీ మేయర్, ప్రస్తుత టీడీపీ నేతకు వ్యాపార భాగస్వామి అని సమాచారం. జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌కు సన్నిహితుడు, వీరాభిమాని.
► ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు సాగుతోందని విశాఖ సీపీ మనీష్‌కుమార్‌ సిన్హా తెలిపారు. ఘటనను ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లామని పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్‌రాజ్‌ చెప్పారు. తననేమైనా చేస్తారని భయంగా ఉందని, ప్రభుత్వం జోక్యం చేసుకుని న్యాయం చేయాలని బాధితుడు కర్రి శ్రీకాంత్‌కోరాడు.