ఏపీ ప్రభుత్వం రాజధాని బిల్లులకు గవర్నర ఆమోదంతో చట్టాలుగా మారుస్తూ గజెట్ విడుదల చేసింది. దీని పైన రైతులు హైకోర్టులో ఈ చట్టాల అమలు నిలిపివేయాలంటూ పిటీషన్ దాఖలు చేసారు. దీనిని విచారించిన త్రిసభ్య ధర్మాసనం ప్రభుత్వాన్ని కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని సూచిస్తూ తొలుత ఈ నెల 14వ తేదీ వరకు ఆ చట్టాలు అమలు కాకుండా స్టేటస్ కో ఉత్తర్వులు ఇచ్చింది.
దీని పైన ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టులో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు నిలిపివేయాలంటూ స్పెషల్ లీవ్ పిటీషన్ దాఖలు చేసింది. దీని పైన రెండు రోజుల క్రితం విచారణకు సిద్దమైన సమయంలో చీఫ్ జస్టిస్ కుమార్తె అమరావతి రైతుల తరపున వాదిస్తున్న విషయం తెలియటంతో ఆయన నాట్ బిఫోర్ మీ అంటూ..ఈ కేసును మరో బెంచ్ కు బదిలీ చేయాలని కోరుతూ కేసును వాయిదా వేసారు. ఇక, ఈ రోజు ఈ కేసు జస్టిస్ నారీమన్ వద్దకు వచ్చింది. అయితే, ప్రభుత్వ పిటీషన్ కు వ్యతిరేకంగా అమరావతి పరిరక్షణ సమితి సైతం కోర్టును ఆశ్రయించారు.
అయితే, రైతుల తరపున న్యాయమూర్తి తండ్రి న్యాయవాదిగా వాదనలకు సిద్ద పడటంతో..జస్టిస్ నారీమన్ నాట్ బి ఫోర్ మీ అంటూ కేసును మరో బెంచ్ కు బదిలీ చేయాలని ఆదేశించారు. దీంతో..ఈ కేసు మరో సారి వాయిదా పడింది. అయితే, ప్రస్తుతం సుప్రీంకోర్టు ఈ నెల 27వ తేదీ వరకు స్టేటస్ కో ఉత్తర్వులు అమల్లో ఉంటాయని స్పష్టం చేయటంతో..ప్రస్తుతం ప్రభుత్వం సుప్రీంలో విచారణ పైన ఫోకస్ చేసింది.