టిడిపి దళిత నాయకులతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్

2176
Andhra Pradesh Chief Minister N. Chandrababu Naidu. (Photo: IANS)

రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న గొలుసుకట్టు దాడుల నేపథ్యంలో శనివారం ఉదయం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు టిడిపి దళిత నాయకులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రజా ప్రతినిధులు, ఎస్సీ సెల్ నాయకులు, సీనియర్ నేతలు పాల్గొన్నారు.చిత్తూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు పులివర్తి నాని, అమరనాథ్ రెడ్డి, ఎమ్మెల్సీ దొరబాబు, అనిశారెడ్డి, శ్రీనాథ్ రెడ్డి తదితరుల హవుస్ అరెస్ట్ చేయడాన్ని చంద్రబాబు ఖండించారు. చంద్రబాబు మాట్లాడుతూ, ‘‘ ప్రజల్లో ఒత్తిడి తట్టుకోలేకే ఓం ప్రతాప్ మృతదేహానికి పోస్ట్ మార్టమ్ చేశారు. టిడిపి పట్టుబట్టడం వల్లే పోస్ట్ మార్టమ్ జరిపారు. రహస్యంగా పోస్ట్ మార్టమ్ చేయాల్సిన అవసరం ఏమిటి..? మీడియాను రానివ్వకుండా పోస్ట్ మార్టమ్ చేయడం ఏమిటి..? ఉరేసుకుని చనిపోతే పోస్ట్ మార్టమ్ చేయడం పోలీసుల బాధ్యత. తమ బాధ్యత పోలీసులు నిర్వర్తించక పోవడం తొలి తప్పు. అది చేయకుండా హడావుడిగా అంత్యక్రియలు జరపడం మరో తప్పు. చివరికి ఏదో మొక్కుబడిగా పోస్ట్ మార్టమ్ తంతు ముగించారు. మృతుడి మొబైల్ ఫోన్ ను పోలీసులే లాగేసుకోవడం మరో తప్పు. కేసు లేకపోతే ఓం ప్రతాప్ సెల్ ఫోన్ ఎందుకు తీసుకెళ్లారు..? ఈ కేసులో మృతుడు ఓం ప్రతాప్ కాల్ లిస్ట్ ముఖ్యం. ఓం ప్రతాప్ కాల్ లిస్ట్ ను బైట పెట్టాలి. చనిపోవడానికి ముందు ఓం ప్రతాప్ కు ఎవరెవరు బెదిరింపులు చేశారో బైటపెట్టాలి.
బెదిరించి, ప్రలోభాలు పెట్టి, జరిగిన నేరాన్ని కప్పెట్టాలని చూడటం హేయం.
చౌటపల్లిలో మరో దళితుడి ప్రాణాలు కూడా తీశారు. ట్రాక్టర్ బోల్తా పడి చనిపోయాడని నమ్మించారు. అటవీ ప్రాంతంలో ఎర్రమట్టి తీసుకెళ్లడానికి వెళ్లిన ట్రాక్టర్ బోల్తా పడి మీ నాయన చనిపోయాడని చెప్పారు. మృతదేహం ఒళ్లంతా కాలిన గాయాలు ఉన్నాయి. మృతుడు నివసించే వీధిలో సిమెంట్ రోడ్డు ప్రారంభించారు. వైసిపి శిలాఫలకాన్ని ధ్వంసం చేశారనే కక్షతో అతడిని చంపేసి ట్రాక్టర్ బోల్తా పడిందనే నాటకం ఆడుతున్నారు. ట్రాక్టర్ బోల్తా పడి చనిపోతే కాలిన గాయాలు ఎలా ఉంటాయి..?
గతంలో చిత్తూరు జిల్లాలో (కెవి పల్లి క్రాస్ రోడ్డులో రొంపిచర్ల) త్రిపుల్ మర్డర్ జరిగింది. మళ్లీ ఇప్పుడు అంతకు మించిన నేరాలు, ఘోరాలకు పాల్పడుతున్నారు.
చిత్తూరు జిల్లాలో దళితులపై వరుస దాడులకు మంత్రి పెద్దిరెడ్డి అరాచకాలే కారణం.
నెల రోజుల క్రితం పుంగనూరులో దళిత బాలికపై గ్యాంగ్ రేప్ జరిగింది. యేర్పేడులో మరో దళిత మహిళపై అత్యాచారం చేశారు. శ్రీ కాళహస్తిలో దళిత యువకుడిని కొట్టి చంపేశారు. వైసిపి అధికారంలోకి వచ్చాక చిత్తూరు జిల్లాలో దళితుల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది.
దళితులపై దాడులకు పాల్పడేవాళ్లను అడ్డుకోలేక, నేరస్థులపై కఠిన చర్యలు చేపట్టలేక, వాటిని బైటపెట్టిన వాళ్లనే సాక్ష్యాధారాలు ఇవ్వాలని ఎస్ పి కోరడం బాధ్యతారాహిత్యం.
విశాఖలో ఇంకో దళిత యువకుడికి శిరోముండనం చేశారు. పెందుర్తి నియోజకవర్గం సుజాత నగర్ లో శ్రీకాంత్ కు శిరో ముండనం చేయడం గర్హనీయం. ఫోన్ దొంగతనం సాకుతో, అక్రమంగా నిర్బంధించి దళిత యువకుడిని దారుణంగా హింసించడం అమానుషం.
దళితులపై రాష్ట్రంలో ఇన్ని దారుణాలు చేస్తుంటే వైసిపి ప్రభుత్వం మొద్దు నిద్ర పోతోంది. 3నెలల్లో వరుసగా 2జిల్లాలలో శిరో ముండనాలు మానవత్వానికే సిగ్గుచేటు. తూర్పుగోదావరి జిల్లాలో వర ప్రసాద్ శిరో ముండనం, విశాఖలో శ్రీకాంత్ శిరోముండనం వైసిపి ప్రభుత్వానికి సిగ్గుచేటు. వరప్రసాద్ శిరోముండనం ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేస్తే, ఇప్పుడీ విశాఖ శ్రీకాంత్ శిరో ముండనం జరిగేదా..?
వరుస శిరో ముండనాలకు సీఎం జగన్ బాధ్యత వహించాలి. దళితులపై ఇన్ని దాడులు జరుగుతోన్నా సీఎం జగన్ కనీసం ఖండించక పోవడం దారుణం. శిరో ముండనానికి పాల్పడిన వాళ్లను అరెస్ట్ చేయరా..? అత్యాచారాలకు పాల్పడిన వాళ్లపై చర్యలు తీసుకోరా…? హత్యలు చేసిన వాళ్లపై కఠిన చర్యలు చేపట్టరా..? జగన్ అండతోనే అన్ని జిల్లాలలో అరాచక శక్తులు పేట్రేగి పోతున్నాయి.
టిడిపి హయాంలో దళితుల సాధికారత కోసం కృషి చేశాం. జస్టిస్ పున్నయ్య కమిషన్ వేశాం. 42సిఫారసులు చేస్తే ప్రతిదానిపైన జీవో ఇచ్చాం. దళితుల హక్కులను కాపాడాం. మండలాల స్థాయిలో పర్యవేక్షణ కమిటీలు వేశాం. రెండు గ్లాసుల సిద్దాంతానికి వ్యతిరేకంగా పోరాడాం. ఎస్సీ, ఎస్టీ కమిషన్ వేశాం. దాడులు, దౌర్జన్యాలకు అడ్డుకట్ట వేశాం. దళితులకు అత్యున్నత పదవులు ఇచ్చి గౌరవించాం.
వైసిపి నాయకులు దళితులను నమ్మించి మోసం చేశారు. దళితుల ఓట్లతో అధికారంలోకి వచ్చి వాళ్ల ప్రాణాలనే బలి తీసుకోవడం కిరాతకం.
15నెలలుగా దళితులపై గొలుసుకట్టు దాడులు చేస్తున్నారు. వరుస దాడులతో దళితులను బెంబేలెత్తిస్తున్నారు. ఇష్టారాజ్యంగా దాడులు చేస్తే సహించేది లేదు.
దళితుల ప్రాణాలంటే వైసిపి నాయకులకు చులకనగా మారింది. ఎంత మందిని చంపినా, ఎన్ని అత్యాచారాలు చేసినా, శిరో ముండనాలు చేసినా తమను ఎవరూ ఏమీ చేయలేరనే అహంభావంతో వైసిపి వ్యవహరిస్తోంది.
రాష్ట్రంలో దళితులపై జరుగుతోన్న దాడులన్నీ వైసిపి కిరాతక చర్యలే. దళితులపై ఇంత దమనకాండ దేశంలో ఎక్కడా లేదు. ఎవరి ఓట్లతో అయితే గద్దె ఎక్కారో, వాళ్ల ప్రాణాలే బలిగొనడం రాక్షసత్వం.
వీళ్ల బాధలు పడలేక ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి తెచ్చారు. వైసిపి వేధింపులు భరించే కన్నా చావే శరణ్యంగా భావించడం సిగ్గుచేటు.
దళితులపై దాడుల కేసులలో దోషులకు శిక్ష పడేదాకా వదిలి పెట్టరాదు.
దళితులపై వైసిపి హింసాకాండను మానవతావాదులంతా గర్హించాలి. ప్రజా సంఘాలన్నీ వైసిపి అరాచకాలను ఖండించాలి. బాధిత దళిత కుటుంబాలకు బాసటగా అందరూ నిలబడాలని’’ చంద్రబాబు ఈ టెలికాన్ఫరెన్స్ లో పేర్కొన్నారు.
ఈ టెలికాన్ఫరెన్స్ లో చిత్తూరు జిల్లా టిడిపి నేతలు అమరనాథ్ రెడ్డి, కిశోర్ కుమార్ రెడ్డి, శ్రీనాథ్ రెడ్డి, దొరబాబు, మాజీ మంత్రులు జవహర్, నక్కా ఆనంద్ బాబు, ఎమ్మెల్యే డిబివి స్వామి, విజయ్ కుమార్, దేవతోటి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.