ఇండియా-పాక్‌ మధ్య బయటపడిన సొరంగం

2788

దాయాది దేశం పాకిస్తాన్‌ కుయుక్తులు మరోసారి బట్టబయలయ్యాయి. భారత్‌- పాక్‌ అంతర్జాతీయ సరిహద్దు వద్ద గల కంచె కింద ఓ సొరంగ మార్గాన్ని సరిహద్దు భద్రతా బలగాలు గుర్తించాయి. దాదాపు 20 మీటర్ల పొడవు, 25 అడుగుల లోతు గల ఈ టన్నెల్‌ ముఖద్వారం వద్ద లభించిన ప్లాస్టిక్‌ ఇసుక సంచులపై పాకిస్తానీ గుర్తులు(కరాచీ, శకర్‌ఘడ్‌ అనే పదాలు) ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఉగ్రవాదులు భారత్‌లో చొరబడేందుకు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు వీలుగా ఈ సొరంగాన్ని నిర్మించినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు అంతర్జాతీయ సరిహద్దు వెంబడి పలు చోట్ల భూమి కుంగినట్లుగా కనిపించిందని, ఈ నేపథ్యంలో కంచె కింద భాగంలో ఈ సొరంగాన్ని గుర్తించినట్లు వెల్లడించారు. వెంటనే యంత్రాలను రప్పించి దానిని పూడ్చినట్లు తెలిపారు.
అదే విధంగా తాజా ఉదంతంతో పెద్ద ఎత్తున సెర్చింగ్‌ ఆపరేషన్‌ చేపట్టినట్లు భద్రతా బలగాలు తెలిపారు. ఇటీవల పంజాబ్‌ సరిహద్దులో ఐదుగురు సాయుధులైన చొరబాటుదార్లను హతం చేసిన తర్వాత ఈ మేరకు యాంటీ- టన్నెల్‌ డ్రైవ్‌ చేపట్టినట్లు తెలిపారు. ఈ విషయం గురించి బీఎస్‌ఎఫ్‌ డైరెక్టర్‌ జనరల్‌ రాకేశ్‌ ఆస్తానా మాట్లాడుతూ.. చొరబాటు నిరోధక గ్రిడ్‌ వద్ద భద్రతను మరింత పటిష్టం చేయాలని ఫ్రాంటియర్‌ కమాండర్లకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. ఇదిలా ఉండగా.. బీఎస్‌ఎఫ్‌ ఇన్సెప్టర్‌ జనరల్‌(జమ్ము) ఎన్‌ఎస్‌ జమాల్‌ ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితులను సమీక్షించారు. పాకిస్తానీ బార్డర్‌లోని ‘గుల్జార్‌’ పోస్టుకు 700 మీటర్ల దూరంలో ఈ టన్నెల్‌ను గుర్తించినట్లు వెల్లడించారు.