ప్రధాని నరేంద్రమోడీ నాయకత్వంలోని కేంద్రమంత్రి వర్గం కస్తూరి రంగన్ నివేదికను జాతీయ విద్యావిధానం 2020గా అమోదించింది. ఇందులో అనేక అనుకూల అంశాలతో పాటు సమస్యలు, సవాళ్ళు వున్నాయి. సుమారు 3 దశాబ్దాల తర్వాత భారతదేశంలో కొనసాగుతున్న విద్యావిధానం పైన సమీక్ష చేసి అనేక సిఫారసులను చేసిన కస్తూరి రంగన్ నివేదిక సమకాలీన సమస్యలకు అద్దం పడుతుంది.ఈ నివేదిక భారతదేశంలో ఆర్థిక సంస్కరణలు 30 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంలో వచ్చింది. దేశంలో అమలవుతున్న నూతన ఆర్థిక విధానాల ఫలితంగా విద్యా వ్యవస్థలో మార్పులు చేయాల్సిన అవసరాన్ని ఈ నివేదిక తేల్చి చెప్పింది.
అత్యంత కీలకమైన అంశాలలో ఒకటి – పాఠశాల విద్య వయస్సును 3 నుంచి 18 సంవత్పరాలుగా గుర్తించి సూచనలు చేయడం. పూర్వ ప్రాథమిక విద్య నుంచి పాఠశాల విద్య పూర్తి అయేంతవరకు సమగ్రమైన సిఫారసులు చేసింది.
పూర్వ ప్రాథమిక విద్యను 0-3 సంవత్సరాల వయస్సు వరకు తల్లి,పిల్లల పౌష్టికాహారం, విద్య , ఆరోగ్యం వంటి అంశాలను అంగన్‌వాడి కేంద్రాలను నిర్వహిస్తున్నాయి. మూడు నుంచి 6 సంవత్సరాల వయస్సు కలిగిన పిల్లలకు సరైన విద్య పౌష్టికాహారం వంటి అంశాలలో సరైన దిశా నిర్ధేశం లేక పోవడం వల్ల వీరిలో చాలా మంది బాల కార్మికులుగా మారిపోతున్నారని అనేక పరిశోధనలలో తేలింది. పలు స్వచ్చంధ సంస్థల అనుభవం కూడా ఇదే చెబుతోంది. ఈ వయస్సులోని వారు పాఠశాలలో చేరినా వారికి అక్కడ నాణ్యమైన విద్య లభించడం లేదని కూడా అనేక అధ్యయనాలలో తేలింది. ఈ సమస్యకు పరిష్కారంగా 3-6 సంవత్సరాల వయస్సు కలిగిన పిల్లలకు ఆటపాటలతో కూడిన చదువును ఆహ్లాదకరమైన వాతావరణంలో అందించడంతో పాటు పౌష్టికాహారం అందించాలను కేంద్ర ప్రభుత్వం సంకల్పించింది. ఈ వయస్సు పిల్లల చదువుకు సంబంధించిన పాఠ్యాంశాల రూపకల్పన చేసే బాధ్యతను జాతీయ విద్యా, పరిశోథన, శిక్షణా సంస్థ (ఎన్‌సిఆర్ టి) కు అప్పగించారు
మూడు నుంచి 6 సంవత్సరాల వయస్సు వారిని గుర్తించి నాణ్యమైన విద్యకు పునాది వేయడం సరైన నిర్ణయం అయినప్పటికీ 3-18 సంవత్సరాల వయస్సు వారిని ప్రాథమిక నిర్భంధ విద్య చట్టం 2009 లో చేర్చకపోవడం వల్ల ఈ విద్యా విధాన నిర్ణయం విమర్శలకు చోటిచ్చింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన 60 ఏళ్ళ తర్వాత ఉచిత నిర్భంధ ప్రాథమిక చట్టం 2009 వచ్చింది. ఈ చట్టం ప్రకారం దేశంలోని 6-14 సంవత్సరాల వయస్సున్న ్రపతి బాలబాలికలకు ప్రాథమిక విద్య రాజ్యాంగబద్ధమైన హక్కు. జాతీయ విద్యా విధానం 2020లో పాఠశాల విద్యను 3-18 సంవత్సరాలుగా విధాన నిర్ణయం తీసుకోవడం వల్ల ఉచిత నిర్భంధ ప్రాథమిక విద్యా చట్టం 2009 పై అనేక ప్రశ్నలు తెలెత్తుతున్నాయి. ఈ నిర్ణయం వల్ల 2009 విద్యా హక్కు చట్టం అలాగే కొనసాగుతుందా, రద్దు చేస్తారా లేక ఈ చట్టాన్ని 3-18 సంవత్సరాలకు పొడిగిస్తారా అనేది ప్రశ్నార్థకంగా వుంది.
ఉన్నత విద్యకు సంబంధించిన 4 సంవత్సరాల కాలంలో ఏ సంవత్సరంలోనైనా విద్యార్థి చదువు నుంచి నిష్క్రమించడం వల్ల సర్టిఫికెట్ ను , రెండు సంవత్సరాలు పూర్తి చేస్తే డిప్లొమాను, మూడు సంవత్సరాలు పూర్తి చేస్తే పట్టాను (డిగ్రీ), నాలుగు సంవత్సరాలు పూర్తి చేస్తే సమీకృత పట్టా (ఇంటిగ్రేటెడ్ డిగ్రీ) పొందవచ్చు. ఈ విధానంలో 1,2 సంవత్సరాలలో పొందిన సర్టిఫికెట్ వల్ల ఉపాధి అవకాశాలు వుంటాయా? అన్నది ఒక ప్రశ్న కాగా, రెండవది విద్యార్థికి విషయ పరిజ్నానం పైన పట్టు వుంటుందా?ఉన్నత విద్యకు సంబంధించి ఈ విద్యా విధానం ద్వారా జాతీయ స్థాయిలో ఉన్నత విద్యామండలి రానున్నది. ఈ మండలి కింద ఉన్నత విద్య నియంత్రణా సంస్థ, జాతీయ అకాడమి, అక్రిడేషన్ మండలి, జాతీయ నిధుల కేటాయింపు సంస్థ, సాధారణ విద్యా మండలి అనే నాలుగు కొత్త సంస్థలను ఏర్పాటు చేయబోతున్నారు.
ఉన్నత విద్యకు సంబంధించి ఈ విద్యా విధానం ద్వారా జాతీయ స్థాయిలో ఉన్నత విద్యామండలి రానున్నది. ఈ మండలి కింద ఉన్నత విద్య నియంత్రణా సంస్థ, జాతీయ అకాడమి, అక్రిడేషన్ మండలి, జాతీయ నిధుల కేటాయింపు సంస్థ, సాధారణ విద్యా మండలి అనే నాలుగు కొత్త సంస్థలను ఏర్పాటు చేయబోతున్నారు. ఇన్ని సంస్థల వల్ల ఉన్నత విద్య కేంద్రీకృతమవుతుందా అనే సందిగ్దం తలెత్తుతోంది. గత అనుభవాల దృష్టిలో వుంచుకుని చూసినప్పుడు ఉన్నత విద్యా నియంత్రణ కు సంబంధించిన సంస్థలన్నీ దేశ రాజధానిలో కేంద్రీకృతమవడం వల్ల ఉన్నత విద్యలో నాణ్యత లోపించింది అనే విమర్శ .
2020 జాతీయ విద్యా విధానం ముందుకు తెచ్చిన మరో ముఖ్యమైన అంశం నైపుణ్యాలను పెంపొందించడం, వృత్తి విద్యలను ప్రోత్సహించడం. వీటి ద్వారా వీటిని అభ్యశించిన వారిని స్వయం ఉపాధి కొరకు ప్రోత్సహించడం లేదక కార్పొరేట్ రంగానికి కావలసిన నైపుణ్య ం కలిగిన శ్రామిక శక్తిని తయారు చేయడమా అనే ప్రశ్న లేవనెత్తుతున్నారు. కాలం గడుస్నున్న కొలదీ ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు తగ్గిపోవడం వల్ల వృత్తి విద్యలలో నైపుణ్యం పొందిన వారికి ప్రభుత్వం ఉద్యోగం దొరకడం కష్టమవుతోంది. కనుక స్యయం ఉపాధి ద్వారా సాంప్రదాయబద్ధమైన చేతి వృత్తి సేవల్లో ఉపాధి అవకాశాలు సృష్టించుకోవడం లేక ప్రైవేటు కార్పొరేట్ రంగంలో శ్రామికుడిగా ఉపాధి పొందడం ద్వారా వచ్చే ఆదాయం తక్కువగా వుండడమే కాకుండా, చాకిరి చాలా ఎక్కువగా వుంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఆ వృత్తులను వదలివేసిన వారు పట్టణాలకు వలస వచ్చి ఇటీవల కరోనా సంక్షోభంలో ఎంత ఇబ్బ ంది ఎదుర్కొన్నారన్న విషయం ప్రపంచానికంతా తెలుసు. అందు వల్ల వృత్తి నైపుణ్యం పొందిన వారికి వున్న ఒకే ఒక ఉపాధి అవకాశం కొర్పొరేట్ రంగం మాత్రమే.
ఫలితంగా వృత్తి నైపుణ్యం పొందిన వారి నుంచి ప్రైవేటు కార్పొరేట్ రంగా పెద్ద ఎత్తున ప్రయోజనం పొందనుంది.
అదే విధంగా దేశ ఆర్ఙికవ్యవస్థ పెద్ద ఎత్తున ప్రైవేటుపరం అవుతున్న ందు వల్ల విద్యా రంగం కూడా ఇందుకు మినహాయింపు కాదు. ఒక పక్క ప్రైవేటు మరొక పక్క ప్రభుత్వ రంగ ఉన్నత విద్యా సంస్థలు పోటీపడడం తో పాటు విదేశీ విద్యా సంస్థలతో కూడా పోటీపడంతో పాటు విదేశీ సంస్థలతో కూడా పోటీ పడవలసి వుంటుంది. ప్రభత్వ విద్యా సంస్థలలో విద్య నాణ్యతా ప్రమాణాలు పెంచడానికి మౌలిక సదుపాయాలు పెంచడంతో పాటు బోధనా సిబ్బంది నియాయకం కీలకమైనది. ఈ విద్యా విధానం ద్వారా దేశంలోని ప్రతి జిల్లాలో విశ్వవిద్యాలయం ఏర్పాటు కాబోతుంది. ప్రస్తుతం ఉనికిలో వున్న విద్యా సంస్థలలో కొన్ని సంవత్సరాలుగా నియామకాలు లేకపోవడం వల్ల సుమారు 30-40 శాతం బోధనా సిబ్బంది పోస్టలు ఖాళీగా వున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.
ఈ సమస్యలు, సవాళ్లతో పాటు ఈ విద్యా విధానంలో ఇంకా కీలకమైన అంశాలపైన లోతుగా చర్చింది ఈ విధానాలను అమలు చేయడానికి జారీ చేసే ఆచరణాత్మక నియమ నిబంధనలలో వివరణాత్మకంగా స్పష్టం చేయాల్సి వుంది.
జి.వరలక్ష్మి
రీసెర్్చ స్కాలర్
డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్
యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాద్