13 మందికి కరోనా: బీసీసీఐ

2809

మరికొద్ది రోజుల్లో డ్రీమ్‌ 11 ఐపీఎల్‌ పదమూడో సీజన్‌ ప్రారంభమవుతుండగా చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఆటగాళ్లు, సిబ్బంది కరోనా బారిన పడటం అటు క్రికెట్‌ అభిమానుల్నే కాకుండా ఇటు బీసీసీఐ అధికారుల్ని కూడా కలవరపాటుకు గురిచేసింది. ఇద్దరు ఆటగాళ్లు, మరో 11 మంది సహాయక సిబ్బందికి వైరస్‌ సోకిందని కొద్దిసేపటి క్రితమే ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. దీంతో ఈ మెగా టోర్నీ నిర్వహణతో పాటు ఆటగాళ్ల ఆరోగ్యానికి సంబంధించి మరిన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించింది.   
అన్ని జట్లూ యూఏఈకి చేరుకున్నాక ఆగస్టు 20-28 తేదీల మధ్య ఆటగాళ్లకు, సహాయక సిబ్బందికి, ఆయా జట్ల యాజమాన్యాలకు అందరికీ కలిపి 1,988 ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్షలు నిర్వహించామని చెప్పింది. అందులో ఇద్దరు క్రికెటర్లకు, 11 మంది సిబ్బందికి వైరస్‌ సోకిందని నిర్ధారించింది. ప్రస్తుతం వారిని ఐసోలేషన్‌లో ఉంచామని, ఎలాంటి కరోనా లక్షణాలు లేవని పేర్కొంది. వారిని కలిసిన ప్రైమరీ కాంటాక్టులు కూడా స్వీయ నిర్బంధంలో ఉన్నారని చెప్పింది. అలాగే ప్రత్యేక వైద్యాధికారులను నియమించి వారికి చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించింది. మరోవైపు ఈ టోర్నీ జరిగే అన్ని రోజులూ పకడ్బందీ ఏర్పాట్లు చేయడంతో పాటు తరచూ అందరికి కరోనా పరీక్షలు నిర్వహిస్తామని బీసీసీఐ స్పష్టం చేసింది.